6, అక్టోబర్ 2023, శుక్రవారం

కాఫీ కథ:

 #కాఫీ కథ:

రచన - గొల్లపూడి మారుతీరావు గారు


ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని రాశాను. దాని పేరు ‘కాఫ్యాంతం కావ్యం’. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత... 


7వ శతాబ్దంలో ఇథియోపియాలో ఓ గొఱ్ఱెల కాపరి పొలంలో పచ్చగడ్డిని తింటున్న గొఱ్ఱెలు ఉన్నట్టుండి మత్తుగా ఉండటాన్ని గమనించాడట. కారణం- ఒకంతకిగాని అర్థం కాలేదు. చెట్లకి కాసిన ఏవో వింత పళ్లు తినడం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని కని పెట్టాడట. తనూ తిన్నాడు. తనకీ మత్తుగా అనిపించింది. ఆ విధంగా మొదటి కాఫీ గింజల రుచి మనిషికి అందింది.


క్రమంగా సంపన్న కుటుంబాల వారికి ఈ మత్తు అందింది. ఇస్లాం దేశాలలో ఈ గింజలతో ‘గావా’ అనే వైన్‌ని తయారు చేసేవారట. ఈ వైన్‌ని ‘వైన్ ఆఫ్ అరేబియా’, ‘డెవిల్స్ డ్రింక్’ అనేవారట. అయితే మత్తు రుచిగా, సుఖంగా ఉంది కదా? ఈ కారణానికే క్రైస్తవ దేశాలలో ఈ గింజల ద్రావకాన్ని వింతగా చూశారు. మరి దీన్ని నిషేధించాలా వద్దా? ఎవరు నిర్ణయించాలి? పోప్‌గారి దగ్గరికి ఈ ధర్మ సందేహం చేరింది. ఆయనా కాఫీని రుచి చూశారు. చూసి తన్మయుడయిపోయాడు. నిషేధించడానికి మనసు రాలేదు. కాగా, తమ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్లూరింది. దాన్ని నిషేధిం చకపోగా ఈ ద్రావకానికి మతాన్ని ఇచ్చి ‘పెద్దల ద్రావకం’గా అంగీకరించారు. అప్పటి నుంచీ వాటికన్‌లో ఈ కాఫీ జొరబడింది.


టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రాధాన్యం సంపాదించుకుంది. సమాజ ధర్మంలో భాగమయిపోయింది. పెళ్లికి ఫలానా అమ్మాయి వరుడుకి తగిన భార్య అవునా కాదా ఎలా నిర్ణయించాలి? ఆ పిల్ల కాఫీ తయారు చేయాలి. ఆ కాఫీ రుచిని బట్టి ఆ అమ్మాయిని ఎంపిక చేసేవారట. అది ఆ అమ్మాయి మొదటి అర్హత. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఏ కారణం చేతయినా అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ తయారు చేసే ఒడుపుని నష్టపోతే- భర్త కోర్టుకి వెళ్లి విడాకులకి అర్జీ పెట్టుకోవచ్చు. టర్కీ ఆడపిల్ల ఏదయినా నష్టపోవచ్చుకానీ, కాఫీ తయారు చేసే పనివాడితనాన్ని పోగొట్టుకోకూడదు.


భారతదేశంలో కాఫీ కథ ఇంకా విచిత్రమైనది. బాబూ బూడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవక్త 16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకి వెళ్లి తిరిగి వస్తూ యెమన్ నుంచి ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి తీసుకువచ్చాడు. ఏడు గింజలే ఎందుకు? ఇస్లాంకి 7 చాలా పవిత్రమైన అంకె కనుక. వాటిని కర్ణాటకలో చిక్ మగుళూర్ కొండల్లో నాటాడు. అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అనేవారట. దరిమిలాను కర్ణాటక, నాగినహళ్లి ప్రాంతంలో కొండల్ని ఇప్పటికీ బాబూ బుదం గిరి - అని అంటారు. 7 గింజలతో దిగుమతి అయిన కాఫీని ప్రస్తుతం 107 దేశాలకు భారతదేశం ఎగుమతులు చేస్తోంది.

ఈ కాఫీ పంటకీ అరకు లోయకీ బంధుత్వముంది. 1890 ప్రాంతంలో అరకు లోయ పొలాల్లో 3 సంవత్సరాల దిగుబడి ఇచ్చే పంటల తర్వాత పోడు వ్యవసాయానికి  ప్రత్యామ్నాయంగా ఈ కాఫీ పంటని అప్పటి జయపూర్ మహారాజు, బ్రిటిష్ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో వేశారట. ఇప్పటికీ యూరోపు ‘మార్నింగ్ కాఫీ’కి అరకులో పండిన కాఫీ గింజలనే శ్రేష్ఠంగా చెప్పుకుంటారు. 


అసలు వినడానికే ఇబ్బందిగా, కాస్త వెగటుగా, కాని వాస్తవమయిన విచిత్రమైన కాఫీ ఒకటుంది. అది ఇండోనేసియాలో తయారవుతుంది. చాలా ఖరీదయిన, ఎంతో రుచికరమైన కాఫీ అది. ఇండోనేిసియాలో ‘సివిట్’ అనే పిల్లికి కాఫీ పళ్లు తినిపిస్తారట. కాఫీ గింజలమీద ఉన్న పొట్టుకోసం పిల్లి తింటుంది. పొట్టు ఊడి, గింజలు పిల్లి శరీరంలో ప్రయాణం చేసి, దాని పేగులలోంచి వెళ్తూ కొన్ని రసాయనికమైన మార్పులకు లోనవుతాయి. తర్వాత పిల్లి ఆ గింజల్ని విస ర్జిస్తుంది. వాటిని ఏరి, శుభ్రం చేసి, వేయించి కాఫీ చేస్తారు. ఈ కాఫీ చాలా విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది. ఒక కప్పు 5 డాలర్ల నుంచి వంద డాలర్లు ఉంటుంది. దీని పేరు ‘సివిట్ షిట్ కాఫీ’ (తెలుగులో ‘సివిట్ పెంట కాఫీ’).


మా ఆవిడ చెప్పిన కథ - దాదాపు 65 సంవత్సరాల కిందట రాజమండ్రిలో ఆమె నాయనమ్మ - అంటే శ్రీపాద కామేశ్వరరావుగారి సతీమణి రూలు ప్రకారం కాఫీని చిన్న పిల్లలు తాగకూడదు. ఎందుకని? మత్తు రుచులు మరిగి చెడిపోతారని. మా అత్తగారు - అంటే ఆవిడ పెద్ద కోడలు - తన అత్తగారికి తెలియకుండా పిల్లలకి చిన్న గ్లాసుల్లో కాఫీ అందించేదట. వీళ్లు తలుపు చాటున నక్కి - దొంగతనంగా కాఫీ తాగి ఆనందించేవారట. ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ‘.... జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని వాపోయాడు శ్రీనాథుడు. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. అలాగే ఆలోచనలోకయినా రాని ఒకప్పటి ద్రావకం ఇవాళ నిత్యావసరమైపోయింది. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి.


అక్టోబర్ 1 అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ☕

కామెంట్‌లు లేవు: