*నాగమణిగారి నియమం..*
"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..
స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..
తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..
నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..
ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి