6, అక్టోబర్ 2023, శుక్రవారం

తొలగిన వేదన..

 *తొలగిన వేదన..*


"దాదాపు నలభైఏళ్ళు దాటింది..అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు..చాలా మారిపోయింది..అప్పుడు ఈ సమాధి మందిరం మాత్రం ఉండేది..ముందు వైపు ఒక తాటాకుల పందిరి..అందులోనే తలదాచుకునే వాళ్ళం..పర్లేదు ఇప్పుడు వసతులు ఏర్పడ్డాయి.."అన్నారు ఈశ్వరయ్య గారు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణం అంతా తిరిగి చూసిన తరువాత.."బాబూ..నేను మా ఆవిడ మరో రెండురోజులు ఇక్కడ ఉంటాము..మాకు వసతి చూపించు.." అని అడిగారు..సరే అన్నాను..మా సిబ్బందికి చెప్పి ఒక గదిని వాళ్లకు కేటాయించాము..ఆరోజు గురువారం..ఈశ్వరయ్య దంపతులు స్వామివారి సమాధిని దర్శించుకొని..మంటపం లో కూర్చున్నారు..కొద్దిసేపటి తరువాత నా వద్దకు వచ్చి.."ఆరోజుల్లో ఇక్కడ ఇలా ఆహారపు ఏర్పాటు లేదు..మాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారని తెలిస్తే..మీ అమ్మా నాన్న గార్లు భోజనం పెట్టేవారు..మీ అమ్మగారి చేతి ప్రసాదం తిన్నవాళ్ళలో మేము కూడా ఉన్నాము..నువ్వు మంచిపని చేస్తున్నావు..ప్రతిరోజూ ఈ మందిరానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశావని ఇక్కడి వాళ్ళు చెప్పుకుంటున్నారు..ఈ మారుమూల ప్రదేశం లో ఆకలితో బాధపడకుండా చేస్తున్నావు.." అన్నారు..


"మీరు స్వామివారు జీవించి ఉండగా చూసారా?.." అని అడిగాను ఈశ్వరయ్య గారిని.."లేదు బాబూ..ఆ అదృష్టానికి నోచుకోలేదు..1978 లో మా వివాహం జరిగింది..మా నాన్నగారు పట్టుబట్టి మా దంపతులను ఇక్కడికి తీసుకొచ్చారు..అప్పటికి స్వామివారు సిద్ధిపొంది సుమారు ఒకటిన్నర సంవత్సరం అయింది అని చెప్పారు..ఆరోజు స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..జీవితం లో స్థిరపడాలి..అన్ని విధాలా బాగుండాలి.." అని కోరుకున్నాను..మరుసటి నెలలోనే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం లో చేరాను..ఆ ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదు..ఉద్యోగరీత్యా దేశంలో చాలా ప్రాంతాల్లో వున్నాను..నిజాయితీగా పనిచేశాను..మూడేళ్ల తరువాత మొదటి సంతానంగా కుమారుడు పుట్టాడు..ఆ తరువాత అమ్మాయి పుట్టింది..ఇద్దరినీ చదివించాను..అబ్బాయికూడా మంచి ఉద్యోగం లోనే వున్నాడు..వాడికి ఇద్దరు పిల్లలు..అమ్మాయి అల్లుడూ ఢిల్లీ లో వుంటున్నారు..ఒకరకంగా చెప్పాలంటే..స్వామివారిని నేను కోరుకున్న కోరికను..స్వామివారు తీర్చారు..ఆ కృతజ్ఞత చూపించుకునే అవకాశం ఇంతవరకూ కలుగలేదు..రిటైర్మెంట్ అయిన తరువాత చాలా క్షేత్రాలు చూసాము..ఈలోపల మా అమ్మాయి కాపురం లో కలతలు వచ్చాయి..అదొక దిగులు పట్టుకుంది..ఆ సమయం లో ఒక నెల రోజుల క్రితం ఈ క్షేత్రం గురించి గుర్తుకు వచ్చింది..పెళ్ళైన కొత్తలో వెళ్ళాము..మళ్లీ వెళ్ళలేదు..ఒక్కసారి చూసివద్దాము..ఆరోజు మీరు ఆ స్వామిని కోరుకున్న కోరిక నెరవేర్చాడు కదా..?..ఈరోజు మన బిడ్డ గురించి ఆ స్వామినే వేడుకుందాము..ఫలితం ఉంటుందేమో..అని మా ఆవిడ కూడా చెప్పింది..ఇలా బయలుదేరి వచ్చాము.." అన్నారు..


ఆరోజు సాయంత్రం ఆ దంపతులు స్వామివారి మందిరం లోనే నిద్ర చేశారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు స్వామివారి సమాధి మందిరం తో సహా మొత్తం ప్రాంగణం శుభ్రం చేసే కార్యక్రమం చూసి..ఈశ్వరయ్యగారు కూడా పాల్గొన్నారు..మరుసటిరోజు ఉదయాన్నే మాలకొండ క్షేత్రానికి వెళ్లి మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వచ్చారు..శనివారం నాటి సాయంత్రం జరిగే పల్లకీసేవ లో పాల్గొనడానికి తమ దంపతుల పేర్లు నమోదు చేసుకున్నారు..పల్లకీసేవ వద్ద అర్చన చేయించుకొని..ఒక ప్రదక్షిణ అయ్యేవరకూ పల్లకీ మోసి ఇవతలికి వచ్చి కూర్చున్నారు..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."బాబూ ప్రసాద్..చాలా తృప్తిగా వుందయ్యా..ఈ మూడురోజుల నుంచీ ఏదో ఒక సేవలో పాల్గొన్నాము..మనసుకు ప్రశాంతం గా ఉన్నది..మా ఇద్దరికీ మనసులో ఉన్న వేదన స్వామివారికి నివేదించుకున్నాము..కూతురు సంసారం బాగుంటే అదే చాలు..మాకు ఈ వయసులో ఆ ఒక్క దిగులూ లేకుండా చెయ్యి నాయనా..అని వేడుకున్నాము..ఆ ఒక్క దిగులూ తీరి పోయి..దాని సంసారం గాడిన పడితే..వాళ్ళను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తాము.." అన్నారు..ఆదివారం ఉదయం ప్రభాతసేవ కూడా చూసి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వెళ్లారు..


మరో రెండు నెలల తరువాత..ఈశ్వరయ్య గారు ఫోన్ చేసి.."బాబూ ప్రసాద్..వచ్చేవారం మేమందరమూ మొగిలిచెర్ల కు వచ్చి..దత్తాత్రేయ స్వామివారి సమాధి దర్శించుకుంటాము..ముఖ్యంగా మా కూతురు అల్లుడూ వస్తున్నారు..అన్ని సమస్యలూ తీరిపోయాయి..అల్లుడూ కూతురూ ఇప్పుడు హాయిగా వున్నారు..అందుకే వాళ్ళను తీసుకొని వస్తున్నాము..స్వామివారు మా దంపతుల మొర ఆలకించారు..స్వామివారి మంటపం లోనే నిద్ర చేస్తాము..ప్రత్యేకంగా రూమ్ లేకున్నా పర్వాలేదు..మేము శని, ఆదివారాలు అక్కడ ఉంటాము కనుక..ఆ రెండురోజులూ అన్నదానానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాము..ఈరకంగా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుని మా మొక్కు చెల్లించుకుంటాము.." అన్నారు..


స్వామివారి అనుగ్రహాన్ని పొందిన ఈశ్వరయ్య దంపతులు ఆ విధంగా స్పందించడం లో ఆశ్చర్యం లేదు..గత మూడేళ్ళుగా ఆ దంపతులు స్వామివారి ఆరాధన రోజు ఈ క్షేత్రానికి వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: