17, సెప్టెంబర్ 2020, గురువారం

తెలుగు పద్యమంటే...



తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా?
నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.

కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాటి పాదాల సమాహారం పద్యం. ఇదీ నా నిర్వచనం.
"పద సముదాయం" అని కాకుండా "అక్షర సముదాయం" అని ఎందుకన్నానూ అంటే, తెలుగులో, ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలోనూ మరికొంత రెండవపాదంలోనూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:


శ్రీరఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

ఇందులో ఏ పాదం తీసుకున్నా చివరి పదం కొంతభాగమే ఆ పాదంలో ఉండి మిగతాభాగం రెండవ పాదంలోకి వెళుతోంది.
అయితే, ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కుందండోయ్!

తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన

పైది ఛందోబద్ధమైన పాదాల సమాహారమే. కానీ పద్యం కాదు, దానికి అర్థం లేదు కాబట్టి. అందువల్ల పద్యాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు.

"ఛందోబద్ధమైన అక్షరాల సమాహారం పాదం. పాదాల అర్థవంతమైన సమాహారం పద్యం".

తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?

ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.

అబ్బే, అలాంటి దేమీ‌ లేదూ.  తెలుగు పద్యానికి బ్రహ్మాండమైన ఆదరణ ఉందీ,  జనం‌ ఎగబడి తెలుగు పద్యాలు చదివి సంతోషిస్తున్నారూ అని యెవరైనా అంటే వాళ్ళు అయితే వంచన చేస్తున్నారనైనా అనుకోవాలి లేదా ఆత్మవంచన చేసుకుంటున్నారనైనా అనుకోవాలి.

ఒకప్పుడు సంస్కృతభాష మాత్రమే కావ్యాలు వ్రాయటానికి తగిన మాధ్యమం అనుకునే వారు.  అయితే‌ కాల క్రమేణా దేశీయ భాషల్లోనూ కావ్యాలు రావటం మొదలయింది.

కన్నడంలో పావులూరి మల్లన అనే ఒక తెలుగు కవి మహాభారతకథను ఒక గ్రంథంగా రచించాడు.  ఆయన జైనుడు కాబట్టి ఆ గ్రంథంలో అందరూ జైనులు. పాండవులు మహాశ్వేత భక్తులు ఇత్యాది. ఆర్షమతానికి జైనం సవాలు విసరటం ఒక కారణంగా, దేశభాషలో మహాభారతాన్ని అందించాలని నన్నయభట్టారకులవారి ప్రయత్నం మెదలయింది.  అయితే నాటి చదువరులు పూర్తి దేశభాషాకవిత్వన్ని మెచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాకచక్యంగా తెలుగు సంస్కృతాల మిశ్రమ భాషలో అందంగా నన్నయ గారు వ్రాసారు.  ఒక పద్యం చూడండి ఉదాహరణకు:

మ. వివిధోత్తుంగ తరంగఘట్టన చలద్వేలావనైలావలీ
లవలీలుంగలవంగసంగత లతాలాస్యంబు లీక్షించుచుం
ధవళాక్షుల్ సని కాంచిరంత నెదుటం దత్తీరదేశంబునం
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్

మీరు తెలుగువారై ఉండి తెలుగుభాషలో మంచి పాండిత్యం ఉన్నవారై ఉంటే ఈ‌పద్యం అర్థం అవుతుందా?

ఎంతమాత్రం కాదు. ఈ‌ పద్యంలో ఉన్న మాటలనుభాషల వారీగా పట్టీ వేస్తే అలా యెందుకన్నదీ బోధపడుతుంది.

వివిధ, ఉత్తుంగ, తరంగ, ఘట్టన, చలత్, వేలా, వన, ఇలావలీ, లవలీ, లుంగ, లవంగ, సంగత, లతా, లాస్యం, ఈక్షించు, ధవళ, అక్షి, చని, కాంచు, అంత, ఎదుట, తత్, తీర, దేశంబు, అవదాత, అంబుజ, ఫేన, పుంజ, నిభ, ఆ, అశ్వ, ఉత్తమ, దవ్వు.

ఇందులో‌ఎన్ని తెలుగు మాటలున్నాయి? చని, కాంచు, అంత, ఎదుట, ఆ, దవ్వు. ఈ‌ కాసిని మాటలేగా?  మిగతావన్నీ సంస్కృత పదాలే!

అందు చేత ఈ పద్యం చదివి ఆనందించాలీ అంటే తెలుగు పాండిత్యం అక్కరకు రాదు.  సంస్కృతంలో‌మంచి ప్రవేశం ఉండి తీరాలి.

నన్నయగారు అన్ని పద్యాలూ ఇలాగే వ్రాసారనుకునేరు. విషయం అదికాదు. ఆయనకు సంస్కృతం దట్టించి తెలుగుపద్యాలు వ్రాయవలసిన అక్కర యేర్పడింది నాటి వారి మనోరంజనం కోసం.

కవిత్రయం‌వారు మహాభారతాన్ని తెలుగువారికి అందించారు. తెలుగువాళ్ళు దానిని నెత్తిన బెట్టుకున్నారు. తెలుగులో బోలెడు మంది మహాకవులు రచనలు చేసారు. కాని ఎవరూ సంస్కృతం జోలికిపోకుండా తెలుగులోనే మహాకావ్యాలు వ్రాయలేదు. ఒక్క తిక్కన గారు మాత్రం తెలుగుకు పెద్దపీట వేసి వ్రాసారు సాధ్యమైనంత వరకూ. తరువాత వచ్చినది ప్రబంధయుగం.

ఇన్నాళ్ళ తరువాత అయినా మన తెలుగుకవులు సంస్కృతభాష మీద మోజు నుండి బయట పడ్డారా అంటే లేదనే చెప్పాలి.  ప్రబంధాలలోనూ‌ కవిత్వానికి వాడే భాషలో సంస్కృతానికే అగ్రతాంబూలం.

అందుచేత తెలుగు కావ్యాలూ వగైరా చదువుకోవాలీ అంటే కొంత తెలుగూ బోలెడు సంస్కృతమూ అర్థం అయేటంత భాషాజ్ఞానం సంపాదించాలి. అల్లసాని పెద్దనగారికి ఆంధ్రకవితాపితామహుడని బిరుదు.  ఆయనగారి మనుచరిత్రంలోని ఒక పద్యం చూడండి:

చ.  అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
 
మంచి పద్యం. సందేహం లేదు. ఈ‌ ఒక్క పద్యం సొగసుమీద ఒక వ్యాసం వ్రాయవచ్చును!

ఈ‌ పద్యం నిండా సంస్కృతమే! అట, చను, కాంచె అన్న మొదటి మాటలు మినహాయిస్తే అంతా గంభీరమైన సంస్కృత సమాసాల ఆడంబరవిన్యాసమే.  దాని అందం దాని దనుకోండి. అది వేరే విషయం.  కాని తెలుగుపద్యంలో తెలుగు ఎంతా అన్నది ప్రశ్న.

ఆధునికులు ఏమీ‌తక్కువ తినలేదు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షంలోని యీ పద్యం చూడండి:

శా. నిష్టావర్షదుదారమేఘపటలీ‌నిర్గఛ్చదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజృంభన్మహాఘోరబం
హిష్ఠస్ఫూర్జదుషండజర్ఝరరవాహీనక్రియాప్రౌఢి ద్రా
హిష్ఠంబై యొకరావమంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్

కామెంట్‌లు లేవు: