17, సెప్టెంబర్ 2020, గురువారం

"వేదాంత పంచదశి"*

*42) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

న సద్వస్తు సతః శక్తిర్న హి వహ్నేః స్వశక్తితా ౹
సద్విలక్షణతాయాం తు శక్తేః కిం తత్త్వముచ్యతామ్ ౹౹ 48 ౹౹

48. సత్త యొక్క శక్తియే సత్త కాజాలదు.అగ్ని యొక్క దాహక శక్తియే అగ్ని కాదు గదా.
(అట్లే మాయ కూడా బ్రహ్మము కాజాలదు)
బ్రహ్మము కంటె,సత్తకంటె భిన్నమైనచో ఆ మాయా తత్త్వ మెట్టిదో చెప్పుము.



శూన్యత్వమితి చేచ్ఛూన్యం మాయాకార్యమితీరితమ్ ౹
న శూన్యం నాపి సద్యాదృక్తాదృక్త త్తమిహేష్యతామ్ ౹౹ 49 ౹౹

49. మాయాస్వరూపము శూన్యమనినచో (ప్ర 2.34) శూన్యము మాయా కార్యమని చెప్పబడినది కారణస్వరూపము కార్యస్వరూపము కాజాలదు గదా.కనుక మాయ సత్తయు కాదు,అసత్తయు కాదు, ఇదమిత్థమని చెప్పలేనిది అనిర్వచనీయమైనది అని అంగీకరింపవలెను.


వాఖ్య:- పారమార్ధిక సత్త వ్యవహారిక సత్త ప్రాతిభాసిక సత్తయని సత్త మూడు విధములు.బ్రహ్మము మాత్రమే పారమార్థిక సత్త.ఈ సత్తకు భూత,భవిష్యద్వర్తమానము లందు భంగము లేదు.వ్యవహార కాలమున మాత్రము ఉండునది వ్యవహారిక సత్త.


ఉత్పత్తి వినాశములు కల వస్తువులన్నీ ఈ కోవకు చెందును. వ్యవహారకాలమున కూడ నిజముగ లేక పోయినను ఉన్నట్లు కన్పించునది ప్రతిభాసిక సత్త.ఇంద్రజాలకుడు చూపు వస్తువులిట్టివి.అసత్తు కూడా రెండు విధములు.వంధ్యాపుత్రుడు కుందేటి కొమ్మువలె అసలు లేకనే పోవుట.పగిలిన కుండవలె ఎండిన చెరువు వలె ఒకప్పుడుండినది పిదప నశించుట.


తత్వవివేక ప్రకరణ

కొన్ని వస్తువులు కొంతకాలము పోయిన తరువాత నశించి పోతాయని తెలిసికూడా అవి వున్నంత కాలం ప్రేమతో వ్యవహరించి,కావాలని ఆరాట పడతాము.

ఒక వస్తువు కనిపించి నంతకాలము అది నిజమని అంగీకరిస్తే కలలో కని పించిన నిధి కూడా సత్యమని అంగీకరించాలి.

అలా అంగీకరిస్తే ఆ నిధి ఎలా వచ్చింది?
మళ్ళీ ఎక్కడికి పోతుంది?అనే ప్రశ్నకు సమాధానం దొరకదు.
కనుక నిధి ఆసమయములో సత్యమని అంగీకరించుట సాధ్యంకాదు.

కనిపించినంత మాత్రాన సత్యం కానక్కరలేదని అంగీకరించేటట్లయితే,కొంతకాలం కని పించి,తరువాత కని పించకుండా పోయే ఏవస్తువు అయినా సరే,అసత్యమే (లేనిదే)
కనిపిస్తువున్న సమయంలో కూడా లేనిదే అని అంగీకరించాలి.తప్పదు.

భూత,భవిష్యద్వర్తమాన కాలాలు మూడింటి లోనూ అవిచ్ఛిన్నంగా ని‌బడి వుండే వస్తువు మాత్రమే నిజంగా అస్తిత్వం వున్నవస్తువు.
అదే నిత్యమైన వస్తువు.

ఏక్షణంలో అయినా అది లేనిదయితే,అది త్రికాలాలలోనూ గూడా పూర్తిగా లేనిదే.

“పరబ్రహ్మ పదార్థం” ఒక్కటే నిజమైన నిత్య వస్తువు.

ఈ జగత్తంతా అనిత్యమే అని వేదాలు,పురాణాలు,సృతులు మొదలగునవన్ని ఏకకంఠంగా నిర్ణయించి చెపుతున్నాయి.
ఈ జ్ఞానం మనస్సుకు పట్టవలెను.


బంగారు కంకణము నందు కంకణత్వమున్నదా,అది కేవలము బంగారము కాదా?

శూన్యత్వముతో సంబంధము లేకుండా ఆకాశమనబడు విషయమున్నదా ?

అదేవిధముగా అఖండమయిన బ్రహ్మముతో సంబంధము లేకుండా ప్రపంచమను “వస్తువు” లేదు.

చల్లదనము మంచు గడ్డ నుండి విడదీయరానిగా వున్నట్లే ప్రపంచమనబడునది కూడా బ్రహ్మము నుండి విడదీయరానిదే.

ఇవ్వన్నీ మనకు ఎలా హృదయగత ము అవుతాయి.....
దృఢ చిత్తులకే కదా తత్వ చింతన

సద్రూప వస్తువు యొక్క శక్తి ,సద్రూప వస్తువు నుండియే వ్యక్తమైంది.
వ్యక్తరూపం శక్తి, అవ్యక్త రూపం సద్రూపం.
శక్తి గా పరిమితమైనది, కొన్ని పరిమితులకు లోబడి పని చేస్తుంది.
అదే శక్తి ఘనమైతే సత్తా . ఇది అపరిమితమైనది. 

ఈ( శక్తి )మాయ శూన్యం అంటే దీనిచే ఏర్పడినజగత్తు కూడ శూన్యం కావాలి.

కానీ భ్రాంతి కాలంలో జగత్తు అనేకంగా,ఉన్నట్లుగానే కన్పడుతోంది.


ఈ జగత్తు మిథ్య,ఉన్నది పరమాత్మ,పరమాత్మ యొక్క శక్తి యైన చైతన్యం వ్యక్త రూపంలో జగత్తుగా కనపడుతోంది అనే ఙానదృష్టి పొందేవరకూ సద్వస్తువూ, శక్తీ విలక్షణమే.
అపరోక్షానుభూతితో ఆ ఙానం పొందాక ఏకత్వానుభవం ఉంటుంది.

తత్త్వానుభూతిని పొందిన వారికి తత్త్వచింతన అవసరము లేదు.

అురోక్షానుభూతిని పొందని సాధకులమైన మనకు ఈ చింతన అవసరము.

సూక్ష్మ బుద్ధితో అవగాహన చేసుకుని, అదే బుద్ధితో విచారణతో ఉండి, దాన్ని ఒక దీక్షగా మనం ఆచరణ లో పెట్టుకోవాలి.

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: