17, సెప్టెంబర్ 2020, గురువారం

**మనసున్నవారికే మంత్రశక్తి**


!!మననాత్ త్రాయతే ఇతి మంత్రః!! మననం చేసేవారిని రక్షించేది మంత్రం. మననం అంటే జపం.మంత్రం-మంత్రశక్తి అనగానే పాతసినిమాలలో svr గారిలా చేసే ఇంద్రజాలం అనుకుంటారు కొంత మంది. కొంత మందికి అసలు మంత్రాలమీద నమ్మకమే ఉండదు....వాళ్లకి వాళ్లే సర్దేసుకుంటారు....ఎవరికీ ఏకీడు చేయకుండా మన బ్రతుకు మనం బ్రతికితే చాలు ఈ మంత్రాలు తంత్రాలు ఎందుకమ్మా అని.....😂.
నిజానికి అది తత్త్వ చింతన కాదు,మానసిక పరిణతి అసలు కాదు,అవగాహన రాహిత్యం,లేదా నిజమైన గురువులు,మంత్ర ప్రభావం తెలియకపోవడం. మనచపూర్వజన్మ కర్మ ప్రకారం మన జన్మ నక్షత్రం, లగ్నం మనకు ఉంటాయి.వాటికి సరిపోయి సిధ్దిని కలిగించే దేవతను తెలుసుకుని మంత్రజపం చేయాలి. నిజమైన గురువు ఎప్పుడూ ఎవరడిగితే వారికి మంత్రాలు వెదజల్లడు.ఆ శిష్యుని యొక్క మంత్ర అరవణం,అడకచక్రం పరిశీలించి...కొంతకాలం శుశ్రూష చేయించి,ఆ వ్యక్తి ని పూర్తిగా గమనించి అప్పుడు తగు మంత్రం ఉపదేశిస్తాడు. ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకు ప్రీతి కలిగించే విధంగా ఆ మంత్రజపం చేసే వ్యక్తి యొక్క జీవన విధానం ఉండాలి.నియమ నిబంధనలు ఉంటాయి.విధినిషేధాలు ఉంటాయి. వాటిని నిర్వర్తిస్తూ క్రమపద్ధతిలో చేసిన మంత్రజపం ఖచ్చితంగా సిద్ధిని(శక్తిని, ఫలితాన్ని) ఇస్తుంది. మంత్రం ఎప్పుడూ సిధ్దిని పొందిన గురువు దగ్గరే తీసుకోవాలి. ఆ గురువును జీవిత పర్యంతం గౌరవభావంతో చూడాలి. ఇక అరవణం కుదరని మంత్రాలు తీసుకోవడం వలన చాలా విపరీతాలు జరుగుతాయి. ఒక్కొక్క సారి జీవితం తారుమారైపోతుంది.మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు కొందరు.... కానీ చింతకాయలు కాదు తలకాయలే రాలుతాయి.నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను అటువంటి మంత్రద్రష్టలను దర్శించి సేవించుకునే భాగ్యం దక్కింది.నా గురువు ఒక మహా మంత్ర ద్రష్ట.నా శ్రీ విద్యాగురువు కూడా తద్దేవతా స్వరూపులు(కామెంట్ లో మీ గురువు ఎవరు అని అడగకండి నేను చెప్పను)కనుక నా స్వానుభవంలో మంత్రసిధ్దిని పొందిన వారిని చూసాను,మంత్రం వదిలేసి భ్రష్టులైనవారినీ చూసాను.ఇది మంత్రం యొక్క ఒకవైపు రూపం. ఇంకొక వైపు మంత్ర జపం చేసేవారు నిర్మల మనస్కులై ఉండాలి. హింస,దూషణ,ఈర్ష్య, లోభత్వం ఉండకూడదు. అప్పడే ఆ దేవత ప్రీతి చెంది అనుగ్రహిస్తుంది.నిష్కల్మష మనస్సు తో ప్రార్ధించి రోదించాడు కనుకనే గోపన్న కాళిదాసు అయ్యాడు. అమ్మవారు స్వయంగా తేనే తాగించింది ఆయనకు. ఆయన నోటి నుండి అనాలోచితంగా వచ్చిన మాటలు కూడా నిజమయిన దృష్టాంతాలు కాళిదాసు చరిత్ర లో మనం చూడవచ్చు. స్వకర్మ బుధ్దితో,దేవతా సమర్పణయుతంగా చేసిన మంత్రజపం అద్భుతమైన శక్తులను కలిగిస్తుంది. దానికి పునాది మంచి మనసు....కనుక మనస్సు కలిగిన వారికే మంత్ర సిధ్ది లభిస్తుంది.... స్వస్తి
సర్వజన శ్రేయోభిలాషి
మీ సవ్యసాచి....✍️

కామెంట్‌లు లేవు: