17, సెప్టెంబర్ 2020, గురువారం

అమృత బిందువులు*

*74 - శ్రీరామకృష్ణుని కధామృతం లోని కొన్ని అమృత బిందువులు*
🕉🌞🌏🌙🌟🚩

శ్యా౦పుకూర్ లో శ్రీరామకృష్ణులు.
అక్టోబర్ 1885 .

ఒక శనివారం మధ్యాహ్నం ఒంటిగంటసమయంలో, శ్రీరామకృష్ణులు రెండవ అంతస్థులో తమగదిలో, డా. సర్కార్, నరేంద్రుడు, మహిమాచరణ్, ' మ ' అనే భక్తుడు, మొదలైన వారంతా చుట్టూవుండగా, డాక్టరు గారితో, ' నీ హోమియో వైద్యం బాగానే వున్నది. ' అని ప్రశంసించారు.


తరువాత తాను మాట్లాస్డుతున్నది ప్రముఖ హోమియోవైద్యునితో అని తెలిసి కూడా, రామకృష్ణులు, ' అదిసరే ! నేను భావావస్థలో వున్నప్పుడు భంగు సేవించినట్లు మత్తుగా అనిపిస్తుంది. దాని గురించి నీవేమంటావు ? ' అని అడిగారు. దానికి సమాధానం చెబుతున్న డాక్టరుగారు, ' మ ' తో మాట్లాడుతున్నట్లు, ' ఆస్థితిలో, నాడీ కేంద్రాలు పనిచేయడం మానివేస్తాయి. అవయవాలు అచేతనం అవుతాయి. అయితే, కాళ్లకు రక్తప్రసారం జరుగుతూనే వుంటుంది. ' అని శరీరభాగాలు గురించి విపులంగా చెప్పసాగారు, డాక్టరు గారు.


అలాచెబుతూ, ' రామకృష్ణుల మాటలు మనకెందుకు రుచిస్తాయో తెలుసా ? ఈయన అన్నిమతాలనూ పరిశీలించి, తేనెటీగలు అనేకరకాల పూలనుండి తేనె సేకరించినట్లు, మనకు అందిస్తున్నాడు. అందుకనే మధురమైన వాక్కులు మనం వినగలుగుతున్నాము. ' అన్నారు, డాక్టరుగారు.


ఆమాటలు వినీ విననట్లు రామకృష్ణులు నరేంద్రుని పాటపాడమని అడిగారు. వెంటనే నరేంద్రుడు చక్కని భక్తి గీతం అందుకోగా, కొంతసేపు పాడిన తరువాత, తన్మయులై రామకృష్ణులు, ' పాడు, పాడు , ఇంకా పాడు. ' అని నరేంద్రుని ప్రోత్సహించారు. అన్నిపాటలూ ఐన తరువాత, డాక్టరు గారు కూడా యెంతో సంతోషించి, రామకృష్ణుల వద్ద శలవు తీసుకున్నారు.


ఆ తరువాత సంధ్యాకాలం అయింది. చంద్రోదయం జరిగింది. శ్రీరామకృష్ణులు సమాధిస్థితిలో అలానిలబడి వున్నారు. కాసేపటి కి ,బాహ్యస్పృహ కలిగిన తరువాత, రామకృష్ణులు, మిగిలిన భక్తులవైపు వాత్సల్యంగా చూస్తూ, కూర్చున్నారు. నిత్యగోపాల్ రామకృష్ణుల కాళ్ళు పడుతుండగా, మిగిలిన వారు ఆయన చెప్పే మాటలు వినసాగారు. ఆరోజునుండీ, వంతులవారీగా యువభక్తులను అక్కడే వుంటూ, రామకృష్ణులను సేవించుకునేటట్లు ఏర్పాట్లు జరిగాయి.


రామకృష్ణుల కోరికపై, ' మ ' ఆరోజు రాత్రికి అక్కడే బసచేసాడు. మరునాడు ఉదయం నిద్రలేస్తూనే, ' మ ' వచ్చి రామకృష్ణులకు ప్రణామం చేసి, డాక్టర్ గారికి పరిస్థితి చెప్పడానికి, ' మీ ఆరోగ్యం ఎలా వుంది ? ' అని అడిగాడు. దానికి రామకృష్ణులు, ' తెల్లవారుఝాము సమయంలో నోరు నీటితో నిండిపోతున్నది. దానికితోడు దగ్గుకూడా. ఈ విషయం డాక్టరుగారికి చెప్పి, నేను స్నానం చెయ్యవచ్చునేమో అదికూడా కనుక్కో ! ' అని రామకృష్ణులు ' మ ' కు చెప్పారు.


సుమారు ఉదయం ఏడుగంటలసమయంలో, ' మ ' డాక్టరు సర్కారు గారికి రామకృష్ణుల పరిస్థితి వివరించాడు. ఆసమయంలో, ఆయనకు వైద్యవిద్యనేర్పిన వృద్ధ అధ్యాపకుడూ, మరి ఇద్దరు మిత్రులు, డాక్టర్ గారితో వున్నారు.


' మ ' అలా చెప్పగానే, డాక్టరుగారు స్పందించిన తీరు, ' మ ' తోసహా అక్కడవున్న వారందరినీ విస్మయానికి గురిచేసింది.

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: