17, సెప్టెంబర్ 2020, గురువారం

శని పట్టుకుంటే

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- శని పట్టుకుంటే వదలదంటారు. ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్పింది?

సమాధానం;- శని గ్రహం అంటే అందరికీ చెప్పలేని భయం. శని క్రూరుడనీ, కనికరం లేని వాడనీ, మనుషుల్ని పట్టుకుని పీడిస్తారనీ అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయం సరికాదని జ్యోతిషశాస్త్రం చెపుతుంది.

శనిదేవుడు మహా శివభక్తుడు. ఇద్దరూ భక్తుల కోర్కెల్ని తీర్చేవారే. *జనానాం కర్మఫలోం గ్రహ రూపీ జనార్ధనః* వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్ని ఇచ్చేవాడు జనార్ధనుడు. ఆయనే మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలాల్ని ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు.

అయితే ఎవరు ఎలాంటి కర్మలు చేశారు? వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్ధనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట. ఆ న్యాయస్థానికి అధ్యక్షుడు శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదే. అందుకే తమకేం జరిగినా, ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. శనీశ్వరుడి న్యాయ స్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష.

ఒక వ్యక్తికి గోచార రీత్యా జన్మరాశి కి ముందు పన్నెండో ఇంట, జన్మరాశిలో, జన్మరాశి తర్వాత రెండో ఇంట శని ఉంటే, ఆ వ్యక్తికి ఏలినాటిశని అని లెక్క. శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది.

దానాలు, ధర్మాలు, సత్కార్యాలు, సత్కాల క్షేపాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తాడు. అన్ని గ్రహాలకు పైన ఉండే శ్రీమన్నారాయణుడే అందరికీ రక్ష.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: