17, సెప్టెంబర్ 2020, గురువారం

అద్భుతాల రామగిరి

గోముఖం నుండి జల ఉద్భవించే పుణ్య క్షేత్రం, సంతాన భాగ్యం కలిగించే ఆలయం, మృత్యుభయం
తీర్చే భైరవాలయం,
వాలీశ్వరుని ఆలయం వున్న ఊరు, పంచబ్రహ్మ స్ధలాలలో
ఒకటి అయిన ఊరు,
కొండ మీద కుమార స్వామి ఆలయం, ఇన్ని విశేషాలు కల పుణ్య స్ధలం రామగిరి.
ప్రాచీన కాలంలో తొండై మండలంగా పిలవబడినది.

ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో వున్న నగరి కొండల మీద నుండి ప్రవహించే నదికి ఆరణీ నది అని పేరు.
బ్రహ్మ సృష్టించిన నది అయినందున బ్రహ్మారణ్య నది
అనే పేరు కలదు. కొన్ని వేల ఏళ్ళ క్రిందట ఋషులు అనేకమంది యీ నదీ తీరాన
ఆశ్రమాలు ఏర్పరుచుకుని,
తపస్సు చేసి , చిన్న శివాలయాలు నిర్మించుకొని
పూజిస్తూ వచ్చారు. వాటిలోఒకటి రామగిరి వాలీశ్వరుని ఆలయం.

బ్రహ్మ సృజించిన
ఆరణీ నదీ తీరాన వున్న రామగిరి , సురుటాపళ్ళి,
ఆరణి,అరియత్తురై, పళవేర్కాడు, ఈ ఐదింటినీ
పంచబ్రహ్మ స్ధలాలుగా
కీర్తించాయి జ్ఞాన గ్రంధాలు.
వీటిలో మొదటి రెండు స్ధలాలు ఆంధ్రప్రదేశ్ లో
మిగిలిన మూడు ప్రదేశాలు
తమిళనాడు లో వున్నాయి.

వీనిలో రామగిరి స్థల మహిమని
పురాణాలు శ్లాఘిస్తున్నాయి.

రావణ సంహారానంతరం
అయోధ్యకు తిరిగి పయనమయ్యేడు రాముడు. మార్గమధ్యంలో తనకు తగిలిన
బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకునేందుకు కుల గురువైన వశిష్ఠుని ఆలోచన ప్రకారం,
కాశీ నుండి శివలింగాన్ని
తీసుకు వచ్చి , రామేశ్వరంలో
ప్రతిష్టించి పూజించాలని
సంకల్పించాడు. కాశీ నుండి శివలింగాన్ని తీసుకు రావడానికి హనుమంతుని
నియమించాడు.
హనుమంతుడు కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావడాన్ని
తెలుసుకున్న తిరుక్కారిక్కరై
అనే, రామగిరి లో ఆలయంలో
వున్న , కాలభైరవుడు, , ఆ శివలింగాన్ని తన ఆలయంలో
ప్రతిష్టింప చేయాలని సంకల్పించాడు. అందుకోసం
సూర్యుడు,గంగ , వాయుదేవులని సహాయం చేయమని కోరాడు. దానికి
ఒప్పుకొన్న సూర్యుడు
అధిక ఉష్ణాన్ని కలిగించాడు.
వాయువు పెనుగాలులు
సృష్టించాడు.గంగ హనుమంతుని కంట పడకుండా దాగినది.
ఎండ వేడి వలన హనుమంతునికి తీవ్రంగా దాహం వేసింది, అప్పుడు
రామగిరి లో ఒక నీటి మడుగు (కాళింగ మడుగు) కనపడినది. హనుమంతుడు దాహం తీర్చుకుందికి రామగిరిలో
నేల మీద దిగాడు.
అయినా తన వద్ద వున్న శివలింగాన్ని క్రింద పెట్టడానికి
సందేహించాడు. అప్పుడు
బాలుని రూపంతో వచ్చిన కాలభైరవుడు , హనుమంతునికి సహాయం చేస్తున్నట్టు , ఆ శివలింగాన్ని
తన వద్ద కి తీసుకున్నాడు.
దానితో పాటు ' నీవు ఆలస్యంగా వస్తే శివలింగాన్ని
క్రింద పెట్టేస్తానని ఒక నిబంధన
విధించాడు.

హనుమంతుడు
కాళింగ మడుగుకు వెళ్ళి దాహం తీర్చుకుని వెంటనే వచ్చాడు. కానీ యీలోపునే
బాలుని రూపంలో వున్న భైరవుడు శివలింగాన్ని
తను సంకల్పించుకున్నట్టే
నేల మీద పెట్టేశాడు.
ఇది చూసిన ఆంజనేయుడు
ఆ శివలింగాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా పైకి
ఎత్తలేక పోయాడు.

'సంజీవినీ పర్వతాన్నే ఎత్తి తీసుకుని వచ్చిన తనకి
యిది ఎంత? అనుకుంటూ
తన వాలముతో శివలింగాన్ని
చుట్టి లాగాడు. భగవంతుని దయ వలన శివలింగం కొంచెం
కదలి వంగింది అంతే.
హనుమ తన ప్రయత్నంలో
ఓడిపోడంతో , బాలుని మీద తీర్ధం మీద మండిపడ్డాడు.
అక్కడికి కొంత దూరంలో వున్న కారిగిరి కొండని పెకలించి
మడుగులో పడవేశాడు.
దానితో పాటు ఆ జల ప్రదేశం
వన ప్రదేశంగా మారిపోవాలని
శపించాడు.
ఆఖరికి జరిగినదంతా భగవంతుని నిర్ణయం
అని తెలుసుకున్నాడు.
భూమిలో ప్రతిష్టించబడిన
శివ లింగానికి వందనమాచరించి పూజించి, తిరిగి కాశీకి వెళ్ళి శివలింగం తో రామేశ్వరం చేరాడు అని స్ధల పురాణ వివరణ.

రాముని కోసం తీసుకొని వచ్చిన శివలింగం యీ ఊరిలో ప్రతిష్టించబడినందున, హనుమంతుని వలన
జలం గిరిగా మారినందున ఆ ప్రదేశం
రామగిరిగా పిలువ బడినది.

గోముఖం నోటి నుండి
జలధార. ఈ ఆలయ సమీపాన ఒక తీర్ధం వున్నది.
కాళింగ మడుగుని పర్వతం మూసి వేసినా, భూమికి అడుగున వున్న జలం యీ తీర్ధంలో వున్న నంది నోటి నుండి జలధార నిరంతరం ప్రవహిస్తున్నది. దీని వలన పుష్కరణి నిండి, పైకి ప్రవహించే నీటిని వ్యవసాయానికి వుపయోగిస్తున్నారు.
ఈ నీరు తీయగా వుండడమే
కాకుండా రుగ్మతలను గుణపరిచే ఔషధంగా నమ్ముతారు భక్తులు.

1904 వ సంవత్సరం, త్రవ్వకాల ద్వారా 26 శిలా శాసనాలు లభించాయి.
వీటిలో అతి ముఖ్యమైన 9వ శతాబ్దంలో ని శాసనం పుష్కరణి ముందు కనిపిస్తుంది. ప్రధమ కుళోత్తుంగ చోళుడు (1070),
రెండవ రాజ రాజ చోళుడు
(1163) , మూడవ కుళోత్తుంగ
చోళుడు(1224...1225) ,వీర నరసింహ యాదవరాయన్ ,
మధురాంతక బొత్తాపి చోళన్, వీరగణ్డ గోపాలదేవన్,
గన్డ గోపాలన్ మొదలైన వారు యీ ఆలయానికి చేసిన సేవలు బహిర్గతమౌతున్నాయి.
ఈ శాసనాల ద్వారా 
ఆలయ పూజావిధులకై
వారు చేసిన దాన ధర్మాలు
వివరించబడి
యున్నాయి.

ఆలయ మూలవిగ్రహం
వాలీశ్వరుని
గర్భగుడిలో దర్శిస్తాము.
హనుమంతుడు తన వాలంతో
శివలింగాన్ని చుట్టి లాగి నందున శివలింగం కొంచెం ఒక ప్రక్కకు ఒరిగినట్టు
వుండడం, వాలము చుట్టిన
మచ్చ గోచరిస్తాయి.
సాధారణంగా ఈశ్వరునికి
ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. కాని ఇక్కడ
శివునికి ఎదురుగా హనుమంతుడు ముకుళిత
హస్తాలతో దర్శనమిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు: