17, సెప్టెంబర్ 2020, గురువారం

ప్రణవము

ప్రణవమునకు పూర్వాచార్యులు ప్రసాదించిన వివరణను ఇచ్చట పొందుపరుస్తున్నాను..   అకారమును ఉకారమును కూడినప్పుడు గుణసంధి వచ్చి "ఓ" అగును. దాని తర్వాత "మ" కార మున్నది.  కావున ప్రణవము అకార ఉకార మకారము లనెడి మూడక్షరములుగా ఉన్నది.  శృతియందు "ఓమిత్యేకాక్షరమ్" అని ప్రణవమును చెప్పియుండగా, ఇచ్చట మూడక్షరములుగా విడదీసి చెప్పుట తగునా అని కొందరు శంకిపవచ్చు. ఇందు సంహితకారమని, అసంహితకారమని  రెండు క్రమములు ఉన్నవి. సంధినొందిన ఆకారమును సంహితాకారమనియు, విసంధిగా నుండు ఆకారమును అసంహితాకారమనియు చెప్పుదురు. అసంహితాకారముగా గొనినప్పుడు ప్రణవము ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పదము కావున మూడు పదములు మూడు అర్థములును తెలుపును. సంహితాకారముగా తీసికొన్నప్పుడు ఏకాక్షరముగాను, ఏకపదముగాను, ఏకార్ధముగాను తెలుపుచున్నది. "ఓమిత్యేకాక్షరమ్" అని చెప్పిన శృతికి దీని సంహితాకారము కారణము.

కామెంట్‌లు లేవు: