17, సెప్టెంబర్ 2020, గురువారం

పోత‌న త‌లపులో....55



గోపాలకృష్ణుని దర్శించడానికి హస్తినానగరకాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. క్ర‌మ క్ర‌మంగా కృష్ణ ప‌ర‌మాత్మ ర‌థం దూరంగా వెళుతోంది.....

       ****
"రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్ రాదింక వీక్షింప, నీ
కమలాక్షుం బొడఁగానలేని దినముల్ గల్పంబులై తోఁచు గే
హము లం దుండఁగ నేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మా" యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై.

                        **
తరుణీ! యాదవరాజు గాఁ డితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై
వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు
స్తరలీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్యభా
సుర నే" నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్.

                          ****
“ఓ సఖీ! అదిగో శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్లిపోయింది. ఇక మన కళ్లకు కన్పించదు. కమలాక్షుణ్ణి కనుగొనలేని దినాలు కల్పాలులా తోస్తాయి. ఇక క్షణం సేపు కూడ ఉండలే మీ యిళ్ళలో. మాధవుని వెంట మనం కూడ వెళ్లి ఆయనకు సేవలు చేసుకుంటు అక్కడే హాయిగా ఉండిపోదా” మంది మన్మథుని బాణాలు నాటిన మగువ యొకతె.

                     ***
“చెలీ! వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవప్రభువు కాదే. ఈ దేవాధిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. లోకేశ్వరుణ్ణి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలనో” అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది.

🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️ఆనంద తరంగం,🏵️

కామెంట్‌లు లేవు: