17, సెప్టెంబర్ 2020, గురువారం

మత్స్యావ తార కథ 3
మంజరీ ద్విపద

అవ్విధంబుగ తిమి యర్ధించ నృపుని
ఆతడచ్చెరువొంది యనె మీను తోడ
" ఒక దినంబున శత యోజనంబంత
విస్తరించెడు నీవు విన్నాణముగను
వినము చూడము మేము యిటువంటి ఝషము
మీన జాతుల కిట్టి మేనుండ గలదె !
యేమిటి కెవ్వాడ వీలీల ద్రిప్ప
కరుణ నాపన్నుల గావ వేడంగ
యంభశ్చరంబైన హరివి నీవంచు
యెఱిగితి నేనిన్ను యీశ్వరా !యిపుడు
యవ్యయా ! పరమాత్మ ! నారాయణాఖ్య !
సృష్టి స్థితి లయల చేయు క్రీడందు
సర్వేశ ! యత్యంత చతురుడ వీవు
దీనులకును మాకు దిక్కువు నీవు
సకల భక్తుల కెల్ల సంరక్షు వీవు
నీ యవతారముల్ నిఖిల జీవులకు
భూతి హేతువులయ్య పురుషవరేణ్య !
పరమేశ ! మేము మీ పరులము గాము
నిర్మల జ్ఞానంబు నిండియుండితిమి
గలవు మా కండగా కమలాక్ష ! నీవు
భక్త స్థితుడవీవు పరమాత్మ ! యీశ !
ఆదిదేవా ! ప్రభో ! యనయంబు నీకు
నతి సేయు వానికి నాశ మెట్లుండు ?
శ్రీ లలనా కుచ వేదిక పైన
శ్రీ లలనా కుచ చిత్ స్థలి పైన
క్రీడాంతరంగువై క్రీడించు చుండి
యాధ్యాత్మికానంద మనుభవించేటి
సర్వేశ ! నీవిట్టి తామసంబైన
మత్స్య రూపము నేల మఱి దాల్చినావు ?
విస్మయంబగుచుండె యెఱిగించు దేవ !"
సత్యవ్రతుండిట్లు సప్రార్థనమున
యడుగగా వినియును యానంద ముగను
యయ్యుగ కడపట ప్రళయ కాలమున
సంద్రాన తా నొంటి సంచరించుటకు
తగు మత్స్య రూపంబు దాల్చిన యట్టి
శ్రీహరి యిట్లనె చిద్విలాసముగ

"ఇటమీద నీరాత్రి కేడవ రోజు
పద్మ గర్భుని యొక్క పగలుయై నిండు
భూర్భు వాదిక మూడు భువనంబు లెల్ల
విలయాబ్దిలో మున్గు విపరీతముగను
అప్పుడు నీ కడ కద్భుతంబుగను
నావొక టొచ్చును నాదు పంపునను
అందఱూ నావపై యస్మదానతితొ
సర్వొషధీతతుల సర్వ బీజముల
నిడుకొని సాగేవు నిండు సంద్రమున
ఆ రీతి విహరించు యా నావ యందు
సప్తర్షి బృందంబు సాగు నీతోడ
ముందు కన్పించని ముసురు చీకటిలొ
మిణుకను చుండును మౌనుల మేను
ఆ రీతి దేలుచూ యడ్డు లేకుండ
సాగరంబందున సాగును నావ
ఆ నావ కడలిలో యలల తాకిడికి
స్వాధీన మవకుండ సాగుట కొఱకు
యిరు కెలంకుల యందు వెనుకనూ ముందు
నేనుండి మత్స్యమై యేమఱకుండ
బృహదమౌ నా ఱెక్క యీకల తోడ
యాసన్న మకరుల నంతంబు జేసి
కాపాడుచుందును కడలిలో దిరిగి
అపుడొక పెనుబాము యాసన్న మయ్యు
నగుపించు నక్కడ నాదు యానతితొ
కడలిలో గలిగెడి సుడిగాలి కతన
వడి తిర్గబడకుండ వహియించు టకును
కాకోదరంబుతో గట్టిగా యపుడు
నా మేని కొమ్ముకు నావను గట్టి
కాళరాత్రంతయు గడచెటి వఱకు
మునులకు నీకును మున్నీటి యందు
కడగంద్లు లేకుండ గాచుచూ నుందు .
అందుకే యిటువంటి యద్భుతంబైన
మత్స్య దేహంబును మది దాల్చినాను
పార్థివా ! నే పరబ్రహ్మంబు యనియు
యెఱుగు నా మహిమను విశదంబు గాను
కడువిధి నుండుము కరుణింతు నిన్ను "
ఆ రీతి శ్రీహరి యానతి నిచ్చి
యంతర్హితుండయ్యె నవనీశు యెదుట
అధినాథు డంతట యానంద ముగను
దర్భశయ్యను తూర్పు తలగడ o
పడుకొని మనమందు ప్రాశాంతముగను
ప్రళయకాలంబుకై పరిపూర్ణ మదితొ
యెదురు చూచుచు నుండె విష్ణుని దలచి .

గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: