17, సెప్టెంబర్ 2020, గురువారం

🔔🔥జ్వాలాముఖి జ్యోతిస్వరూపిణీ💥🔔




హిమాచల్ ప్రదేశ్ లో
జ్వాలాముఖి అనే వూరిలో అంబాజీ గబ్బర్
హిల్స్ మెట్ట మీద వున్న
ఒక ఆలయ గర్భగుడి లో
అఖండ దీప జ్యోతి స్వరూపిణిగా జ్వాలాముఖీ దేవి దర్శనమిస్తోంది.

ఆకు పచ్చ, నీలం కలసిన
 ఈ జ్యోతి స్వరూపం , మనకు పార్వతీ దేవి దేహకాంతిని జ్ఞప్తికి తెచ్చి ,మనకు పరవశాన్ని కలుగజేస్తుంది.


ఏభై ఒక్క శక్తి పీఠాలలో
యిది అమ్మవారి నాలిక భాగం
పడిన స్ధలంగా ,యీ అమ్మవారిని కొలుస్తారు.
ఇక్కడి అమ్మవారు తనని నమ్ముకుని చేరవచ్చిన భక్తులను
తనవారిగా చేసుకుని సదా
రక్షిస్తుంది.

సాధారణంగా ఒక అఖండ దీపం వెలిగించాలంటే,చాలా
వత్తులు , ఎంతో నెయ్యి లేదా నూనె కాని సమకూర్చుకోవాలి.


కానీ జ్వాలాముఖి లో
ప్రజ్వరిల్లే జ్యోతి నేతితో లేదా తైలం ,
వత్తులు ఉపయోగించి వెలిగించినది కాదు.

అనాదిగా అక్కడున్న శిలలల నుండి స్వయం ప్రకాశంగా
వెలిగే జ్యోతి స్వరూపం.

ఈ ఆలయంలో దుర్గాదేవి తొమ్మిది జ్వాలలుగా దర్శనమిస్తోంది.
గర్భగుడి లో ఆరు చోట్ల గర్భగుడి కి కుడి ప్రక్క కొంచెం ఎత్తున వున్న సన్నిధిలో మూడు స్థలాలలో యీ తొమ్మిది జ్వాలలను దర్శించవచ్చును.
ఈ జ్వాలావరుసలను మహాకాళి, మహా లక్ష్మీ,మహా సరస్వతి, చండీమాత, అన్నపూర్ణ,హింగ్లాజీయవాణీ,అంబిక,అంజనాదేవి,
వింధ్యవాసిని, అనే నామాలతో నవ దుర్గలు గా కొలుస్తారు.

గర్భగుడి చుట్టూ, వీరగుండం,రాధాకృష్ణులు
శివశక్తి మందిరం, భైరవుని మందిరం,నాగార్జున సిద్దుల శిలలు ,అష్టాభుజాదేవ
మొదలైనవారి
విగ్రహాలు కనిపిస్తాయి.

 ఇక్కడ ఘోరఖ్ డిబ్బీ అనే వింత తీర్ధ పుష్కరిణి ఒకటి వున్నది.
ఇందులోని నీరు అన్ని కాలాలలో సల సల
కాగుతూ బుడగలతో
వేడి నీరులా కనిపిస్తుంది. కానీ , ముట్టుకుంటే మాత్రం
చల్లగానే వుంటుంది. ఇందుకు , ఒక కధ చెప్తారు .

ఒకసారి పరమశివుడు
తన పరివారానికి, ఆహారం తయారు చేయమని పార్వతీ దేవిని ఆదేశించగా
తన చెంత ఎప్పుడూ వేడి నీరు, అగ్ని వుంటాయని అందువలన
ఆహారం సమకూర్చడం తనకు
చిటికెలో పని అని శివుడిని తన పరివారాన్ని తీసుకురమ్మని అలక్ష్యంగా బదులు యిచ్చింది పార్వతి దేవి.
పార్వతీదేవి అహంకార ధోరణి పరమేశ్వరునికి నచ్చలేదు.
వెంటనే ఈశ్వరుడు , పార్వతి
దగ్గర వున్న ,మరుగతున్న
నీటిలో , వెలుగుతున్న జ్వాలలలో,వేడి లేకుండగా చేశేశాడట.ఈనాటికీ ఆ నీరు చల్లగా వుండడానికి శివుడి చర్యే కారణంగా చెప్తారు.

ఈ ఆలయంలో ప్రాతఃకాల పూజలు, సాయంకాల పూజలు, హారతి, అలంకారాలు
ఘనంగా జరుగుతాయి.
నిత్యం రాత్రి సమయాలలో శయన ఉత్సవం
జరుపుతారు.

బంగారు పూతపూసిన వెండి మంచము మీద
పట్టు పానుపులు పరచి,
రూపంలేని అంబికకి
చెవులకు తాటంకాలు, వడ్యాణం,కాళ్ళపట్టీలు, గజ్జెలు, మట్టెలు, హారాలు, కిరీటం మొదలైనవి ఏర్పర్చి ఒక ఆకారం కల్పించి, చుట్టూ పువ్వులు జల్లుతారు. అందువలన నిజంగానే ఆ పాన్పులపై ఒక సౌందర్యరాశి దుర్గాదేవి రూపంలో
శయనిస్తున్నట్లు, అద్భుతంగా దర్శనం కలిగిస్తున్న పవిత్ర భావన భక్తులలో కలుగుతుంది.

పాలు,పళ్ళు,
పిండివంటలతో నివేదన చేసిప్రత్యేక హారతి యిచ్చి, జోలపాటపాడి, అమ్మవారిని నిద్రబుచ్చి గర్భగుడి తలుపులు మూయడం వంటి విశేషాలు యీ స్ధలం యొక్క విశిష్టమైన ఉత్సవంగా చేస్తారు.

ఈ శయన మందిరంలో
దశ మహావిద్యా శక్తులైన
మహాకాళి‌, మహాసరస్వతి, మహాలక్ష్మీ మొదలైనవారి
నిలువెత్తు పాలరాతి
విగ్రహాలు పట్టు వస్త్రాలతో అలంకరించబడి దర్శనమిస్తాయి.
శయనగృహంలో ఒక వైపున వున్న అద్దాల గదిలో, శిక్కు మతస్తుల పవిత్ర గ్రంధం గురుగ్రంధ సాహెబ్ కూడా
చూడవచ్చు.

మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్
పాదుషా యీ నిరంతర జ్వాలలను ఆర్పడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, కాని అవేవీ ఫలించలేదు.

 దుర్గా అమ్మ వారి దివ్య శక్తిని చూసి అక్బర్
ఆశ్చర్య పోయాడు . తరవాత , ఆక్బర్ నలభై ఏడు కిలోల బంగారం తో ఒక అపురూపమైన ఛత్రమును తయారు చేయించి అమ్మవారికి సమర్పించాడు.

 కానీ , అక్బర్ పాదుషా అహంకారాన్ని
అణచడానికి దేవి, ఆ
కానుకను అంగీకరించకుండా,
అష్టధాతువుల లోహంగా అలంకారానికి పనికిరాకుండా మార్చివేసిందట.

ఈనాటి కీ అమ్మ వారి
గర్భగుడి లో యీ అష్టధాతు లోహ ఛత్రము జ్వాలాముఖి
అమ్మవారి సన్నిధికి,
ఎడమ ప్రక్కన ఒక వారగా కనిపిస్తుంది.

 జ్వాలాముఖి ఆలయం సిమ్లా కు రెండు
వందల కి.మీ దూరంలో ఉత్తరాన వున్న పఠాన్ కోట రైల్వేస్టేషన్ నుండి
మరో ఎనభై ఐదు కి.మీ దూరంలో వున్న జ్వాలాముఖి రోడ్ కు నేరోగేజ్ రైలులో వెళ్ళి అక్కడ నుండి మరల
బస్సు లో మరో ఇరవై కి.మీ
ప్రయాణం చేస్తే అప్పుడు
జ్వాలాముఖి అమ్మవారి
ఆలయానికి చేరుకోవచ్చును.

🔔🙏🙏🔔

🌺శేషశ్రీ🌺

కామెంట్‌లు లేవు: