తెనాలి రామకృష్ణుడి చతుర్లు తెలుగువాడి హాస్యానికి చిరునామా అంటారు. కానీ అందులో ‘తీవ్రవాదం’ అక్షరాలా జడలు విప్పి ఉంటుంది. జోలికొస్తే ఎవరినైనా జోలెపట్టేట్టు చేయగలిగిన శక్తిసామర్థ్యాలు రామలింగడి సొంతం. తన తప్పులు ఎంచేవారి మీద ఆయన మూడో కన్ను తెరుస్తాడు. ‘‘తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్మునం/ పలుకగరాదు రోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ/ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగక పెద్దలైన వా/ రల నిరసింతువా! ప్రగడరాణ్ణరసా!విరసా!తుసా!బుసా!’’ అని నరసకవి మీద నారం సంధించాడు. తప్పులు ఎత్తి చూపినవాడి తుప్పు వదిలించాడు. అంతేకాదు... తిట్లతో ఆత్మాతిశయాన్ని కూడా ప్రదర్శించాడు.
ఒకని కవిత్వమందెనయనొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి ముక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్!!
ఇతరుల కవిత్వంలో తప్పొప్పులు ఉండవచ్చుగానీ తన కవిత్వంలో తప్పులు పట్టడానికి వీల్లేదని తెనాలి రామకృష్ణుడు శాసించాడు. కాదని తప్పులు పట్టుకుంటే పట్టుకున్నవాడిని చెప్పుతో కొడతాడట. సంస్కారానికి దహన సంస్కారం చేసేశాడు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే ‘దూకుడు’కు రామకృష్ణుడు పెట్టింది పేరు. భట్టుమూర్తి ‘‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’’ అని సమస్య ఇస్తే తెనాలి రామకృష్ణుడు అభ్యంతరకరమైన పద్యం చెప్పాడు. ‘‘గంజాయి త్రాగి..’’ అంటూ దురహంకారంతో నీచ భాషలో తిట్టేశాడు.
కవులు తిట్టినా, పొగిడినా దీర్ఘసమాసాలు వేడి వేడి సమోసాల్లాగా కరకరలాడతాయి. కందుకూరి రుద్రకవికి రాజుల మీద కోపం వచ్చింది. కోపం వస్తే కవులు వదులుతారా? వదులుతారు మాటల ఈటెల్ని. అవి కవిత్వంలోకి వచ్చి పద్యాలో, గద్యాలో అవుతాయి. రుద్రకవి కోపం ఇలా ప్రవహించింది.. ‘‘తిట్టుదునా మహోగ్రకర తీవ్రవచో వరగద్య పద్య సం/ ఘట్ట ఘరట్ట ఘట్ట వధగా విధిగాచిన నైన మానినీ/ పట్టణ వప్రసౌధమణి బంధుర సైంధవాఢ్యులన్/ బట్టపు రాజులన్ దొరల బండితులన్ దురహంకృతాదులన్’’!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి