17, సెప్టెంబర్ 2020, గురువారం

🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌻 చతుర్ముఖ బ్రహ్మ, శివుడు, మనువులు, దక్షాది ప్రజాపతులు, నిష్ఠాపరులైన సనకసనందనాది మునులు, మరియు పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, వసిష్ఠుడు, అంగిరసుడు మొదలగు మహర్షులును బహు పుణ్యములు ఆర్జించిన వారగు బ్రహ్మవాదులు. అందురును వాక్కును జయించి ఈశ్వరత్వమును సాధించుకొన్నవారు. నిరంతర తపస్సు, యోగసాధన చేసి సమాధి పొందినవారు‌. పరిపూర్ణ మనస్సుతో నిరంతర దైవధ్యానము చేయుచున్నారు. వారైనను భగవంతుని సర్వసాక్షిగా గుర్తుంచుకొనినపుడే ముక్తులగుచున్నారు‌. లేనిచో వారికి గూడ అన్వేషణము చేసియు చూడలేని స్థితి కలుగును.

(ఇట్లనుటచే వీరందరిని తక్కువ చేయుటగాదు. వీరందరును సృష్టింపబడినవారే కనుక పుట్టుకచే అంతర్యాములు కాజాలరు. భగవంతుడు తత్త్వము చేతనే అంతర్యామి. అతని యందు సృష్టి అంతయు జరుగుచున్నను అతనికి ఏమరుపాటు కలుగుట సంభవము కాదు. తపస్సు, యోగము, వేదాధ్యయనము మున్నగునవి ప్రత్యేక లక్ష్యములుగా గమనింపబడినపుడు అంతర్యామి కన్నా వేరుగా గమనింపబడును. అప్పుడు తన సాధన మార్గము మాత్రము దృష్టి యందుండి అందలి అంతర్యామి గుర్తుండడు. ఈ స్థితి దాటునంతగా సర్వకాలములందును, సర్వసాధనములందును సాక్షిగా అంతర్యామిని గుర్తించుచుండవలెను. సాక్షి అనగా స+అక్షి= కన్నులు గలవాడు, చూచువాడు అని అర్థము. ఈ ఋష్యాదులు ఒకరిని ఒకరు చూచి వ్యవహరించుకొనవలెను కనుక చూడబడుచున్నది అంతర్యామియే అని మరువరాదు. ఈ గుర్తింపు చెదరినచో ఎదుటివారు కనుపించి అంతర్యామి మాయమగును.

పై చెప్పిన వారిలో బ్రహ్మకు గూడ ఇట్టి స్థితి కలుగవచ్చును. చతుర్ముఖుడు అహంకరించి కృష్ణుని పరిశీలింపవచ్చుట, రుద్రుడు మోహినీ రూపమును చూచి మోహితుడు అగుట, దక్షుడు గర్వించి పరమేశ్వరునిపై పగబూని శిరశ్ఛేదము పొందుట, సనకాదులు వైకుంఠమున జయ విజయులను శపించి‌ వారి రాక్షస జన్మములలోని దుండగములచే పరాభవింపబడుట ఈ దృష్టి చెదురుటకు నిదర్శనములు. ఈ కథలన్నియు సోపానక్రమమున భాగవత గ్రంథమున కూర్పబడినవి.)......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 872(For more Information about Master EK Lectures please visit www.masterek.org).

కామెంట్‌లు లేవు: