17, సెప్టెంబర్ 2020, గురువారం

14-20-గీతా మకరందము


        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఈ ప్రకారముగ గుణములను దాటినవాడు జననమరణాది దుఃఖముల నుండి విడుదల బొంది మోక్షమును బడయునని వచించుచున్నారు -

గుణానేతానతీత్యత్రీన్
దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైః
విముక్తోఽమృతమశ్నుతే || 

తాత్పర్యము:- జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడుగుణములను దాటి (దాటినచో) పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు - అనువానిచేత లెస్సగ విడువబడినవాడై, మోక్షమును (మరణరహిత ఆత్మస్థితిని) బొందుచున్నాడు.

వ్యాఖ్య:- 'గుణాన్' అని చెప్పినందువలన, రజస్తమములతోబాటు సత్త్వగుణమును గూడదాటి నిర్గుణ పరమాత్మను జేరవలెనని భావము. అయితే మొట్టమొదట తమోగుణమును పారద్రోలి సత్త్వగుణమును బాగుగ అభ్యసించవలెను. ఆ పిదప నిస్సంకల్పాత్మస్థితియందు ఆ సత్త్వగుణము దానియంతట అదియే అతిక్రమింపబడగలదు.
గుణములవలన కలుగు గొప్ప అపకారమేదియో, అవి తొలగినందువలన కలుగు గొప్ప ఉపకారమేదియో ఈశ్లోకమునందు తెలుపబడినది. "దేహసముద్భవాన్” దేహములను సృష్టించుటయే వానివలనగలుగు దారుణమగు అపకారము, వానివలన జీవుడు జననమరణరూపమగు ఈ సంసారచక్రమునుండి తప్పించుకొనజాలడు. ఒక దేహము పోయిన మఱియొక దేహము వచ్చుచుండును. ఇప్పటికి ఎన్నియో కోట్లకొలది జన్మలు, శరీరములు, ఆ త్రిగుణరూపబీజమునుండియే, మూలమునుండియే ఉద్భవించినవి. ఆ మూలము విచ్ఛిన్నముకానిచో ఇంకను ఎన్నియో అగణితములైన జన్మలు రాగలవు. అయితే జన్మవచ్చినచో నష్టమేమి? యని ప్రశ్నించవచ్చును. ఆ నష్టమేమియో భగవానుడే ఈశ్లోకమందు తెలియజేసిరి. ముసలితనము, రోగము, చావు, దుఃఖములు మొదలగు ఆపత్తులన్నియు శరీరోద్భవము వలననే జీవునకు కలుగుచున్నవి. కాబట్టి అసలు శరీరమే రాకుండ, అనగా జన్మలేకుండ చేసికొనుటయే ఉత్తమము అట్టి జన్మరాహిత్యమో గుణములను దాటినపుడే కలుగగలదని ఇచట స్పష్టముగ చెప్పివేయబడినది. కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నములచే తమోగుణమును, రజోగుణమును తెగద్రుంచి, సత్త్వగుణమును దాటివైచి శాశ్వత కైవల్యపదవి నొందవలయును. అయ్యది మరణరహితస్థితి. గనుకనే దానిని "అమృతము" అని భగవాను డిచట పేర్కొనిరి.
"ముక్తః” అని చెప్పక "విముక్తః” అని చెప్పటచే త్రిగుణములను దాటినవాడు జననమరణబంధమునుండి పూర్తిగ విముక్తుడగునని భావము.

ప్రశ్న:- ఈ దేహములు వేనివలన కలుగుచున్నవి?
ఉత్తరము: - త్రిగుణములవలన.
ప్రశ్న:- మరణరహితమగు కైవల్య (మోక్ష) పదమెట్లు చేకూరగలదు?
ఉత్తరము:- ఈ మూడుగుణములను దాటుటచే,
ప్రశ్న:- దేహము(జన్మ) వచ్చినచో నష్టమేమి?
ఉత్తరము: - ముసలితనము, రోగము, చావు, వియోగము, దుఃఖము, మున్నగునవియన్నియు ఆ
దేహమువలననే సంభవించుటవలన, అది మహానర్థదాయకమైయున్నది. కావున దేహరహిత (జననమరణరహిత) ఆత్మస్థితినే జీవుడు పొందవలెను.
ప్రశ్న:- మోక్షస్థితి యెట్టిది?
ఉత్తరము:- అది జననమరణములు లేని స్థితి (అమృతమ్).

కామెంట్‌లు లేవు: