17, సెప్టెంబర్ 2020, గురువారం

మంత్ర పుష్పం అంటే ఏమిటి

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- మంత్ర పుష్పం అంటే ఏమిటి? పురుష సూక్తానికీ దీనికి సంబంధం ఏమిటి?

సమాధానం;- నిత్యం దేవతారాధన సమయంలో పఠించేదే మంత్రపుష్పం. దీన్ని భారతదేశం అంతటా ఉన్న అన్ని ఆలయాలలోను, శివాలయాలు, వైష్ణవాలయాలలోను, అన్ని గృహ ఆరాధనలలోను చదవడం సంప్రదాయం. మంత్ర యుక్తంగా భగవంతుడి ముందు సమర్పించే భక్తుడి హృదయపుష్పమే మంత్రపుష్పం.

నారాయణ పరత్వాన్ని చెప్పే పురుషసూక్తం నాలుగు వేదాల్లోను ఒకే రీతిగా చెప్పబడింది. ఇది పదహారు ఋక్కులలో ఉండడం చేత భగవంతుడి షోడశోపచార పూజకు ఉపయోగింపబడుతున్నది. ప్రత్యేకంగా, దేవుని అభిషేకం సమయంలో విన్నపం చేయబడుతున్నది. ఈ మంత్రపుష్పానికి నారాయణానువాకమని పేరు. ఇది తైత్తరీయ ఉపనిషత్తుల్లోని షష్ఠ ప్రశ్నలో పదకొండవ అనువాకంగా ఉంది. ఈ మంత్ర పుష్ప పాఠం కూడ పురుష సూక్తంతో ఒకే అర్థం కలిగి ఉంది. పురుష సూక్తం "సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః" అని ప్రారంభమైతే, మంత్ర పుష్పం కూడ "సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భువమ్, విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం" అని ప్రారంభం అవుతుంది. మంత్రపుష్పం ముందు ఈ అవతారికా శ్లోకం సాధారణంగా అనుసంధిస్తారు.

*ధాతాపుర స్తాద్యము దాజహార*
*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః*
*తమేవం విద్యానమృత ఇహభవతి*
*నాన్యః పంథా అయనాయ విద్యతే*

పరమ పురుషుడు తొలుత ఈ మంత్ర పుష్పమును నిర్మింపగా, ఇంద్రుడు సమస్త జీవులను రక్షించడానికై, దీనిని నలుదిక్కులందు వ్యాపింపజేశాడు. ప్రసిద్ధుడైన పరమాత్మను ధ్యానించిన జన్మరాహిత్యము కలుగుతుంది. ఇది తప్ప మోక్షప్రాప్తికి వేరు మార్గం లేదు.

నారాయణుని పరత్వం, సర్వాంతర్యామిత్వం, మోక్ష ప్రదత్వం ఇందులో వర్ణింపబడ్డాయి. ప్రతి జీవుని, దేవుని హృదయంలోనూ అంతర్యామిగా నారాయణుడెలా వేంచేసి ఉన్నాడో కూడ తెలుపబడింది.

విష్ణు గాయత్రితో సుసంపన్నం అయ్యే ఈ మంత్ర పుష్పం ఇతర దేవతల గాయత్రీ మంత్రాలతో కూడా పరిసమాప్తం చేయబడుతోంది.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: