29, సెప్టెంబర్ 2020, మంగళవారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


97 - అరణ్యపర్వం.


కర్ణుడు, దుర్యోధనుని ప్రాయోపవేశదీక్షను విరమింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

' దుర్యోధనా ! నీ వలన రాజ్యం పోగొట్టుకున్నప్పుడు పాండవులు నీలాగా బేలగా ప్రవర్తించలేదు. ధైర్యంగా అరణ్యవాసానికి బయలుదేరారు. వారికి జరిగిన నష్టం ముందు నీకు జరిగిన అవమానం యేపాటిది? వాళ్ళేమైనా నిరాహారదీక్షలు చేసారా ? ప్రాణాలు పణంగా పెట్టి దుస్సాహసాలు చేశారా ? '

' మిత్రమా ! అరణ్యవాస, అజ్ఞాతవాసాలు పాండవులను పూర్తి జేయనీ, వారి సంగతి రణరంగంలో నేను చూసుకుంటాను. మిత్రఋణం తీర్చుకుంటాను. ఈ భూమండలం యావత్తూ నీ పాదాక్రాంతం అయ్యేటట్లు చేస్తాను. ' అని రకరకాల మాటలతో, ధైర్యం చెబుతున్నాడు. ఇంతలో శకుని కూడా అక్కడకు చేరి, తన వంతుగా మాటల మాయాజాలంతో దుర్యోధనుని దీక్షనుంచి తప్పించి, అందరూ హస్తిన చేరే ఏర్పాట్లు చేశాడు.


ఇక హస్తినలో భీష్మాచార్యుల పదునైన మాటలకు దుర్యోధనుడు సగం చచ్చిపోయాడు. ' ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకొమ్మని, ' వారిపై ప్రేమ చూపించి చేసిన పాపాలు కడిగేసుకో ! ' అని తన మాటగా చెప్పాడు. కర్ణ, శకునులు, అవి యేమీ పట్టించుకోవద్దని, సంజ్ఞలు చెయ్యగా, భీష్ముని హితోక్తులు అక్కడే దులిపివేసుకుని, యెగతాళిగా ఆయనను చూసి నవ్వి, తన వాళ్లతో వెళ్ళిపోయాడు, దుర్యోధనుడు, భీష్మునికి దూరంగా.


ఇక దుష్టచతుష్టయం భవిష్యత్ కార్యాచరణ ఆలోచించసాగారు. భీష్మునికి, పాండవ పక్షపాతులకు సమాధానం చెప్పాలంటే, మనం కూడా ఒక జైత్రయాత్ర నిర్వహించాలని, దుర్యోధనుడు ఆజ్ఞ యిస్తే, తాను భూమండలాన్ని జయించి కీర్తి తో పాటు కప్పంగా అనేక బహుమానాలు తెస్తానని, కర్ణుడు ముందుకువచ్చాడు. 


దుర్యోధనునకు యీ ఆలోచన బాగా నచ్చింది. తాముకూడా వీరులమని యీ కురు వృద్ధులకు, ప్రజలకు తెలియవలసిన అవసరం వుందనిపించి, కర్ణునికి శుభాకాంక్షలు చెబుతూ అనుజ్ఞ ఇచ్చాడు, బయలుదేరమని. ఒక శుభముహూర్తాన, కర్ణుడు సర్వాలంకారణ శోభితుడై, ధనుర్ధారియై, విజయయాత్రకు బయలుదేరాడు.  


ముందుగా, ద్రౌపదిని తాము పొందలేకపోయామని దుగ్ధ యెప్పటినుండో వున్నందున, తన జైత్రయాత్ర ద్రుపదుని ఓడించడంతో, కర్ణుడు మొదలుపెట్టాడు. ద్రుపదుని జయించి, ఆతడు వొసంగిన అమూల్య ధనరాశులను స్వంతం చేసుకుని, ఉత్తర దిక్కుగా వున్న రాజులందరినీ తన పరాక్రమంతో, పరాభవించి, కురుసామ్రాజ్యానికి సామంతులుగా చేసుకున్నాడు. ఆ తరువాత, అంగ, వంగ, కళింగ రాజ్యాలను జయించాడు. త్రిపుటి, కోసల దేశాలను లోబరచుకున్నాడు. రుక్మి సహాయంతో, పాండ్యరాజులను, కేరళదేశంలోని నీలుడిని, ఛేదిరాజు శిశుపాలుని కుమారుని కూడా వోడించాడు. అవంతి. వృష్టి వంశీయులు కూడా కర్ణునికి దాసోహం అన్నారు.  


అపూర్వ ధనరాశులతో, కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకు వచ్చిన కర్ణుని, అనేక విధాలా పొగిడాడు దుర్యోధనుడు. చాలాకాలం తరువాత తనకు ఇంత ఆనందం నీ వలననే వచ్చింది అన్నాడు. కర్ణుడు పాండవులను యెదిరించగలడని, యింకొకసారి రుజువు చేసుకున్నాడని, యెలుగెత్తి, కౌరవ సభామధ్యంలో చాటాడు. తాను తీసుకువచ్చిన ధనరాశులను దుర్యోధనునికి సంతోషంగా సమర్పించాడు కర్ణుడు సభాముఖంగా.  


ఆ ఆనందంలో తాను కూడా రాజసూయ యాగం చేస్తాననీ, తన చేత చేయించమని కర్ణుని కోరాడు, దుర్యోధనుడు. ' దానికేమి భాగ్యం, అలాగే ' అని కర్ణుడు యింకా యేదో చెప్పబోతుండగా, రాజ పురోహితులు, ' దుర్యోధనా ! ధర్మరాజు జీవించి వుండగా, రాజసూయయాగం చేసే అర్హత నీకులేదు. అదీ గాక, నీ తండ్రి ధృతరాష్ట్రుడు కూడా రాజ్య సింహాసనంపై వుండగా, నీకు రాజసూయ యాగం నిషిద్ధము. ఐతే, దానితో సమానమైన మరియొక యజ్ఞం వున్నది. దానినే వైష్ణవయజ్ఞం అంటారు. ఈయజ్ఞాన్ని ఇంతవరకు, వైకుంఠం లో విష్ణుమూర్తి ఒక్కడే నిర్వహించినట్లు చెబుతారు. నీకు యీ యాగం శుభకరం ' అని సలహా యిచ్చాడు.


ఆవిధంగానే, వైష్ణవయజ్ఞానికి ఏర్పాట్లు చేశారు. పాండవులను రమ్మని ఒకదూత ద్వారా వర్తమానం పంపారు. మేము అరణ్యవాసం లో వుండగా, నగరప్రవేశం నిషిద్ధం రాలేక పోతున్నామని దుర్యోధనునకు చెప్పు. ' అని ధర్మరాజు మర్యాదగా చెప్పగా, భీముడు మాత్రం రోషంతో, ' నీ మహారాజు దుర్యోధనునికి మా మాటగా చెప్పు. దుర్యోధన దుశ్శాసనులని వధించిన తర్వాత మేము నగరప్రవేశం చేస్తాము. ' అని చెప్పమన్నాడు.  


వైష్ణవ యజ్ఞం పరిసమాప్తమైంది. అయినా దుర్యోధనునకు రాజసూయ యాగం చెయ్యవలెననే కోరిక అలాగే వుండిపోయింది. కర్ణుడు ' ధర్మరాజుని రణరంగం లో చంపిన తరువాత నీచేత రాజసూయయాగం చేయిస్తాను. అప్పటిదాకా ఓపికబట్టు దుర్యోధనా ! ' అన్నాడు. ' లెస్స పలికితివి ' అని శకుని దుశ్శాసనుడు వంతపాడారు. దుర్యోధనుడు సంతోషించాడు కర్ణుని పలుకులకు.


అక్కడ ద్వైతవనంలో ఒకరోజు రాత్రి ధర్మరాజుకు స్వప్నంలో అక్కడి జంతువులు కనిపించి, తమకు వారు అక్కడ వుండడం వలన యిబ్బందిగా వున్నదని మొర పెట్టుకున్నాయి, అప్పటికి వారు అక్కడికి వచ్చి యిరవై నెలలు అయింది. అందుకని, ఆజంతువుల కోరిక మేరకు, మళ్ళీ కామ్యకవనం కి మారారు, పాండవులు. ఆవిధంగా పాండవులు మొత్తం 11 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తిచేశారు. ఇక ఒక సంవత్సరం అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలివున్నాయి.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: