29, సెప్టెంబర్ 2020, మంగళవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఏడవ శ్లోక భాష్యం - ఐదవ భాగం


ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క శక్తి ఉంది. వీటికి ఆ శక్తి ఎక్కడ నుండి వస్తోంది ? ఆ శక్తికి ఆధారము అంబికే కదా!! ఆమెచేత అనుగ్రహించబడిందే ఈ శక్తి. స్వయంగా శక్తిలేని మనకు యుద్ధంలో విజయానికి ఆయుధాలు కావాలి. అన్ని శక్తులకు ఆధారమయి, అన్ని శక్తులు మొత్తంగా తానే అయి ఉన్న అంబిక చేతిలోని ఆయుధాలు ఆమె సంకల్పానుసారంగా కావలసిన రీతిలో ఆమె నిర్ణయించిన మేరకు ఫలితాన్నిస్తాయి. నిజానికి ఆమె సంకల్పమే ఈ ఫలితాలనీయగలదు. కానీ ఆమెకు అదో లీల. పరమేశ్వరుడు జ్ఞానివలె ప్రశాంతుడై ఉంటే ఈ జగన్నాటకం జరిగేదే కాదు. మన్మథుడు శివుని కామమోహితుణ్ణి చేయడంలో విఫలుడైనప్పుడు అంబిక అతణ్ణి ఈ భగవల్లీల లోనికి తెచ్చింది. మన్మథుడు ధరించిన ఆ ఆయుధములే ధరించి అంబిక శివుణ్ణి శృంగారాధిదేవుని చేసింది. మన్మథుని పునరుజ్జీవితుని చేసి జీవజాలమును కామప్రేరితులను చేయడానికి అధికారం ఇచ్చింది. అయినప్పటికీ ఆ ఆయుధాలను ఇంకా తన స్వాధీనంలోనే ఉంచుకుంది.


అయితే అప్పుడు అంబిక ఆ ఆయుధముల విధులను మార్చింది. మన్మథునికి తానిచ్చిన ఆయుధములలో ఆయన మానవులను వారి కర్మానుసారంగా కామప్రేరితులను చేస్తున్నారు. కానీ అంబిక ఆ కర్మ భారాన్ని మోస్తూ వారు విషయవలయంలో చిక్కుకుపోకూడదనే కరుణతో వారిని తమవైపుకు త్రిప్పుకోవడానికి ఆ ఆయుధాలు ఉపయోగిస్తున్నది.


మన్మథుడు ధరించిన ఆయుధాలనే ఆమె కూడా ధరించినా ఆమె ఒక్క మన్మధారి విషయంలోనే కామోద్దీపన కలగచేస్తున్నది. ఆమె శివునికొక్కనికే శివకామసుందరి. భక్తులకు జ్ఞానాంబ. వారికి బంధ విమోచనాన్ని కలగచేస్తుంది. మన్మథుడు సామాన్య ప్రజల విషయంలో తన ప్రతాపాన్ని చూపగలడు. ఈశ్వరుని ముందు బూదిగా మార్చబడిన శక్తిహీనుడు.


ఆచార్యులవారు అంబిక రూపాన్ని, నాలుగు చేతులను, ఒడ్డాణము ధరించిన సన్నని నడుమును, పూర్ణచంద్రుని పోలిన ముఖాన్ని వర్ణించిన తరువాత ఆమెలోని ఆంతరంగిక సత్యాన్ని, అంబికాతత్త్వంలోని సారాంశాన్ని వివరిస్తున్నారు. *పురమధితురాహో పురుషికా* ఆకృతిగొన్న త్రిపురారి యొక్క అహంకారమట ఆమె. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆమె శివుని యొక్క *నేను* అన్న భావనకు ఆకృతి అన్న అర్థం తోస్తుంది. బాహ్యంగా కాముడు ధరించిన ధనుర్బాణాలు ధరించిన ఈ తల్లి నిజానికి పరబ్రహ్మ యొక్క చిచ్ఛక్తి, జ్ఞానాంబ.


*పురస్తాదాస్తాం* - “మాముందు ప్రకాశించుగాక”. ఎవరైతే తన సన్నటి నడుముకు సవ్వడి చేసే చిఱుగజ్జెలు కూర్చిన మొలనూలు ధరించిందో, ఎవరి ముఖం శరత్కాలపు పున్నమి చంద్రుని పోలి ఉందొ, ఎవరు తన నాలుగు చేతులతో ధనుర్బాణములను, పాశాంకుశములను పట్టుకుందో, ఆ పరమేశ్వరుని పరాహంత మాముందు ప్రత్యక్షమవుగాక! ఆచార్యులవారు మనందరి ముందు అటువంటి తల్లి ప్రత్యక్షమవ్వాలని కోరుతున్నారు. *నః* అంటే నేను అని కాదు *మేము* అన్న అర్థం వస్తుంది.


ఆచార్యులవారు ఈ శ్లోకంలో ఎంతో అందంగా వర్ణించిన ఆ తల్లి రూపాన్ని మన అంతర్నేత్రంతో చూడగలగడం ఇక మన పని.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: