పాండవుల వారణావత ప్రయాణం
తరువాత ధృతరాష్ట్రుడు, ధర్మరాజును కురు సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేసాడు. తన నలుగురు తమ్ములు నాలుగు దిక్కులు జయించగా, ధర్మరాజు యువరాజైనా కూడా, చక్రవర్తి వలె ప్రకాశించాడు.
గదా యుద్ధంలో భీముడు, విలువిద్యలో అర్జునుడు అజేయంగా ఉన్నారు. నకుల సహదేవులు శత్రు రాజులకు భయకరంగా నిలిచారు.
అర్జునుడి పరాక్రమానికి సంతోషించి ద్రోణాచార్యుడు, బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని ఇచ్చాడు.
“అర్జునా, ఈ దివ్యాస్త్రము అమోఘమైనది. దీనిని నాకు నా గురువు అగ్నివేశుడు ఇచ్చాడు. దీనిని అల్ప మానవుల మీద ప్రయోగింపరాదు. ఇది లోకాలనే మాడ్చివేస్తుంది. కానీ నాకు మరొక గురుదక్షిణ ఇమ్ము. నేను యుద్ధం చెయ్యడం అంటూ జరిగితే, నువ్వు నాకు ఎదురుగా యుద్ధం చెయ్యకూడదు”. అర్జునుడు దానికి అంగీకరించాడు.
ధర్మరాజు యువరాజు. భీమార్జున, నకుల సహదేవులు అతనికి అండగా ఉన్నారు. వారి వైభవాన్ని చూసి దుర్యోధనుడు ర్వలేక పోయాడు. ఒకరోజు తండ్రి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి, “తండ్రీ, పాండవులు మహా వీరులు, పైగా ధర్మరాజును యువరాజుగా పట్టాభిషిక్తుని చేసావు. దేశంలోని ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ అతని మీదనే అనురాగం చూపుతున్నారు.నిన్ను కానీ, తాత భీష్ముడిని కానీ ఎవరూ లెక్క చెయ్యడం లేదు. ప్రజలంతా ఏమనుకుంటున్నారో తెలుసా. నువ్వు రాజ్యం చెయ్యడానికి పనికి రావని, భీషుముడు తగిన వాడైన రాజ్యాధికారం స్వీకరించనని ప్రతిజ్ఞ చేసాడు కాబట్టి, ఆయన కూడా పనికి రాడని, అందువల్ల ధర్మరాజే గౌరవించ తగిన వాడని అనుకుంటున్నారు. దీనికి విదురుడు కూడా అంగీకరిస్తున్నాడు. మా మాటకు విలువలేదు. కాబట్టి మీరు ఎలాగైనా పాండవులను ఎక్కడి కన్నా పంపించివేయండి” అని అన్నాడు.
ధృతరాష్ట్రుడు అలోచించి, “నాయనా, దుర్యోధనా! నాకు అన్నీ తెలుసు. కాని నేను అంధుడను, రాజ్య కార్యాలను స్వయంగా చుసుకొనలేను. కాబట్టి నా తమ్ముడు పాండురాజు నన్ను రాజుగా చేసి నన్ను భక్తితో సేవించాడు. నా చేత ఎన్నో యజ్జ్ఞాలు, యాగాలు చేయించాడు. ఎందరో రాజులను జయించి ధనరాసులను తెచ్చి ఇచ్చాడు. అందుకే నీ కన్నా పెద్ద వాడైన పాండురాజు కుమారుడైన ధర్మరాజుకు యువరాజు పట్టహిషేకం చేశాను. ఇప్పుడు నీ మాట మీద వారిని ఎలా తొలగించగలను చెప్పు” అన్నాడు.
“తండ్రీ, రాజ్యాధికారం వారసత్వంగా సంక్రమించింది. ఇది వరకు పాండురాజు నీ బదులు రాజ్యం చేసాడు, ఇప్పుడు పాండురాజు కుమారుడు రాజైనాడు. తరువాత ధర్మరాజు కుమారుడు రాజు అవుతాడు. ఈ ప్రకారం, పండు వంశం వాళ్ళు రాజులవుతారు. మా గతి ఏమిటి? మేము, మా కొడుకులు, మా మనుమలు వారికీ సేవ చెయ్యలా. బానిసల మాదిరి జివించాలా చెప్పండితండ్రీ.
పైగా ఈ రాజ్యము నీది, నీవు అంధుడవు కావటం వాళ్ళ నీ తమ్ముడు నీకు మారుగా రాజ్యాధికారం వహించాడు. క్రమంగా రాజ్యం మాకు చెందాలి, కానీ పాండురాజు మంచి తనం వాళ్ళ, అతని కుమారుడు ధర్మరాజు రాజు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల వారిని ఇక్కడి నుండి వారణావతము పంపుదాము. కొంత కాలం వారు కనపడకపోతే మంత్రులు, సామంతులు, ప్రజలు నన్నే రాజుగా అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను రాజుగా స్థిరపడిన తర్వాత, పాండవులు మరల ఇక్కడకు వస్తారు. ఏమంటారు?” అన్నాడు దుర్యోధనుడు.
కుమారుడు చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు ధృతరాష్ట్రుడు. “సుయోధనా, నేను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాను. కానీ ఇంట దారుణమైన పనికి విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అంగీకరిస్తారా. ఇది సాధ్యం కాదు” అని అన్నాడు.
“తండ్రీ! మీరు చక్రవర్తి,మీ మాటను భీష్ముడు, ద్రోణుడు,విదురుడు ఒప్పుకుంటారు. తాత భీష్ముడు మా ఇరువురి మీద సమభావం కలవాడు. ఆయనతో ఇబ్బంది లేదు. అశ్వత్థామ నా స్నేహితుడు, నా వెంటనే ఉంటాడు. కొడుకు మీద ప్రేమతో ద్రోణుడు, బావగారి మీద ప్రేమతో కృపుడు నన్ను విడిచి వెళ్ళరు. విదురుడు పాండవ పక్షపాతి. కానీ అతను ఒక్కడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి నేను చెప్పిన దానిలో దోషములేదు, అసాధ్యం అంతకంటే లేదు.మీరు అంగీకరించండి” అని బలవంతం చేసాడు దుర్యోధనుడు.
చేసేది లేక ధృతరాష్ట్రుడు సరే అన్నాడు. ఇంక దుర్యోధనుడు తన కపటోపాయాన్ని ఆచరణలో పెట్టాడు. కొంత మంది మత్రులను పిలిపించి వారణావతం గురిచి ధర్మరాజుతో, మిగిలిన పందావులతో గొప్పగా చెప్పమని పంపాడు. వారందరూ పాండవులకు ఆ నగరం మీద కుతూహలం కలిగేటట్టు వర్ణించారు. సహజంగా పాండవులకు వారణావతం చూడాలని కోరిక కలిగింది.
ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, “నాయనా ధర్మరాజా! మీ తండ్రి పాండురాజు చాలా కీర్తి గడించాడు. కాల వశాత్తు ఇప్పుడు ఆయన లేడు. మీరు కూడా తండ్రికి తగ్గ తనయులు. నా మాట కాదనరు, ఇంత కాలం రాజ్య భారాన్ని వహించి అలసిపోయారు. గంగా నదీ తీరాన ఉన్న వారణావతం సర్వ సుఖస్పదము అని అందరూ చెపుతుంటారు. మీరు, కుంతీదేవితో సహా అక్కడకు పోయి కొంత కాలం హాయిగా గడిపి రండి.”
పెద తండ్రి అంతటి ప్రేమతో చెపుతుంటే ధర్మరాజు కాదనలేక పోయాడు.సరే అని ఒప్పుకున్నాడు. గాంధారి, ధృతరాష్ట్రులకు మొక్కి వారి అనుమతి తీసుకున్నాడు. భీష్మ, ద్రోణ,క్రుపాచార్యులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి కుంతిదేవితో వారణావతానికి ప్రయాణం అయ్యాడు.
ఇది అంతా చూసి దుర్యోదనుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే పురోచనుడు అనే వాడిని పిలిపించి, “పురోచనా,నువ్వు గృహములు నిర్మించడంలో నేర్పరి అని విన్నాను. పాండవులు వారణావతానికి వెళుతున్నారు.
వారు అక్కడ ఉండేటందుకు నువ్వు తగిన గృహాలను నిర్మించాలి. కానీ ఆ ఇళ్ళు మాములుగా కాదు, లక్క, మట్టి, నెయ్యి కలిసిన మిశ్రమంతో నిర్మించాలి. పాండవులు ఆ గృహాలలో నివవసిస్తారు. వారు ఏమర పాటుగా ఉన్నపుడు నువ్వు ఆ ఇండ్లకు నిప్పు పెట్టాలి. పాండవులు చనిపోయారు అని వార్త తేసుకొని రావాలి. ఈ పని సమర్థవంతంగా చేస్తే నాకు రాజ్యాధికారం వస్తుంది. నువ్వు కూడా జీవితాంతం భోగాలు అనుభవిస్తావు” అని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు సరే అని వెంటనే వారణావతానికి వెళ్ళాడు.
ఇక్కడ నన్నయ గారు పాండవుల వయసుల గురించి ప్రస్తావించాడు. ధర్మరాజు,భీముడు,అర్జునుడు, నకుల సహదేవులు శతశృంగ పర్వతము నుండి హస్తినా పురానికి వచ్చు నప్పటికీ వారికివరుసగా 16,15,14,13,13 సంవత్సరాలు అనీ, వారు హస్తినా పురంలో 13 ఏళ్ళు ఉన్నారని,వారు వారణావతానికి వెళ్ళేటప్పటికి వారికి 29, 28, 27, 26, 26 వయసులు అని చెప్పారు.
పాండవులు, కుంతీదేవి సహా వారణావతానికి బయలుదేరుతుంటే హస్తినా పురంలోని పౌరులందరూ “అయ్యో ఇదేమిటి, పాండవుల అడ్డం తొలగించుకోవడానికి వారిని వారణావతానికి పంపుతున్నారు. కాని భీష్ముడు మొదలైన వాళ్ళు దీనికి అడ్డు చెప్పలేదు. ధర్మరాజు లేని రాజ్యంలో మనం ఎందుకు” అని పాండవుల వెంట బయలుదేరారు.
వారందరిని చూసి ధర్మరాజు, “అయ్యలరా, నేను నా పెదనాన్న కోరిక మీద తల్లితో, అన్నదమ్ములతో వారణావతానికి వెళుతున్నాను. మరల తిరిగి వస్తాము. మీరందరూ వెనక్కు మరలండి” అని కోరాడు.
కాని విదురుడు మాత్రం ధర్మజుని వెంట కొంత దూరం వెళ్ళాడు. నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకొని వెనక్కు వెళ్ళాడు. విదురుడు చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి