*దశిక రాము**
శివానందలహరి
11వ శ్లోకం
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
ఏ జన్మ మును ఎత్తినా నష్టము లేదని క్రిందిటి శ్లోకంలో చెప్పి ప్రస్తుత శ్లోకంలో మనస్సు ఈశ్వరాయత్తము కాకుండా , ఆశ్రమ ధర్మాలు ఎన్ని
పాటించినా నిష్ఫలమని , శంకరులు చెప్పారు.
శ్లో".
**వటుర్వా గేహీవా**
**యతిరపి జటీవా తదితరో**
**నరోవా యఃకశ్చిద్భవతు భవ ! కింతేన భవతి**
**యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే ! **
**తదీయస్త్వం శంభో ! భవసి భవభారంచ వహసి !!**
పదవి భాగం :
వటుః _ వా _ గేహీ _ వా _ యతిః _ అపి _ జటీ _ వా _ తదితరః _
నరః _ వా _ యః _ కశ్చిత్ _ భవతు _ భవ _ కిం _ తేన _ భవతి _
యదీయం _ హృత్పద్మం _ యది _ భవతధీనం _ పశుపతే _
తదీయః _ త్వమ్ _ శంభో! భవసి _ భవభారం _ చ _ వహసి .
తాత్పర్యం:
ఓ శివా! నరుడు, , బ్రహ్మ చారి కానీ, గృహస్తుడు కానీ, సన్యాసి కానీ , జడధారి కానీ, అంతకంటే వేరు ప్రవృత్తి కలవాడు కానీ, ఎవడో ఒకడు కావచ్చు. అందువల్ల విశేషమేదీ వుండదు. ఓ పశుపతీవ ! శంభూ !
ఎవరి హృదయ పద్మం , నీయందు తత్పరం అవుతుందో , నీవు వారివాడవు అవుతావు. అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీపై వేసుకుంటావు. మానవుడు ఏ ఆశ్రమంలో వున్నా , అతడు శివ
పరాధీన చిత్తము కలవాడైతే, అతని భారాన్ని అంతా శివుడే వహిస్తాడని భావము.
విశేషం:
పుట్టినప్పటినుండి మరణించే వఱకుసాగే మానవ జీవనాన్ని
1) బ్రహ్మ చర్యాశ్రమం
2). గృహస్తాశ్రమం
3) వానప్రస్థాశ్రమం
4) సన్యసింౘడం అని నాలుగు విధాలుగా విభజించారు .
వివాహం కానంతవఱకూ వున్నకాలాన్ని బ్రహ్మ చర్యాశ్రమంగానూ,
వివాహానంతరం సంసార యాత్రను సాగించే జీవిత కాలాన్ని గృహస్తాశ్రమ కాలగానూ, వృత్తి నిర్వహణ తరువాత విశ్రాంతి తీసుకొనే కాలాన్ని వానప్రస్థాశ్రమ కాలంగానూ, సంపూర్ణ వైరాగ్య స్థితిలో సన్య సించిన కాలమును సన్యాస ఆశ్రమంగానూ పెద్దలు
విభజించారు. ఈ చతుర్విధాశ్రమాలలో సంసార బంధాలన్నీవిడచి సన్యసించిన చివరి సన్యాసాశ్రమ జీవితం, భక్తి జీవనానికి ,యోగా
భ్యాసాదులకూ, మోక్ష సాధనకూ విశిష్టమైనదిగా చెపుతారు.
హృదయం పరమేశ్వర భక్తితో పరిపూర్ణమై యుండడమే దైవానుగ్రహానికిఅర్హత. అంతేకానీ , ఆశ్రమ స్వీకారము , వేషధారణ,బాహ్యములైన
పటాటోపములు కావు . అని ఈ శ్లోకము సారాంశము.
ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు వంటి బాలురు సైతం
బాల్యంలోనే భగవద్భక్తితో పునీతులయ్యారు.. ప్రహ్లాదుని విష్ణు భక్తి గూర్చి పోతన గారిలా అన్నారు.
పానీయంబులు ద్రావుౘున్ గుడుౘుౘున్ భాషింౘుౘున్ హాసలీ
లా నిద్రాదులు సేయుౘున్ దిరుగుౘున్ లక్షింౘుౘున్ సంతత
శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా !
ప్రహ్లాదుడు నీళ్లు త్రాగుచున్నా, అన్నం తింటున్నా, మాట్లాడుతున్నా,
ఆటలాడుతున్నా, అచ్యుతుని స్మరణమే. నడుస్తున్నా, నవ్వుతున్నా, నారాయణ ధ్యానమే. చివఱకు నిద్రలో కూడా నీరజాక్షుని కలవరింతలే.
ఈ విధంగా శ్రీ మన్నారాయణుని పాదపద్మస్మరణ అనే అమృతాన్ని
ఆస్వాదించి , ఆ మైకంలో లోకాన్ని మఱచిన మహనీయుడు ప్రహ్లాదుడు.
అది బాలుడుగా ప్రహ్లాదుడు పొందిన దైవానుభూతి. అంబరీషుని వంటి చక్రవర్తులూ, పోతన, గోపరాజు , అన్నమయ్య, త్యాగరాజు వంటి కవీశ్వరులూ, వశిష్ఠుడు, అగస్త్యుడు వంటి ఋషీశ్వరులుా కూడా, ఆయా ఆశ్రమాలలో వుంటూనే, భక్తిమార్గం ద్వారా తరించారు కదా !
గుహ వద్దకుగానీ, పెద్ద భవనము వద్దకు గానీ వెళ్ళి మనం మాట్లాడితే ప్రతిధ్వని వస్తుంది. అలాగే భగవంతుని సన్నిధికి వెళ్ళి " నేను నీ వాడను "
అని పలికితే , భగవంతుడు కూడా " నేను నీవాడను " అని తిరిగీ జవాబు చెపుతాడు.
🙏🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి