29, సెప్టెంబర్ 2020, మంగళవారం

విలువలు

 "ఓయ్ .... నిన్నే" గట్టిగా పిలిచారు బలరాముడు గారు.


"ఏంటి?" నెమ్మదిగా అడిగారు రోహిణి గారు.


"నాకు బ్రేక్ ఫాస్టుకి పెసరట్లు వెయ్యి" అన్నారు బలరాముడు గారు.


రోహిణి గారు ఏమీ మాట్లాడలేదు.


"అమ్మా, రోజూ ఇడ్లీయేనా? నాకు చపాతీ చేసిపెట్టు" వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హోమ్ లోనే ఉంటున్న కొడుకు.


"అత్తయ్య గారు, నాకు మామూలు దోసెలే వెయ్యండి" అన్నది వర్క్ ఫ్రమ్ పార్ట్నర్ .... ఆమె కూడా అలాంటి ఉద్యోగమేనాయె మరి.


"అమ్మా, నాకు టొమాటో బాత్ చెయ్యవే. రోజుకొక రకం తింటే బాగుంటుంది కానీ రోజూ ఇడ్లీలేనా?" అంటూ గదిలోనుండి అరుపు వినపడింది. అది ఇంకా పెళ్ళి కాని కూతురుది.


"వింటున్నావా ....?" గట్టిగా అడిగారు బలరాముడు గారు.


ఏమీ మాట్లాడకుండా వంట గదిలోకి వెళ్ళిపోయారు రోహిణి గారు.


పావు గంటైనా, అర గంటైనా వంట గదిలోనుండి ఎటువంటి వాసనలు రావడం లేదు.


కూతురు, కొడుకు, కోడలు బిజీగా ఉన్నందువల్ల బలరాముడు గారికి తప్పలేదు .... లేచి వంట గదిలోకి వెళ్ళబోయారు.


ఇంతలో డోర్ బెల్ మోగింది.


"ఎవరు?" అంటూ తలుపు తీసారు బలరాముడు గారు.


"హోమ్ ఫుడ్స్ నుండి ...." అంటూ చేతిలోని కవర్ అక్కడ పెట్టి వచ్చినతను వెళ్ళిపోయాడు.


ఆశ్చర్యంగా ఆ కవరు తీసుకుని వంట గదిలోకి వచ్చిన బలరాముడు గారికి యూ ట్యూబ్ లో వీడియోలు చూస్తున్న రోహిణి గారు కనపించారు.


"ఈ హోమ్ ఫుడ్స్ ఎవరు?" అసహనంగా అడిగారు బలరామయ్య గారు.


"రోగాలొచ్చి చేసుకోలేని వాళ్ళకు ఇంటినుండే వండి పంపిస్తారు .... " సమాధానం చెప్పారు రోహిణి గారు వీడియోలు చూస్తూ.


"ఇప్పుడు ఎవరికి రోగమొచ్చిందని?" గట్టిగా అడిగారు బలరామయ్య గారు.


ఆ అరుపుకి గదుల్లో ఉన్న కూతురు, కొడుకు, కోడలు ముగ్గురూ బైటకు వచ్చారు.


"మీకు, వాడికి, ఆ అమ్మాయికి, దీనికి. మీ నలుగురికి రోగమొచ్చింది. ఉదయం ఐదు గంటలకు లేచి అందరికీ కాఫీలందించాలి. ఉన్న చోటునుండి అంగుళం కదలరు. వాళ్ళను రోగీష్టి వాళ్ళనే అంటారు. రోజుకో రకం చేస్తూనే ఉన్నాను. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు అట్లు, ఇంకో రోజు చపాతీలు .... ఇలా చేస్తున్నాకూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చెయ్యడమంటే ఇది కొంపలా లేదు. హాస్పిటల్ కేంటీన్ లా ఉంది. అందుకే హోమ్ ఫుడ్స్ నుండి తెప్పించాను" తిరిగి సమాధానం చెప్పారు రోహిణి గారు.


ఆమె నోటినుండి అంత గట్టి సమాధానం ఎదురౌతుందని భావించని బలరామూడు గారు, మిగతా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఎవరి కవర్ ఏదో చూసుకుని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒక్క చిన్న నవ్వు నవ్వుకున్నారు రోహిణి గారు .... "నీకోసం ఏం తెప్పించుకున్నావ్?" అని ఒక్కరు కూడా అడగనందుకు ....


***********************************(సమాప్తం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది : 29-09-2020

కామెంట్‌లు లేవు: