29, సెప్టెంబర్ 2020, మంగళవారం

15-09-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవుడు ఏ యింద్రియములను ఆశ్రయించి విషయముల ననుభవించునో తెలియజేయుచున్నారు -

 

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ 

రసనం ఘ్రాణమేవ చ | 

అధిష్ఠాయ మనశ్చాయం 

విషయా నుపసేవతే || 


తాత్పర్యము:- ఈ జీవుడు (జీవాత్మ) చెవిని, కంటిని, చర్మమును (త్వగింద్రియమును), నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి (శబ్దాది) విషయములను అనుభవించుచున్నాడు.


వ్యాఖ్య:- 'అధిష్ఠాయ మనశ్చాయమ్’ - మనస్సును, ఇంద్రియములను ఆశ్రయించి - అని చెప్పుటవలన జీవుడు (జీవాత్మ) వాస్తవముగ మనస్సు కంటెను, ఇంద్రియముల కంటెను వేఱుగనున్నా డనియు, ఇంద్రియ మనంబులు ఉపాధిరూపములేయనియు, (అజ్ఞానవశమున) ఆ ఉపాధిని ఆశ్రయించి ఆతడు సుఖదుఃఖముల ననుభవించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. కాబట్టి మనోవికారములుగాని, ఇంద్రియవికారములుగాని ఆత్మకుజెందవు. తనకంటె వేఱైన ఇంద్రియమనంబులను ఉపాధిరూపమైన తొడుగును ధరించి ఆత్మ (జీవుడు) విషయాదులను, సుఖదుఃఖాదులను అనుభవించుచున్నాడు కావున వాస్తవముగ ఆ ఉపాధితోగాని, ఉపాధిజనిత వికారములతోగాని ఆ యాత్మకు ఏలాటి సంబంధమున్ను లేదు.


ప్రశ్న:- జీవుడు (జీవాత్మ) ఏ యే ఇంద్రియములను ఆశ్రయించి విషయముల ననుభవించుచున్నాడు?

ఉత్తరము:- (1) చెవి (2) కన్ను (3) చర్మము (4) నాలుక (5) ముక్కు - అను పంచజ్ఞానేంద్రియములను (6) మనస్సును ఆశ్రయించి విషయముల ననుభవించుచున్నాడు.

కామెంట్‌లు లేవు: