29, సెప్టెంబర్ 2020, మంగళవారం

దండకారణ్యానికి

 దండకారణ్యానికి ఆ పేరు రావటానికి కారణమేమిటో ?

.........................................................

దండకారణ్యం చత్తీస్ఘడ్, ఒడిషా, తెలంగాణా ప్రాంతాలలో ఒకపుడు ఆవరించి వుండేది.

రామాయణంలో దండకారణ్య ప్రస్తావన దండిగావుంది.


 అగస్త్యమహముని దండకారణ్య గురించి శ్రీరామచంద్రుని వద్ద ప్రస్తావించాడు.ఆ అరణ్యంలో ప్రస్తుతం మానవనివాసం లేదని, అంతేకాకుండా సాధుజంతువులే తప్ప క్రూరమృగాలేమి లేవని, తపస్సు చేసుకోటానికి అనువైన స్థలమని చెప్పాడు.

ఇక్కడ మానవనివాసం లేకపోవటానికి దండుని చరిత్రను శ్రీరామునికి తెలియచేశాడు.


పూర్వం ఇక్ష్వాకమహరాజు ఈ భూమండలాన్ని పాలించేవాడు. అతనికి దండుడనే పేరుగల కొడుకొకడున్నాడు. అతనికి వింధ్యనీలపర్వత ప్రాంతాల మధ్యనున్న రాజ్యాన్ని ఇచ్చి ఏలుకోమన్నాడు. దండుడు స్వత:సిద్ధంగానే దుర్మార్గుడు. అతను శుక్రాచార్యుని గురువుగా స్వీకరించాడు. మునులను సాధుజనులను మునిస్త్రీలను చెరపట్టి హింసించేవాడు.


తనరాజ్యంలో మధుమతి అనే సుందరనగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొన్నాడు. ఒకరోజు దండకారణ్యంలోని సాధుజంతువుల వేటకై వెళ్ళాడు. అలా వేటాడుతూ ఓ సుందరప్రదేశాన్ని చేరాడు. అక్కడో పెద్దసరస్సుంది. అందులో అందమైన శ్వేత హంసలు వయ్యారంగా తిరుగుతున్నాయి. నెమల్లు పురివిప్పి ఆడుతున్నాయి. బెదురుచూపులతో లేళ్ళు చెంగు చెంగున ఎగురుతున్నాయి.అందమైన జలపాతాల హోరు వీణులవిందుగా ఉంది. ఆ అందాలను తిలకిస్తూ దండుడు ముందుకు వెళ్లాడు.


అంతకుముందు చూచిన ప్రదేశంకంటే ఈ ప్రదేశం ఇంకా రమణీయంగా వుంది.అక్కడో కుటీరం మునిజనులు పరివారం కనబడ్డారు. వారిలో ఒక అద్భుతమైన సౌందర్యరాశి అతనికి కనబడింది. మనసు శరీరం మదనతాపంతో విలవిలలాడిపోయింది.


దండుడు ఆ సుందరినిచేరి నేనో రాజునని నిన్ను నేను వలచానని పెండ్లిచేసుకొంటానని పలికాడు. అంతట ఆ మునికన్య ఇలా చెప్పింది. తనపేరు అరజ యని రాక్షసకుల గురువైన శుక్రాచార్యుని కూతురునని, నువ్వు శుక్రాచార్యుడి శిష్యుడివి కనుక తనకు సోదరునితో సమానమని కనుక వలపుగిలుపులు కట్టిపెట్టి వచ్చిన దారినే పొమ్మని ఛీత్కరించుకొంది.


కామంతో కళ్ళుకప్పిన దండునికి అరజ చెప్పిన మాటలు చెవికెక్కలేదు.మునిపరివారన్ని బంధించి అరజను కుటీరానికి దూరంగా లాక్కువెళ్లి బలత్కారం చేసి వెళ్ళిపోయాడు. అరజ అక్కడే శోకసముద్రంలో మునిగివుండిపోయింది.


కార్యార్థమై బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన శుక్రాచార్యునికి పర్ణశాల వెలుపల శోకసముద్రంలో వున్న కూతురు కనబడింది. పరివార జనంచే విషయం తెలుసుకొన్నాడు. పట్టరాని కోపంతో దండుని రాజ్యంలో ఏడురోజులపాటు దుమ్ము దూళి మట్టివాన కురిసి అతనితోపాటు రాజ్యంలోని సమస్తజనులు నశించిపోతారని శపించాడు. శుక్రాచార్యుడి శాపం నిజమైంది. ఇంద్రుడు ఏడురోజులపాటు దండుడి రాజ్యంలో మట్టివాన కురిపించాడు. పాపాత్ముడైన అతని రాజ్యంలోని ప్రజలందరూ నశించారు. దండుడు మరణించాడు.


దండుని రాజ్యంలో నరవాసనలేక అక్కడో భయంకరమైన అరణ్యం పెరిగిపోయింది. దండుని రాజ్యంలో పెరిగిన దుర్గామారణ్యం కనుక దీనికి దండకారణ్యమనే పేరు కలిగింది.


ఇక్కడే శ్రీరాముడు వనవాసం చేశాడు.

శూర్పనఖ కు ముక్కుచెవులను లక్ష్మణుడు ఇక్కడే ఖండించాడు.

శ్రీరాముడు ఖరదూషణ మారీచ మొదలైన రాక్షసులను ఇక్కడే వధించాడు. 

రావణబ్రహ్మ సీతను చెరపట్టి లంకను ఇక్కడనుండే తీసుకు వెళ్ళాడు.

...........................................................................................................................

కామెంట్‌లు లేవు: