29, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము*


 తృతీయ స్కంధం -33


దేవహూతితోగ్రుమ్మరుట


కలువకన్నుల ఆ దేవహూతి కర్దముని మాటలు విన్నది. ఆమె పతిసేవలో అలసిపోయి యున్నది. చీర మాసిపోయింది. శిరోజాలు జడలు కట్టాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థలం వివర్ణమయింది. ఆమె భర్త ఆజ్ఞానుసారం సరస్వతీ నదీజలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో దిగి స్నానం చేసే సమయంలో ఆ జలప్రవాహంలోనుంచి నాజూకైన సన్నని పట్టువస్త్రాలు ధరించినవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన వేలకొద్ది కన్యలు ఆమెకు కనిపించి ఇలా అన్నారు. 

ఓ యువతీ! ధర్మకార్యాలు ఆచరించే మేము నిర్మలమైన భక్తితో నీకు సేవలు చేయగలం. నీవు మమ్మల్ని దయతో చూడు.ఇలా అని వారంతా దేవహూతిని సమీపించి, ఆమెకు తలంటి, నలుగు పెట్టి, చందన కర్పూరాలు వెదజల్లే బంగారు బిందెల జలాలతో స్నానం చేయించి, తెల్లని వస్త్రాలతో తడి ఒత్తి, శరీరమంతా అగరు ధూపాలు వేసి, కస్తూరి పూతలు పూసి, మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగి, చిరుగంటల సవ్వడితో ఒప్పే ఒడ్డాణం నడుముకు అలంకరించి, రత్నాలు చెక్కిన కర్ణాభరణాలు, ఉంగరాలు, కంకణాలు మొదలైన విలువైన బంగారు ఆభరణాలను ఇచ్చి, పూలదండలు సింగారించి, షడ్రసోపేతమైన భోజనాదులతో సంతృప్తి పరచారు.

ఇంకా బంగారు పళ్ళెరాలలో కర్పూరం వెలిగించి హారతులిచ్చి, రమణీయమైన రత్నపీఠంమీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి అద్దంలో ప్రతిఫలించిన తన రూపాన్ని చూచుకొని తన పతి అయిన కర్దముని మనస్సులో భావించింది. మరుక్షణంలో కర్దముడు, వేలకొలది కన్యకలు ఆమె చెంత ఉన్నారు. అది చూచి భర్తయొక్క యోగమాయా ప్రభావానికి ఆమె ఆశ్చర్యపడ్డది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఆసీనురాలైన దేవహూతిని చూచి, వివాహానికి పూర్వం ఆమె ఎలా ఉండేదో అలాగే చెక్కు చెదరని చక్కదనంతో ఉన్నందుకు మహానందం పొందాడు. కన్యలందరూ తమ్ము సేవిస్తూ ఉండగా సతీసమేతుడై విమానం ఎక్కి, చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రునిలా ప్రకాశించాడు.నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు విమానారూఢుడై సమస్త దిక్పాలురు విహరించడానికి యోగ్యమైనదీ, మెల్లగా చల్లగా వీచే మలయమారుతాలతో కూడినదీ, సమీపంలో ప్రవహించే సెలయేళ్ళ నీటి తుంపురుల చల్లదనం కలదీ అయిన మేరుపర్వతం శిఖరాల మీద సురసుందరీ సమేతుడైన కుబేరునిలా విహరించాడు.ఇంకా…కర్దమ మహర్షి కోరినచోటికి సంకల్పమాత్రంతోనే తీసుకెళ్ళే ఆ విమానం ఎక్కి, దేవహూతితోపాటు గొప్ప వేడుకతో విహరించాడు. చక్కటి దివ్యఉద్యానవనాలు, సరిక్రొత్త విహారప్రదేశములు, పద్మాలతోనూ, కలువలుతోనూ కలకలాడుతున్న మానస సరోవర తీరాలు, మనోహరమైన పొదరిండ్లు, చైత్రరథం అనే కుబేరుని తోట మున్నుగు అన్నిటినీ తన ఇంతితో ప్రేమపూర్వకంగా విహరించాడు.


కపిలుని జన్మంబు  


మునిశ్రేష్ఠుడైన కర్దముడు ఒకనాడు కుతూహలంతో తొమ్మిది విధాలైన వేరువేరు దేహాలను ధరించి క్రమంగా తన వీర్యాన్ని తన భార్య అయిన దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు.ఆ కారణంగా కర్దమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కుమార్తెలను కన్నది. ఆమె తన మనస్సులో ఎంతో సంతోషించింది. అప్పుడా ముని (సన్యసింప దలిచాడు).(కర్దముడు) సన్యసింప దలిచాడు. ఆ విషయం అతని భార్య దేవహూతి తెలిసికొని మనస్సులో పుట్టిన ఆవేదన అధికం కాగా, చింతతో చెక్కిలిమీద చేయి చేర్చి, కాలివ్రేలితో నేలపై వ్రాస్తూ తన భర్తతో ఇలా అన్నది.

“ఓ పుణ్యాత్ముడా! సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం చెప్పి పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదుక్కోగలరనే భయం నాకు కలుగుతున్నది. అందుకని కుమార్తెలకు తగిన వరులను వెదకి వారికి వివాహం చేసి, నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగల కుమారుని ప్రసాదించి నన్ను కటాక్షించు. సాధుజన సంస్తవనీయా! సంసార దుఃఖాన్ని తొలగించడానికి అన్ని విధాల సమర్థుడవు నీవు. ముక్తి మార్గాన్ని తెలిపేవారు లేక మోహం వల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది. ఓ మహాత్మా! నాకు ఈ లోక సంబంధాలైన సుఖాలను అనుభవించాలనే ఆసక్తి నశించింది. భోగాలపై విరక్తి కలిగింది. ఇంతకు ముందు చంచలభావంతో కామోపభోగాలను కోరిన దానినై, స్వచ్ఛమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏవేవో అర్థించాను. నా పట్ల నీ అనుగ్రహం ఫలించింది. నిన్ను నిర్మల భక్తితో సేవించడం చేత ముక్తి లభిస్తుంది కదా!అంతేకాక...అందరిపట్ల సమానబుద్ధి కలిగినట్టి సజ్జనుల మైత్రి ఉత్తమగతికి కారణమౌతుంది. నీచమైన బుద్ధి కలిగి, చంచలచిత్తులైనట్టి దుర్జనుల స్నేహం వలన దుర్గతి కలుగుతుంది. ఈ సంగతి మనస్సులో భావించి, యోగిజన సన్నుతుడవైన నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సాంగత్యం వల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో లేక పాపాలో ప్రాప్తిస్తాయి”. అని ఈ విధంగా దేవహూతి మిక్కిలి వేదనతో పరితపిస్తూ పలుకగా, కర్దముడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకొని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఇలా 

అన్నాడు.“ఓ మనుసుతా! నీవు మనస్సులో దుఃఖించవద్దు. అనఘుడూ అక్షరుడూ అయిన విష్ణుభగవానుడు కొద్ది కాలంలోనే నీ గర్భంలో ప్రవేశిస్తాడు. నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో చరించు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సును, శ్రద్ధాభక్తులతో కూడిన దానధర్మాలను ఆచరించు. నారాయణుని పాదపద్మాలను నిండైన భక్తితో పూజించు. పురుషోత్తముడైన ఆ విష్ణువు నీ పూజలకు సంతృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీ మనస్సులో పుట్టే సందేహాల ముడులను విడదీస్తాడు”.అని కర్దముడు చెప్పగా దేవహూతి తన మనస్సులో సంతోషించి, అతని మాటల ననుసరించి పరాత్పరుడు, భగవంతుడు, అనంతుడు, కమలాక్షుడు, పాపమోచనుడు అయిన విష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేండ్లు గడిచాయి. అప్పుడు రాక్షససంహారి అయిన విష్ణువు కర్దమ మునీశ్వరుని తేజస్సును (ధరించాడు). (విష్ణువు కర్దముని తేజస్సును) ధరించి జమ్మిచెట్టు తొఱ్ఱలో నుంచి అగ్ని పుట్టినట్లుగా దేవహూతి గర్భంలోనుండి జన్మించాడు. ఆ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. దేవతలందరూ సంతోషంతో మందారపుష్పాల వర్షాన్ని కురిపించారు. గంధర్వులూ, కిన్నరులూ పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. దిక్కుల్లో క్రమ్మిన పొగమంచు మాయమయింది. సముద్రాలు ప్రశాంతాలైనాయి. సజ్జనుల మనస్సులకు సంతోషం కలిగింది. హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి. వృక్షాలన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పొలాలలో నానావిధాలైన పైరులు ప్రకాశించాయి.ఇటువంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని దర్శించడానికి మరీచి మొదలైన మునులతో కూడి బ్రహ్మదేవుడు వచ్చి, ఆ మహాత్ముని దర్శనం చేసికొని కర్దమ దేవహూతులను చూచి ఇలా అన్నాడు. “ధన్యచరితులైన ఓ దంపతులారా! మీరు కృతార్థులు. నిజమైన భక్తితో, నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు 

లభించింది. ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు, మునీశ్వరులు కీర్తించే చరిత్ర గలవాడు అయిన పరాత్పరుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చాడు. అందువల్ల మీ జన్మ సార్థకం అయింది. నీతికోవిదులైన ఓ దంపతులారా! వినండి. ఆసక్తితో, అద్వితీయమైన భక్తితో విష్ణువును పూజిస్తే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. మీ పుణ్యాన్ని ఏమని పొగడగలను?”అని చెప్పి మళ్ళీ కర్దముని చూచి ఇలా అన్నాడు “నీ కుమార్తెలను ఉత్తమ స్వభావం కలిగివారు, సదాచార సంపన్నులూ అయిన మునిశ్రేష్ఠుల కిచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల ప్రజాసృష్టి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.“ఓ పుణ్యాత్ముడా! మహాత్ముడు, మహా తేజోవంతుడు అయిన ఈ నీ కుమారుడు సమస్త ప్రాణుల హృదయాలలోని మనోరథాలను నెరవేర్చే ఘనుడు. కనుక ఇతనిని ఈశుడు, పరమేశ్వరుడు, అపరాజితుడు, అమేయుడు, అచ్యుతుడు, అనంతుడు, ఆద్యుడు, అవికారుడు, అక్షరుడు అయిన పుండరీకాక్షునిగా భావించు.ఓ దేవహూతీ! మాననీయాలైన జ్ఞానవిజ్ఞాన యోగాలు అనబడే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున జన్మించాడు. బంగారు రంగు కలిగిన జటాజూటం కలవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, పద్మం, హలం, వజ్రం, అంకుశం మొదలైన రేఖలతో విరాజిల్లే అరికాళ్ళు కలవాడు, సత్త్వగుణ సంపన్నుడు అయి ఇప్పుడు నీ గర్భంలో జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్త్వబోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి. ఇంకా...(నీ కుమారుడు) పేరెన్నిక గన్నవాడై, ప్రసిద్ధులైన సిద్ధపురుషులచేత సేవింప బడుతూ మహనీయమైన సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్త్వమందు సుస్థిరుడై ‘కపిలుడు’ అనే పేరుతో ఈ మూడు లోకాలలోను సంచరిస్తాడు” అని బ్రహ్మదేవుడు తెలిపాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: