29, సెప్టెంబర్ 2020, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

పెళ్లి సంబంధాలు..


"రాబోయే శ్రావణ మాసం లో మా అబ్బాయి వివాహం నిశ్చయం అయిందండీ..ఇక్కడే శ్రీ స్వామివారి సన్నిధిలో నే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాము..అమ్మాయి తరఫు వాళ్లకు కూడా చెప్పాము..ఆరోజు మీ దంపతులిద్దరూ ఇక్కడ వుండి.. వధూవరులను ఆశీర్వదించాలి.." అన్నారు ఆ భార్యా భర్తలు ..వాళ్లిద్దరూ ఎప్పుడూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చేవారే.. శ్రీ స్వామివారి మీద అపారమైన భక్తి కలిగి వున్నవారు..మాకూ బాగా తెలుసు..అందువల్ల..ఒక్కక్షణం కూడా సంకోచించకుండా "సరే!" అనేశాము.. పెళ్లికి సుమారు నెలన్నర పైనే సమయం ఉంది..


శ్రావణమాసం వచ్చింది..సహజంగానే శ్రావణమాసం లో వచ్చే శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది..మేమూ ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాము..ఆ నెలలో మందిరం వద్ద వివాహాలూ జరుగుతుంటాయి..మొదటివారం గడిచిపోయింది..అప్పుడు గుర్తుకొచ్చింది నాకు..ఆ దంపతులు వచ్చి వాళ్ళబ్బాయి వివాహం అని చెప్పి వెళ్లారు కదా..నేను మర్చిపోయానేమో..అనే సందేహం వచ్చి మా సిబ్బందిని అడిగాను..ఫలానా వాళ్ళబ్బాయి వివాహం ఎప్పుడు?..లేక జరిగిపోయిందా?..అని..మా సిబ్బంది కూడా "ఆరోజు వచ్చి శ్రావణమాసం లో వివాహం అని చెప్పారే కానీ..ఫలానా తేదీ అని చెప్పలేదు..మళ్లీ మందిరానికి రాలేదు..మనలను సంప్రదించలేదు.." అన్నారు..హమ్మయ్య!..నేను మర్చిపోలేదు అని సంతోషించాను..వివరం కనుక్కోవడానికి ఫోన్ చేసాను.."అయ్యా..అబ్బాయి పెళ్లి విషయం నేను వచ్చి మీతో మాట్లాడతాను..వచ్చే ఆదివారం నాడు నేనూ నా భార్యా ఇద్దరమూ గుడికి వస్తాము.." అని ముక్తసరిగా బదులిచ్చి, ఫోన్ పెట్టేసాడు..ఏదో జరిగింది అని అనిపించింది..ఆ తరువాత నేను నా పనుల్లో మునిగిపోయాను..


ప్రక్క ఆదివారం నాడు ఆ దంపతులిద్దరూ మందిరానికి వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కూడా తీసుకొని వచ్చారు..వాళ్ళను చూస్తే..పుట్టెడు దిగులుతో ఉన్నారనిపించింది..శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లి, సమాధి మందిరం గడప వద్ద చాలా సేపు నిలబడి ప్రార్ధించుకున్నారు..యధావిధిగా అర్చన చేయించుకున్నారు..నన్ను అనుమతి అడిగి, సమాధి వద్దకు వెళ్లి, సమాధికి తల ఆనించి నమస్కారం చేసుకున్నారు..ఇవతలికి వచ్చేసారు..


"మీతో ఆరోజు శ్రావణమాసం లో వివాహం అని చెప్పాను కదండీ..అన్నీ మాట్లాడుకున్నాము..నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నాము..మరి ఏ కారణమో తెలీదండీ..అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి.."మేము మీ సంబంధం వద్దు అనుకుంటున్నాము..మేము బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అన్నారండీ..మాకేమి అర్ధం కాలేదు..మా ఇంట్లో శుభకార్యం అని బంధువులందరితో చెప్పేశాము..ఫలానా తేదీ నాడు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద వివాహం అని కూడా తెలిపాము..ఉన్నట్టుండి వాళ్ళు "పెళ్లి రద్దు" అని చెప్పేసరికి..బాగా బాధపడ్డాము..మేమేమీ కట్న కానుకల దగ్గర పేచీ పెట్టలేదు..మా వైపు నుంచి ఎటువంటి కోరికలూ కోరలేదు..మరి ఎందుకని వద్దన్నారో అర్ధం కాలేదు..మనసుకు తీవ్ర కష్టం వేసింది..శ్రీ స్వామివారినే నమ్ముకొని వున్నాము..ఆయన ఎందుకని మాపై చిన్న చూపు చూశాడో తెలీదు..ఇప్పుడు కూడా ఆయనకే మొర పెట్టుకున్నాము.." అన్నారు.. 


"నమ్మిన వాళ్ళను దైవం ఎప్పుడూ చిన్న చూపు చూడడు..మీకు ఇంతకంటే మంచి సంబంధం కుదురుతుందేమో..కొన్నాళ్లపాటు మీకు వేదన ఉండొచ్చు..కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది..శ్రీ స్వామివారిని నమ్మి వున్నారు..నిశ్చింతగా వుండండి.." అని ఓదార్పుగా చెప్పాను..అన్యమన్యస్కంగానే తలూపారు..తల్లీ దండ్రి తో పాటు వచ్చిన ఆ అబ్బాయి కూడా ముభావంగా వున్నాడు..తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి ఆ కుటుంబం మొత్తం శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మాకూ కొద్దిగా బాధ అనిపించింది..


ఆ ప్రక్క బుధవారం నాడు ఉదయం పది గంటలప్పుడు..నేనూ మా సిబ్బంది మందిరం లో కూర్చుని వున్నాము..ఇంతలో ఆ దంపతులు వచ్చారు..వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి..ఇద్దరూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..అర్చన కూడా చేయించుకున్నారు..అక్కడనుంచి నేరుగా మా వద్దకు వచ్చి.."వచ్చే గురువారం అబ్బాయి పెళ్లి..ఇక్కడే చేయాలి..మొన్న సోమవారం నాడు మాట్లాడుకున్నాము..ఇంతకూ అమ్మాయి తరఫు వాళ్ళు మా బంధువులే!..వాళ్ళు మా సంబంధం చేసుకోవాలని అనుకున్నారట.. కానీ ఈలోపల మేము వేరే కుదిరింది అని చెప్పడంతో ఊరుకున్నారట..తీరా ఆ సంబంధం తప్పిపోయిందని తెలిసి..మా ఇంటికొచ్చి మాతో మాట్లాడి అన్నీ కుదుర్చుకుని వెళ్లారు..పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు..ఆలస్యం ఎందుకని వచ్చే గురువారానికి ముహూర్తం పెట్టుకున్నాము..ఈ స్వామివారు చల్లంగా చూసాడు..మంచి సంబంధమే కుదిరింది.." అని చెప్పారు..


అనుకున్నవిధంగానే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏ ఆటంకం లేకుండా లక్షణంగా వివాహం జరిగిపోయింది..మొదటి సంబంధం తప్పిపోవడానికి ఏ కారణమో తెలీదు..మళ్లీ ఈ సంబంధం కుదిరి వివాహం కావడానికి కూడా కారణం తెలీదు..కారణం తెలిసింది ఒక్క స్వామివారికే..వారు చెప్పరు..మౌనంగా సమాధి నుంచి గమనిస్తూ వుంటారు..అందుకే మేము నిత్యమూ ఒకటి అనుకుంటూ వుంటాము.."స్వామి వారి లీలలు మన ఆలోచనలకు అందవూ.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: