12, నవంబర్ 2020, గురువారం

వాక్_సామర్ధ్యం

 వాక్_సామర్ధ్యం 


వారధి  నిర్మించి రామచంద్ర  ప్రభువు  వానర  సేనతో  లంకా  నగరం  చేరుకున్నారు.  


యుద్ధ  నీతి  ననుసరించి  శాంతి  కోసం  చివరి  ప్రయత్నంగా  అంగదుడిని  రావణుని  వద్దకి   రాయబారిగా  పంపారు.  


 యుద్ధం  నివారించడానికి  ప్రయత్నించమన్నారు. 


 అంగదుడు  రావణ  సభకి  చేరుకున్నాడు.   


అంగదుని  తండ్రి  వాలి  రావణుని జయించినవాడు.  అతన్ని  ఓడించలేక  అతనితో  స్నేహం  చేసుకున్నాడు  రావణుడు. 


 అంతటి   బలశాలిని  ఒక్క  బాణంతో  సంహరించాడు  రాముడు.  


ఈ  విషయం  రావణుడికి  తెలుసు.   


తన  తండ్రిని  చంపిన  రాముడి  తరఫున  దూతగా  వచ్చిన  అంగదుడిని  మానసికంగా  దెబ్బ  తీయాలనుకొన్నాడు.  


 ‘రావోయ్  అంగదా!  నీ  తండ్రి  వాలి  నాకు  మంచి  మిత్రుడు.  ఆయన  కుశలమేనా?’  అంటూ  పలకరించాడు. 


 అప్పుడు  తన  తండ్రి  రాముడి  చేతిలో  హతమయ్యాడని  అంగదుడు  చెప్పవలసి  వస్తుంది.


  ఆ  తర్వాత  అదే  రాముడి  తరఫున  రాయబారానికి  వచ్చావా? అంటూ  అతనిని  పరిహసించ వచ్చు.  


ఎంతటి  మనో  స్థైర్యం  కలవా డైనా  దీనివల్ల  బలహీన  పడటం  ఖాయం.  అప్పుడు  తను  వచ్చిన  పని  సరిగా  చెయ్యలేడు.   ఇదీ  రావణుని  పన్నాగం.  


కానీ  రావణుని  ప్రశ్నకి  అంగదుడి  సమాధానం  చూడండి....


  ‘రావణా! ఇప్పుడు  నా  హిత  వచనాలు  వినకుంటే  నువ్వే  వెళ్లి  నా  తండ్రి  క్షేమ సమాచారాలు  స్వయంగా తెలుసుకోవచ్చు. ఆ  పరిస్థితి  రాకూడదనే  నీ  మంచి  కోరి  రామునితో  శత్రుత్వం  పెట్టుకొని  చావు  కొని  తెచ్చుకోవద్దని  చెప్పడానికి  వచ్చాను’  అన్నాడు.  


అతని  పన్నాగాన్ని  సమర్ధంగా  తిప్పి  కొట్టడమే  కాకుండా  అదే  సమయంలో   తను  ఏమి  చెప్ప్దదలుచుకోన్నాడో  అది  కూడా  స్పష్టంగా  చెప్పాడు  అంగదుడు. 


అతని  ఈ  జవాబు  విని  మనోస్థైర్యం  కోల్పోవడం  రావణుని  వంతయ్యింది.  


ఈ  రోజు  వ్యక్తిత్వ  వికాసం  కోసం  చెప్పే   పాఠాల్ని  మించిన  పాఠాలు  మన  పురాణాల్లో  వున్నాయి. 


 అవి  తెలుసుకుంటే  మన  విద్యార్ధులతో  పోటీ  పడటం  ప్రపంచంలో  ఎవ్వరి  వల్లా  కాదు.

కామెంట్‌లు లేవు: