12, నవంబర్ 2020, గురువారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*722వ నామ మంత్రము*

*ఓం గురుప్రియాయై నమః*

శ్రీవిద్యకు ఆదిగురువైన పరమేశ్వరునికే ప్రియపత్నియై, ఆ పరమేశ్వరుడనిన అత్యంత ప్రీతిగలదియై *గురుప్రియా* యను నామప్రసిద్ధయై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గురుప్రియా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం గురుప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తునకు ఆ పరమేశ్వరి కరుణచే బ్రహ్మవిద్య మరియు ఆత్మవిద్యల సమన్వయమగు శ్రీవిద్యయందు ఆసక్తికలుగును. శ్రీవిద్యోపాసనచే జగన్మాతను ఆరాధించు అభిలాష కలిగియున్నంత మాత్రముననే జన్మచరితార్థమైన అనుభూతిని పొందును. భౌతిక పరమైన ప్రతిబంధకములు తొలగి నిరంతర భగవదారాధనా చింతనతో జీవించి తరించును.

శ్రీవిద్యకు పరమేశ్వరుడు ఆదిగురువు. అట్టి ఆదిగురువుయొక్క సహధర్మచారిణి  అయిన శ్రీమాత ఆయనయందు అత్యంత ప్రియము గలిగి యుండుటచే *గురుప్రియా* యని అనబడుచున్నది. ఇంతకు ముందు *గురుమండలరూపిణీ* యని జగన్మాతను ప్రస్తుతించాము. శ్రీవిద్య తొలుదొలుత పరమేశ్వరుడు   పరమేశ్వరికి ఉపదేశించాడు. అందుకు ఆయన తొలిగురువయాడు. ఆపైన పరమేశ్వరుడు తన ప్రాణనాథుడు. శ్రీవిద్యకు తొలిగురువైన పరమేశ్వరుని ప్రియసతి జగన్మాత గనుక ఆ తల్లి *గురుప్రియా* యని అనబడినది. ఇక శ్రీవిద్య దివ్యౌఘ, (లక్ష్మీనారాయణులు, వాణీహిరణ్యగర్భులు, ఇంద్రాది దేవతలు), సిద్ధౌఘ (సనకసనందనాది సిద్ధులు) మానవౌఘ (విద్యారణ్య, గౌడపాద, శంకరభగవత్పాదులు) యనెడి సాంప్రదాయ సిద్ధంగా శ్రీవిద్య భూమండలములో వ్యాప్తిచెందినది.   వారందరును శ్రీవిద్యోపాసనకు చెందిన గురుపరంపర.  వారందరూ గురువులే. అటువంటి గురువులనిన శ్రీమాతకు ప్రీతి. అందుచే జగన్మాత *గురుప్రియా* యని అనబడినది. 

శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో.   కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. ప్రథమ గురువు ముందుగా

శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే.

 మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే "ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా".     దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్య తెలియజేశాడు. కనుక అమ్మను ఆరాధించే వీరందరూ పరమేశ్వరికి ప్రియమైనవారే.  అందుకే జగన్మాత *గురుప్రియా* అని అనబడినది.  

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గురుప్రియాయై నమః* అని అనవలెను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గురుప్రియాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*148వ నామ మంత్రము*

*ఓం నిత్యశుద్ధాయై నమః*

త్రికాలముల (సృష్టి,స్థితి,లయముల) యందును మాలిన్యరహితయై, స్పర్శరహితయగుటచే మహాశుద్ధ మరియు మహానిర్మలయై భాసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యశుద్ధా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యశుద్ధాయై నమః* అని ఉచ్చరిస్తూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు కల్మషరహితమైన మనస్కుడై, సదా పరమేశ్వరీ ధ్యాననిమగ్నుడై జీవితమందు పరిపూర్ణ సుఖశాంతులతో, కళంకరహితుడై విలసిల్లును.

జగన్మాత సృష్టిస్థితిలయకాలముల యందును మాలిన్యరహితురాలు గనుక *నిత్యశుద్ధా* యని అనబడుచున్నది.

*"అస్పర్శశ్చ మహాన్ శుద్ధి" రితి శ్రుతేః* అనగా "స్పర్శరహితము మహాశుద్ధి" అని శ్రుతులు చెబుతున్నాయి. 

*అత్యంత మలినోదేహో దేహీచాత్యంత నిర్మల* దేహము చాలా మలినమైనది. కాని దేహమునందుండు పరమాత్మ నిర్మలమైనది అని స్మృతిలో చెప్పబడినది. దేహం మలినమైనా, మన హృదయమందలి దహరాకాశంలో ఉండు పరమేశ్వరి నిర్మలమైనదే. ఏవిధమైన మాలిన్యములేక శుద్ధిగా ఉంటుంది. అందుకే జగన్మాత *నిత్యశుద్ధా* అని స్తుతింపబడుచున్నది.

గోమయము గోవుకు మాలిన్యమే. కాని పూజాగృహం శుద్ధి చేయబడుచున్నదిగదా. గోమూత్రము గోవునకు విసర్జింపబడిన పదార్థము. కాని అది సేవించు మనకు రోగనివారిణి, మన పవిత్రహోమకుండములు శుద్ధిచేయుటకు ఉపయోగింప బడునుగదా. శుద్ధి, అశుద్ధి అనునది అంతయు మన భావనలపై ఆధారపడునదియే. ఈ సృష్టిలో జగన్మాత అంతర్యామిగా ఉంటూ నిత్యశుద్ధురాలైయున్నది.

మంగళకరమైన మంత్రములకు, అమంగళకరమైన శ్రాద్ధకర్మల మంత్రములకు, దుర్భాషలకు ఉపయోగించు అక్షరములు ఒకటేకదా. వాటికూర్పు, ఉపయోగించు విధానమే శుద్ధమా లేక అపరిశుద్ధమా అనునది తెలియుచుండును. జగన్మాత సర్వాంతర్యామి మరియు పరబ్రహ్మస్వరూపిణి. పరమాత్మ ఎల్లప్పుడును నిత్యశుద్ధయే. గాన ఆ తల్లిని *నిత్యశుద్ధా* యని స్తుతించుచున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యశుద్ధాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: