*రమణాశ్రమ లేఖలు / జ్ఞానసంబంధ మూర్తి*
భగవాన్ "ద్రవిడ శిశుః" అంటే సంబంధులేనని తమిళ్ భాషలో వ్రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన తరువాత హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవాన్ నుద్దేశించి "వారికి 'ఆళుడ్య పిళ్లైయార్' అని గదా మొదటి పేరు. జ్ఞానసంబంధమూర్తి అన్న నామాంతరం కలిగింది? ఎందుకు కలిగింది?" అన్నారు. "అదా! దేవి అనుగ్రహించిన పాలు త్రాగగానే జ్ఞానసంబంధం ఏర్పడుటవల్ల జ్ఞానసంబంధమూర్తి నాయనారనే పేరు కలిగింది. అంటే,గురుశిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయమైనది గదా? అందువల్ల. నాటినుండి ఆ ప్రాంతములందున్న వారంతా ఆ పేరుతో పిలవసాగారన్నమాట. అదే కారణం" అన్నారు భగవాన్.
"భగవానుకువలెనే వారికీ సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయమైనదన్నమాట?" అన్నారు."ఊ-ఊ అందుకే కృష్ణయ్య, వారికీ నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు" అన్నారు భగవాన్. "రమణలీలలో సంబంధులు తిరువణ్ణామలకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో బోయలు సొత్తంతా దోచుకున్నారని" ఉన్నదే! వారు జ్ఞానదురంధరులు గదా? సొత్తేమున్నది వారికి?" అన్నాను. "అదా! వారు భక్తి మార్గావలంబకులు గదా, అందువల్ల ఈశ్వరాదేశానుసారం వారికి బంగారు తాళములు,ముత్యాలపల్లకీ మొదలైన చిహ్నములు లభించినవి. ఒక మఠమూ సిబ్బందీ అన్నీ ఉండేవి" అన్నారు భగవాన్. "అట్లాగా! అవన్నీ, ఎప్పుడు లభ్యమైనవి?" అన్నాను.
భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో "వారు జ్ఞానసంబంధ నామధారులైన తరువాత అంటే ఆ పసితనమందే అనర్గళ కవితాధారతో పాడుతూ క్షేత్రాటన మారంభించి ముందు 'తిరుక్కోలక్కా'అనే క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించి తన చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు. ఈశ్వరుడది చూచి మెచ్చి బంగారు తాళములు వారికిచ్చాడు. నాటి నుండి వారు ఏది పాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఆ తాళములు వారి చేతులలోనే ఉండేవి. ఆ వెనుక వారు చిదంబరం మొదలైన కొన్ని కొన్ని క్షేత్రాలు చూచుకుని 'మారన్ పాడి' అనే క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఈ రైళ్ళు లేవుగదా! ఈ పసిబాలుడు కాలినడకనే క్షేత్రటన చేస్తూ రావటం గమనించి ఆ క్షేత్రాధిష్ఠాన దైవమగు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయినది. వెంటనే ఒక ముత్యాలపల్లకీ, ముత్యాలగొడుగూ, ముత్యాలతోకూర్చిన తదితరములుగు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్లుగా కల్పించి కోవెలయందుంచి అక్కడి బ్రాహ్మణులకూ, సంబంధాలకూ స్వప్నమున తోచి 'అవి సంబంధువులకు సన్మానపురస్సరంగా ఈయవలసిన' దని బ్రాహ్మణులకూ, 'వారిస్తారు, తీసుకొమ్మ'ని సంబంధాలకూ చెప్పి పల్లకి మొదలయినవి ఆ బ్రాహ్మణులచేతనే వారికిపిస్తే వారది భగవత్ప్రసాదమున లభ్యమైనది గనుక తిరస్కరింపనొల్లక గ్రహించి, ప్రదక్షిణ నమస్కృతి పూర్వకముగా దాని నారోహించారు. నాటినుండీ వారెక్కడికి వెళ్ళినా ఆ పల్లకిమీదనే వెళ్లేవారు. క్రమంగా కొంత సిబ్బంది మఠమూ అన్నీ ఏర్పడినవి. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా గోపురదర్శనం అయ్యిందంటే, పల్లకీ దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవిలూరు నుండి ఇక్కడికి నడచి వచ్చారు. అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా" అన్నారు భగవాన్. (ఇంకా ఉంది )
🍃 ఆత్మ 🍃
21.ప్ర: ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు; తరువాత మరల నష్టమగుట వుండునా?
మ: కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభవమే అని ఉంది. వాసనలు నిశ్శేేషం కాకుండా ప్రాప్తించిన జ్ఞానం స్థిరంగా ఉండదు. వానిని పూర్తిగాక్షయింప చేయాలి. లేకుంటే మరల జనింపక తప్పదు. గురుబోధ విన్నంతనే, ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరంటారు. ఇతరులు మననం అవసరమంటారు. చిత్తైకాగ్రత వల్లనే అని మరి కొందరు. ఇంకా కొందరు సమాధి మూలంగా అని అంటారు. ఇవన్నీ పైకి వేర్వేరుగా కనపడినా, నిజానికి అవన్నీ సమానార్థాలే! వాసనా క్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిర మవుతుంది.
22.ప్ర: ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడెలా ఉంటుంది?
మ: ప్రశ్నా తప్పు. కలగటానికి కొత్తగా ఏమీ లేదు.
23.ప్ర: తెలియలేదు స్వామి!
మ: ఏం లేదు. ఇప్పుడు ప్రపంచంలో నీవున్నావు. అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది.
శిష్యుడు - ఆత్మ సర్వవ్యాపి అనుచున్నారు . బ్రహ్మము ప్రతిచోట నిండియున్నది అనుచున్నారు . కానీ , వెలిగనున్నది - నాలోనున్నదియు నదియే అని కూడా చెప్పెదరు.
- నాలోనున్నదియు నదియే అని కూడా చెప్పేదరు . నాలోని యాత్మయే బ్రహ్మమైనచో , నేను సర్వవ్యాపినై యుండవలెను . కానీ , నేనీ దేహం లోపలనే యుండునట్లును ( ఇందులో నే బంధింపబడియున్నట్లు ) నాకు స్పురించుచున్నది . నా దేహముకంటే నేను వేరుగ నున్నప్పటికిని దానినుండి భేదించుటకు ( చీలిపోవుటకు ) వీలు లేనట్లున్నది . అదే రీతిగా నా మనస్సునుండి నేను వేరై నిలుచుట యసాధ్యముగనున్నది . ఇదిగాక ' నేను ' అను స్మృతికూడ మనస్సులోనిదే ( భాగమే ) ! మెదడు వినా మనస్సెక్కడ నున్నది ? వాస్తవములో నీ దేహములో నొకభాగమైన యీ మెదడును లేక మనస్సును విడిచి వేరుగ నిలువగలనని యూహించలేకున్నాను .
-
మహర్షి - అయినదా ? సందేహముల కంతులేదు . ఒక సందేహము తీర్చగానే మరియొకటి యంకురించును . ఇది ఒక చెట్టు ఆకులను ఒకటొకటిగా గిల్లివేయ జూచుటవలె నుండును . అన్ని ఆకులును గిల్లి వేసినను కొత్తగ చిగుర్చును గదా ! వేరుతో ( సమూలముగా ) ను నరికి వేయుటయే తగినపని .
శిష్యుని ఆచారం
భగవాన్ స్కంద ఆశ్రమంలో నివసిస్తున్న రోజులవి. యాష్ పాణి అనే భక్తుడు స్కంద ఆశ్రమాన్ని నిత్యము ఊడ్చి శుభ్రపరిచే వాడు. అతడు యాష్ పాణి(శ్రీలంక) నగరం నుండి వచ్చాడు కాబట్టి , అతనిని అందరూ "యాష్ పాణి "అనిపిలిచేవారు. ఒకనాడు భగవాన్ దర్శనానికై భక్తులు వచ్చారు. వారితో భగవాన్ యథేచ్ఛగా "ఒక నోటు పుస్తకంలో కొన్ని పద్యాలను రాసు కొన్నాను. ఉత్తర కాశీ నుండి వచ్చిన భక్తుడు ఆ పుస్తకాన్ని చూడటానికి తీసుకున్నారు. ఆయన దానిని తిరిగి ఇవ్వకుండా ఉత్తర కాశీకి వెళ్లి పోయారు. వారు ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్లి కొన్ని మాసములు అయ్యింది."అని అన్నారు. "యాష్ పాణి"కొన్నాళ్ల నుండి ఆశ్రమంలో కనిపించ లేదు. హఠాత్తుగా ఒక నాడు భగవాన్ ముందు కనపడి పోయిన ఆ నోటు పుస్తకాన్ని వారి వద్ద పెట్టి నమస్కరించాడు. భగవాన్ చిరునవ్వుతో స్వీకరించారు. భగవాన్ ఆ పుస్తకాన్ని గురించి ప్రస్తావించే తప్పుడు అక్కడే పని చేస్తున్న యాష్ పాణి తన పని ముగించుకుని , వెంటనే ఉత్తర కాశీ బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో రోజులు విశ్రాంతి లేకుండా తిరిగి ,ఉత్తర కాశీకి వెళ్లి, భగవాన్ చూపించిన స్వామిని వెదికి వెదికి పట్టుకుని ఆ నోటు పుస్తకాన్ని తిరిగి తీసుకొని వచ్చారు .!వెంటనే తిరువన్నామలై వచ్చి భగవాన్ కు సమర్పించారు.
“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి