12, నవంబర్ 2020, గురువారం

మానవుని లక్ష్యం

 .

( దైవ సన్నిధి చేరడమే మానవుని లక్ష్యం )

.

మానవుడిగా పుట్టి మోక్షాన్ని సాధించాలనుకోవడానికి మొదటి మెట్టు- భక్తి భావం. భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటూ నిష్కామ కర్మతో జీవితాన్ని గడపడం భగవంతుణ్ని చేరడానికి ముఖ్య మార్గం. సాధకులు, మునులు వారెంచుకున్న మార్గాల్లో పరమపదం చేరితే, సామాన్య మానవులు తమ తమ నిత్య కార్యాచరణతో నిస్సంగత్వాన్ని, భక్తిభావంతో పరమపదాన్ని చేరవచ్చు.

భగవానుడి కథలు వినడం, భగవంతుడి గుణగణాలను కీర్తించడం, అనునిత్యం భగవన్నామాన్ని స్మరించడం, దేవుడి పాదాలను సేవించడం, భగవానుణ్ని సద్గుణ స్వరూపుడిగా అర్చించడం, త్రికాలాల్లో మనస్ఫూర్తిగా నమస్కరించడం, భగవంతుడికి దాస్యం చెయ్యడం, భగవంతుడితో స్నేహించడం, ఆత్మనివేదనం... వీటిని నవవిధ భక్తి మార్గాలని వేదవిదులు చెబుతారు. ఇందులో దేన్ని నిష్కామ కర్మతో కలగలిపి ఆచరించినా అది మోక్షప్రదాయిని అవుతుంది.

వీటిలో అతి ముఖ్యమైనది సత్సాంగత్యం. పైన చెప్పిన మార్గాలకు సత్సాంగత్యం తోడైతే అది అద్భుత ఫలితాలు ఇస్తుంది. మానవుడు ఒక ఆలోచన చేసేటప్పుడు దాన్ని సరైన మార్గంలో ఉండేలా చూసేది సజ్జనులతోడి స్నేహం. ధ్యానం, ప్రార్థన మొదలైనవి సామూహికంగా చెయ్యడంలో ఉద్దేశం అదే. మానవుడి ఆలోచనా పరిధి అతి విస్తృతమైంది. మనసు ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనేక అడ్డంకులు వస్తాయి. ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ప్రాపంచిక విషయాలు దొర్లుతూ ఉంటాయి. వీటిని అధిగమించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపడానికి ముఖ్యమైన సాధనం- మంచివారిని కలవడం. దీనివల్ల సత్కర్మాచరణ అలవడుతుంది.

రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది.

భార్యాపిల్లలను పోషించడానికి సామాన్య జీవితం చాలుననే దృక్పథంతో కైవల్య పదం చేరడాన్ని నిర్ణయించుకున్న పోతన ఆచరణీయుడు. నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో మునిగితేలుతూ ఉంటే క్రమేపీ డాంబిక జీవనం అలవడి సన్మార్గం, భగవచ్ఛింతనలు దూరమవుతాయి. అందుకే పేద ధనిక కులమత ప్రసక్తి లేకుండా సజ్జనులతోడి కాలక్షేపం- మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం తదితర కంటకాలను దూరం చేస్తుంది.

కష్టం అనేది తెలియకుండా పెరిగిన గౌతముడు ప్రపంచంలోకి వచ్చి ఆత్మజ్ఞానం పొంది బుద్ధుడై లోకానికి మోక్ష మార్గాన్ని నిర్దేశించాడు. కోరికలు, వాంఛలను అదుపులో పెట్టుకొనేందుకు ధ్యానం ఉపకరిస్తుంది. ఆ ధ్యానం వల్ల మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు భక్తిబాటలో పయనిస్తుంది.

సజ్జనులతోడి సాంగత్యం మనలోని లోపాలను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆత్మప్రక్షాళనకు దారిచూపిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ఇతరుల అనుభవాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి.

గతంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి తెలియని దుఃఖంతో బాధపడ్డాడు. సేవకులు, వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దుఃఖం తగ్గలేదు. చీకటిపడిన తరవాత ఏకాంతంగా తోటలోకి నడిచాడు. ప్రశాంతంగా ఉన్న తోటలో ఒక కోకిల దిగాలుగా కూయడం వినపడింది. ఆ కోకిల గొంతులో విషాదాన్ని వింటూ తన దుఃఖాన్ని వదిలివేశాడు రాజు. సజ్జన సాంగత్యంలో ఉండే మహత్తు ఇదే! ఇతరుల బాధలను పంచుకోవడం, అనాథలకు ఆర్తుడవై ఉండటం, వృద్ధులకు చేయూత ఇవ్వడం, కర్మలను నిష్కామంగా భగవద్దత్తం చేయడం... పరమపదానికి సోపానాలు!

.

కామెంట్‌లు లేవు: