12, నవంబర్ 2020, గురువారం

సుభాషితాలు

---------------    ---------   సుభాషితాలు --------------

 

కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స

త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా

పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం

తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్.

 

భావము:- దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంప మని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిన కాపాడేది.

 

కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై

    కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌

    వడసెం బుత్రులులేని యా శుకునకున్‌ వాటిల్లెనే దుర్గతుల్‌

    చెడునే మోక్షపదం బపుత్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొడుకులు లేరు అని జీవితము మీది అనురాగముతో అవివేకులై జనులు ఏడ్చెదరు. ధృతరాష్ట్రునికి ౧౦౦ మంది కొడుకులు కలిగికూడా ఏ గతులు పొందినవాడయ్యెను. కొడుకులు లేని శుకమహర్షికి దుర్గతులు కలుగలేదు కదా ప్రభో!

 

సంతత పుణ్యశాలి యొక జాడను సంపద వాసిపోయి తా

నంతట పోకనెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు; మా

సొంతము నందు చందురుని యన్ని కళల్ పెడబాసి పోయినన్

కాంతి వహింప డోటు తిరుగంబడి దేహము నిండ! భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! పుణ్యాత్ముడు తన సంపద అంతా పోయినా బాధపడక ఎప్పటిలా ఉంటాడు. చంద్రుడు నెల చివర కళలన్నీ పోయినా మళ్ళీ కాంతివంతునిగా వెలుగొందును కదా!

 

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ

విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ

ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ

ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

 

           భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!

 

   పనులెన్ని కలిగి యున్నను

   దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై

   వినగోరుము సత్కథలను;

   కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!


                 తా :--ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.

 

శైలే శైలే న మాణిక్యం, మౌక్తికం న గజే గజే

సాధవో నహి సర్వత్ర, చందనం న వనే వనే

 

తా:-- ప్రతి పర్వతము పైనా రత్నము దొరకదు,ప్రతి ఏనుగు కుంభ స్థలము లో ముత్యాలు వుండవు,ప్రతి

అరణ్యము లో చందన వృక్షాలు వుండవు,అలాగే అన్ని చోట్లా సజ్జనులు దొరుకుట దుర్లభము.

ఉత్తమ జాతి ఏనుగుల కుంభ స్థలము లలో ముత్యాలు దొరుకుతాయని ప్రతీతి.పూర్వం సమర్థులైన వేటగాళ్ళు

 

అడవులలో మాటు వేసి ఏనుగును చంపిన సింహపు అడుగుజాడలలో నుండి ముత్యాలు గ్రహించే వారట.సింహము ఏనుగును తన పంజా తో చీల్చినప్పుడు దాని పంజాలో ముత్యాలు యిరుక్కొని అవిసింహము గుహలోకి వెళ్ళే టప్పుడు క్రింద రాలి పడతాయని, అవి వేటగాళ్ళుసింహపు అడుగు జాడలను బట్టి పోయి సంగ్రహించి అమ్ముకునే వారని ప్రతీతి. (సింహము ముందు ఏనుగు కుంభ స్థలమునే కొడుతుంది.)

 

గుణ దోషౌ బుధో గృణ్హన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః

శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి

 

శివుడు గరళమును కంఠము నందుంచుకొని, చంద్రకళను శిరమున ధరించినట్లుగా

పండితుడైనవాడు పరుల దోషములను లోపలే వుంచుకొని, గుణలేశములను శిరసావహిస్తాడు.

 

సతాం ధనమ్ సాధుభి రేవ భుజ్యతే

దురాత్మభి రుదుశ్చరితా త్మనామ్ ధనం

శుకాదయ శ్చూత ఫలాని భుజంతే

భవంతి నింబా: ఖలు కాకభోజనాః

 

మంచివారి సంపదలు మంచివారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల ధనములు దుష్ట

చరిత్రులకే వినియోగ పడతాయి. మామిడిపండ్లను చిలుకలు ఆరగిస్తాయి.వేపపండ్లు

కాకులకే భుక్తం అవుతాయి.ఇది లోకములో జరుగుతూనే వున్నది.కదా!

 

భాను స్సకృద్యుక్త తురంగ యేవ

రాత్రి దివం గంధ వహః ప్రయాతి

శేష స్సదై వాహితః భూమిభారః

షష్టామ్ శవృత్తే రపి ధర్మ యేష:

 

తా:---ఎప్పుడో పూన్చిన గుఱ్ఱములతో సూర్యుడు అవిశ్రా౦తముగా తిరుగుచునే వున్నాడు

వాయుదేవుడునూ అలాగే వీచుచున్నాడు. ఆదిశేషుడున్నూ భూమిని అటులనే మోయుచున్నాడు దేశ సంపదలలో ఆరవ పాలునకధికారి యైన రాజు కూడా స్వసుఖమును దలఁపక లోకశ్రేయమునకై పాటుపడుట సనాతన ధర్మమై యున్నది.

 

హర్తకు గాదు గోచర మహర్నిశ మున్ సుఖపుష్టి చేయు స

త్కీర్తి ఘటించు విద్య యను దివ్య ధనంబకిలార్థ కోటి కిం

పూర్తిగా నిచ్చినన్ బెరుగు బోదు యుగాంతపు వేళనైన భూ

భర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మాన్పు టొప్పగన్

 

           అర్థము:-విద్యా ధనమును దొంగలు   దొంగిలింప లేరు,అది ఎల్లప్పుడు సుఖమునే కలుగజేయును, కోరిన వారికి

ఎంత యిచ్చిననూ పెరుగుతుందే తప్ప తరిగిపోదు ధనము లాగ.ప్రళయ కాలమప్పుడు గూడ నశించదు,

ఇట్టి విద్యా ధనము గలవారి యెడ సామాన్య ధనము గల రాజులూ దురాగ్రహము విడిచి 

పెట్టవలెను విద్యావంతులను ఎవరూ ఎదుర్కొనలేరు. (భర్తృహరి సుభాషితం)

 

శ్రోత్రం శ్రుతి నైవ న కుండలేన 

దానేన పాణిర్నతు కంకణే న 

విభూతి కాయః ఖలు సజ్జనానాం 

పరోపకారేణ న చందనేన 

అర్థము:-- సజ్జనులు చెవులను కుండలములు ధరించుటకు గాక వేద శాస్త్రములు విని సార్థక మొనరించు కుందురు. చేతులను కంకణ ములను ధరించుటకు గాక దానము చేయుటకు ఉపయోగింతురు. శరీరమును చందనాదుల పూతలచే గాక పరోపకారము చేయుట చేతనే ప్రకాశిం ప జేసు కొందురు.

 

కాలము గడిచిన మగుడదు

కాలము కంటేను ధనంబుగలుగదు ధాత్రిన్

కాలమమూల్య పదార్థము

కాలము గడుపకుము వ్యర్థగతిని కుమారా!


🌹🌹🌹 భావం.🌹🌹🌹🌹

"టైములేదు" అని మనం ఎంతో కాలాన్ని వ్యర్థం చేస్తూ వుంటాం. బద్ధకం,

సోమరితనం కప్పి పుచ్చుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదని అయ్యనకోట పార్థసారధి

చెప్పిన పద్యం ఇది".


(1)గడిచిన క్షణం తిరిగి రమ్మంటే రాదు.

(2)నిజం ఆలోచిస్తే కాలాన్ని మించిన ధనం లేదు.

(3)కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపద లభిస్తుంది.

(4)కాలం విలువను మనం కొలువలేము.

(5)కాబట్టి కాలం విలువ తెలుసుకొని ప్రవర్తించకపోతే జీవితం వ్యర్ధమవుతుంది

సాధించ వలసింది సాధించలేము.

(6)కాబట్టి కాలం విలువ తెలుసుకొని మెలుగుదాం

కామెంట్‌లు లేవు: