12, నవంబర్ 2020, గురువారం

శివానందలహరి

 శివానందలహరి

85_వ   శ్లోకం

 " జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక :


ఈశ్వరుని కి కావలసిన ఉపచారములు తాను సమకూర్చ లేక పోతున్నానని

శంకరులు ఈ శ్లోకము లో మఱోవిధంగా చెప్పారు "స్వామీ! నీకు ఉపచారాలు చేసే

 శక్తి యుక్తులు నా దగ్గఱ లేవు. కాబట్టి నన్ను మన్నింౘు ". అని శివుణ్ణి వేడుకున్నాడు.


శ్లోకము :


               జలధి మథన దక్షో నైవ పాతాళ భేదీ

               నచ వనమృగయాయాం  నైవ లుబ్ధః ప్రవీణః

               అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం

               కథయ కథమహం తే కల్పయానీన్దు మౌళే !!


తాత్పర్యము :


 చంద్ర శేఖరుడవైన ಓ పరమేశ్వరా!  నేను పాలసముద్రాన్ని మథింౘగలసమర్థుడనుకాను. 

అందువల్ల నీకు ఆహారంగా కాలకూట విషాన్ని సమర్పింౘలేను. నేను పాతాళలోకాన్ని 

భేదింౘగలశక్తి కలవాణికూడా కాను.  అందువల్ల నీకు ఇష్టమైన సర్పమును తెచ్చి నీకు

అలంకారముగా సమర్పించలేను. నేను అడవులలో తిరిగి వేటాడేనేర్పుగల వేటగాణికాను. 

అందువల్ల వేటాడి తెచ్చి నీకు వస్త్రముగా గజచర్మాన్నికానీ, వ్యాఘ్ర చర్మాన్ని కానీ

సమర్పింపలేను. మఱి నీకు ఏవిధంగా ఆహారము, భూషణము, వస్త్రము సమర్పింౘ

గలనో చెప్పు. ( ఇటువంటివేవీ నేను ఇవ్వ లేక పోయినా నా యందు దయతో నీవు కరుణింౘు).


వివరణ:


దేవతలను పూజించేటప్పుడు వారికి షోడశోపచారాలు చెయ్యాలి.   అవి

1)  ఆవాహనం  2)  ఆసనం  3) పాద్యం  4) అర్ఘ్యం  5) ఆచమనీయం  6) స్నానం

7) వస్త్రం  8) యజ్ఞోపవీతం  9) గంధం  10) పుష్పాలంకరణం  11) ధూపం  12) దీపం

13) నైవేద్యం 14) తాంబూలం  15) నమస్కారం  16) ప్రదక్షిణం.      వీటిలో ముఖ్యంగా

నైవేద్యం,   పుష్పం   , వస్త్రం,  ఆభరణం   సమర్పింౘాలి.


కానీ శివుణి పూజించే వేళల్లో పై ఉపచారాలు సమర్పింౘడంలో తనకు చిక్కులు 

ఎదురవుతున్నాయని శంకర భగవత్పాదులు ఈ శ్లోకము లో ఈశ్వరుని కి నివేదించు

కున్నారు.


శివునికి నైవేద్యం పెట్టాలంటే ఆయనకిష్టమైన కాలకూట విషాన్ని ఆహారంగా 

సమర్పింౘాలి.  ఇక శివుడికి   పుష్పమును అలంకారంగా సమర్పింౘలి. ఈశ్వరునికి

ఇష్టమైన పుష్పాలు కల్ప వృక్ష పుష్పాలు.  కాలకూటవిషం, కల్పవృక్షం ఈరెండూ 

దేవదానవులు క్షీరసముద్రాన్ని మథించినప్పుడు పుట్టినవే కదా!  కాబట్టి నైవేద్యం గా

కాలకూటవిషాన్ని, అలంకరణ కు కల్పవృక్ష పుష్పాల్నితేవాలంటే తిరిగీ పాలసముద్రాన్న్

మథించి తేగల సమర్థతఉండాలి.  తనకాసమర్థత లేదని కనుక ఆహారము, అలంకారము

సమకూర్చలేనని శంకరులు తమ నిస్సహాయతను విన్నవింౘుకున్నారు.


ఇక భూషణములు సమర్పిద్దామనుకుంటే ఈశ్వరుని కిష్టమైన సర్పభూషణములు కావాలి

పాములు పాతాళంలో ఉంటాయి. వాటిని సమర్పింౘాలంటే పాతాళాన్ని భేదించి 

పాములను పట్టి తీసుకురావాలి. ఆ సమర్థత తనకు లేదని శంకరులు విన్నవింౘు

కున్నారు.


పోనీ శివునికి వస్త్రమనే ఉపచారమైనా చేద్దామంటే ఆయనకిష్టమైన గజచర్మాన్నో,

వ్యాఘ్ర చర్మాన్నో తేవాలి.  ఆపని చేయాలంటే వాటిని వేటాడి ౘంపి చర్మాలను

 సేకరింౘడానికి తానో మంచి వేటగాడై యుండాలి. తానలా వేటగాణి కాక పోవడం వల్ల

వస్త్రం గా గజచర్మాన్నో, వ్యాఘ్ర చర్మాన్నో తెచ్చి శివునకు ఈయలేనని శంకరులు

బాధపడ్డారు.


   " మహాదేవా !  మఱి నన్నేమి చేయమంటావో , నీవేచెప్పు ? "    అని శివుడినే 

శంకరులు అడిగారు. అయితే ఇక్కడ శంకరులు ఒక్కమాట అనగలరు. 

" స్వామీ !  పరమశివా!  నేను యథాశక్తి _ యావచ్ఛక్తి _ ధ్యానావాహనాది 

షోడశోపచార పూజాంకరిష్యే ". అని.   ఎందుకంటే భక్తులలోన్ సద్భావనకే,

దేవతలూ, సత్పురుషులూ, ద్విజులూ సంతోషపడతారట.  అదే ఇతరులైతే

తిని, త్రాగితేనే తృప్తి పడతారని స్మృతులు చెపుతున్నాయి.


            "  సద్భావనేన హి తుష్యంతి, దేవాః సత్పురుషాణి ద్విజాః, 

                ఇతరే  ఖాన పానేన "

            

              అన్నతి స్మృతివాక్యము.     నిజానికి ఈశ్వరుడు పరమ వాత్సల్య మూర్తి. 

కృపాంతరంగుడు,  భక్తుడు తనకేమి సమర్పిస్తున్నాడా!  అన్ ఎప్పుడూ ౘూడడు.  

ఇచ్చే ది భక్తి తో ఇస్తున్నాడా ?  లేదా ? అనేదే ౘూస్తాడు. ఆయనమాత్రం భక్తులకు

ఏమి కావాలో, అవే ఇస్తాడు. ఆయనలోని ఆమాతృత్వమే  భక్తులకు రక్ష.


ఈ శ్లోకము లోని  " కుసుమభూషా ". అనే దానికి కొందరు వ్యాఖ్యాత లు 

మఱోరకంగా అర్థం చెప్పారు.    ". కుసుమభూషా ". అంటే ఈశ్వరునికి తలపూవైన

 " చంద్రుడు". అని అర్థం చెప్పారు. అప్పుడు చంద్రుణ్ణి శివునికి అలంకారంగా 

ఇవ్వాలంటే పాలసముద్రాన్ని మథింౘాలి.  ఎందుకంటే చంద్రుడు పాలసముద్ర మథన

వేళలోనే పుట్టాడు.  కాబట్టి పాలసముద్రాన్ని మథింౘాల్సిఉంటుందనీ అందుకు తాను

 సమర్థుడను కాననీ అదే శంకరుల భావమని వారు చెప్పారు.


అలాగే దివాకర్ల వేంకటావధాని గారు ఇక్కడ మరోరకంగా వివరణ చెప్పారు. 

" కుసుమభూషా"  అనగా  " పుష్పాలంకారము" శివునికి విష్ణుమూర్తి పూజలో

ఒక పుష్పం తక్కువకాగా  తన నేత్రాన్ని తీసి  " సహస్ర" పుష్పం గా శివునికి

సమర్పించాడు. విష్ణుమూర్తి వరాహావతారాన్ని ఎత్తి నప్పుడు పాతాళాన్ని

భేదించి భూమండలాన్ని పైకి ఎత్తి తెచ్చాడు. ఇక్కడ శంకరులు తాను పాతాళాన్ని 

భేదింౘలేనని పాతాళాన్ని భేదించిన విష్ణుమూర్తి వలె నేత్ర పుష్పమును శివునకు

అలంకారంగా సమర్పింౘలేననీ శంకరులు చెప్పారని దివాకర్ల వేంకటావధానిగారు

వ్రాశారు.

కామెంట్‌లు లేవు: