రెండవ అధ్యాయము
తే గీ 22
సత్యనారాయణస్వామి సద్వ్రతంపు
విధి విధానము నంతయు వినియు మునులు
"పూర్వ మెవరైన వ్రతమును పుడమి యందు
సల్పినారలొ దయచేసి తెల్పు " మనిరి
కం 23
మునులావిధి యడుగంగను
విని సూతుడు సంతసిల్లి వినయము తోడన్
ఘనమగు యా వ్రత క్రతువును
మును జేసిన వారి చరిత ముదమున దెలిపెన్
కం 24
"కాశీ నగరము నందున
భూసురు డొకడుండె మిగుల పూత చరిత్రన్
వాసిగ విజ్ఞానైనను
కాసులు లేనట్టి గర్భ కడు పేదతడున్
కం 25
అనుదిన భిక్షాటనమును
నొనరగ తా జేయుచుండి నోరిమి తోడన్
మనమున హరినే దలచుచు
యనయము తా నుండసాగె యాత్మీయులతోన్
కం 26
నిరుపేదగు యా విప్రుకు
సిరి సంపదలీయ దలచి శ్రీపతి యంతన్
ధరియించి వృద్ధరూపును
దరిచేరియు నిట్లు పల్కె దయచూడ్కులతోన్
తే గీ 27
"వేదముల నెల్ల నేర్చియు విప్రవర్య !
యేల యీ రీతి బిక్షంబు నెత్తుకొనుచు
బ్రతుకుచుంటివి యత్యంత బాధతోడ
వినెద తెలుపుము నీయొక్క విమలచరిత
కం 28
నిరతము నీ వీ రీతిగ
తిరిపంబును యెత్తుకొనుచు తీరని వ్యధతోన్
జరుపుచు సంసారంబును
నిరుపేదగు జీవనంబు నెఱపెద వెటులన్ ?"
కం 29
బ్రాహ్మణప్రియుడగు విష్ణువు
బ్రాహ్మణు వెతలెల్ల బాప భావించి మదిన్
బ్రాహ్మణు నడుగగ యవ్విధి
బ్రాహ్మణు డిట్లనియె భక్తి భావము పొంగన్
ఆ వె 30
"బ్రాహ్మణుండ నేను బహుశాస్త్ర పఠితుడ
యుంఛవృత్తితోడ నుండు చుందు
దార సుతులతోడ దారిద్ర్యమున నుండి
బ్రతుకు నీడ్చుచుంటి భారముగను
కం 31
సతతము శ్రీహరి నుతులతొ
ప్రతి గేహముచెంత బిక్ష ప్రార్ధించడుగన్
యతితక్కు వొచ్చుభిక్షతొ
సతి సుతులతొ బ్రతుకు చుందు సతమత మౌచున్ "
కం 32
విప్రు0డాడిన మాటలు
విప్రోత్తమ వేషధారి విష్ణుడు వినియున్
విప్రుని కావగ దలచియు
'విప్రా ! చింతించ వలదు విను'యంచనియన్
ఆ వె 33
"నీదు పేదతనము నిస్సేషముగ బోవ
దివ్య వ్రతము నొకటి తెలియ సేతు
యాచరించ దాని యాత్మ సాక్షిగ నీవు
పొందగలవు యిలను భూరిసుఖము
ఆ వె 34
అదియె నరునికిచ్చు యాముష్మికంబును
అదియె నరునికిచ్ఛు యాత్మశాంతి
యెయ్యది హరి దొల్లి యెఱిగించె , నయ్యదే
సత్య దేవు దివ్య సద్వ్రతంబు
తే గీ 35
విష్ణుదేవుని దివ్యమౌ వేఱు రూపె
సత్యనారాయణస్వామి సత్త్వరూపు
సత్యదేవుని మనసార సన్నుతించ
సకల కోర్కెలు దీరును సర్వులకును
కం 36
వేగమె పేదరికంబును
పోగొట్టగ జాలునట్టి పుణ్య వ్రతంబున్
రాగముతో గృహ మందున
జాగించుక సేయకుండ సల్పుము భక్తిన్ "
ఆ వె 37
విప్ర వేష ధారి విష్ణుడా విధముగ
పేదబ్రాహ్మణునకు ప్రియము తోడ
సత్యవ్రతమువిధిని సంపూర్ణముగ జెప్పి
మహిమ తోడ యపుడు మాయ మయ్యె
తే గీ 38
వృద్దవిప్రుని మాటలు విశ్వసించి
సత్యనారాయణస్వామి సద్వ్రతమును
చేతు రేపని మనమందు చెప్పి కొనియు
విప్రవర్యుడు నిద్రించె వీడి చింత
సీ 39
మఱునాడు విప్రుడు వరువాతనే లేచి
నెఱవేర్చు కొనియును నిత్య క్రియలు
సత్య వ్రతము సేయు సంకల్పమును మళ్ళి
మదియందు భక్తితో మనన జేసి
హరి నామస్మరణతో యాత్మ సంశుద్ధితో
వివిధ గృహములందు వేడె బిక్ష
ఆనాడు విప్రుకు హరి మహాత్మ్యంబుచే
యధిక ద్రవ్యము దక్కె యద్భుతముగ
తే గీ
ద్రవ్యమున దెచ్చి యంతట తగిన సరుకు ,
బంధు మిత్రుల బిలిచియు బ్రాహ్మణుండు
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
సల్పి విద్యుక్త రీతిన సంత సిల్లె
తే గీ 40
సత్య వ్రతమును శ్రద్ధతో సల్పు కతన
విప్రునకు జేరె విభవంబు విరివిగాను
సత్యపథమున యాతడు సాగుచుండి
బంధు మిత్రుల యందున బడసె కీర్తి
కం 41
సతతము విప్రుడు తదుపరి
ప్రతిమాసము నందు వ్రతము భక్తితొ జేయన్
యతి సంపద సమకూడెను
యతులిత మగు మోక్ష పదము యందెను తుదిలో
తే గీ 42
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
యెవరు భక్తితొ సేతురో యిలను యెపుడు
యట్టి వారల కిహమందు యమరి సిరులు
ముక్తి కల్గును తుదియందు మోదముగను
కం 43
హరి నారదమునివరునకు
యెఱిగించిన విషయమంత యెఱిగిన మీరల్
మఱి యేమి నెఱుగ దలతురొ
యెఱిగించిన నెఱుక సేతు వినయము తోడన్ "
తే గీ 44
సూతు డారీతి జెప్పగ , శ్రోత లైన
శౌనకాదిగ గల్గిన సకల మునులు
"విప్రు వలనను వినియును విమలవ్రతము
చేసియుండిరె యెవరైన ? చెప్పు " మనిరి
కం 45
శౌనకు డాదిగ గల్గిన
ముని సంఘములెల్ల యటుల ముదమునయడుగన్
విని సూతుం డీవిధముగ
వినిపించెను నొక్క వ్యక్తి విమల చరిత్రన్
తే గీ 46
తొల్లి యీ విప్రవర్యుడె తోషముగను
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
బంధు మిత్రుల తోడను బ్రాహ్మణులతొ
సల్పుచుండెను భక్తితొ స్వగృహమున
తే గీ 47
అప్పు డొక కాష్ఠవిక్రేత దప్పి గొనియు
చేరె విప్రుని గృహమును నీరమునకు
వచ్చి యట జేయుచున్నట్టి వ్రతము జూచి
యబ్బురంబొంది విప్రుని యడిగె నిట్లు
ఆ వె 48
"విప్రవర్య ! నీవు విధ్యుక్త రీతితొ
సల్పు చున్న వ్రతము , తెల్పు యేమి ?
యేమి ఫలిత మిచ్చు ? యేరీతి చేయుట ?
విశదపరచు మార్య ! వివరముగను "
తే గీ 49
ఆశతో కాష్ఠవిక్రేత యడుగ నట్లు
పరమ పావనుడైన యా బ్రాహ్మణుండు
విమల వ్రతవిధి నంతయు విశద పరచె
మఱియు యనెనిట్లు యత్యంత మధురముగను
తే గీ 50
“సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
సల్పు నెవ్వరు భక్తితో శక్తి కొలది
యతని కోర్కెలు దీరియు యవనిపైన
సర్వ సంపద లొనగూరు సత్య మిదియె "
తే గీ 51
విప్రు వలనను వ్రతవిధి వినియు నంత
కాష్ఠవిక్రేత మనమందు గట్టిగాను
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
సల్పెదను నేను యనియును సమయ మొందె
తే గీ 52
కాష్ఠ విక్రేత యంతట కాష్ఠములతొ
ధనికు లున్నట్టి వీధికి తరలి వెళ్లి
యమ్మ కట్టెల నెల్లను సొమ్మునకును
దైవ కృపవల్ల రెట్టింపు ద్రవ్య మొచ్చె
తే గీ 53
అంత యా కాష్ఠవిక్రేత సంతసమున
వలయు సామాగ్రి దెచ్చియు వ్రతమునకును
ప్రేమతో బంధువులనెల్ల బిలుచుకొనియు
సల్పె భక్తితొ విధ్యుక్త సత్యవ్రతము
తే గీ 54
కాష్ఠవిక్రేత యారీతి క్రతువు జేసి
పొందె సంపద లెల్లను పుడమియందు
ఇహము యందున సుఖముల ననుభవించి
పరము నందున మోక్షంబు బడసె తుదిన "
రెండవ అధ్యాయము
సమాప్తము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి