విదుర నీతి 39
అన్నం జీవనాధారం. దేహానికి, శరీర మనుగడకు ముఖ్యమైన, ప్రాథమికమైన, ప్రముఖమైన ఇంధనం. మానవుడు జీవించాలంటే ఆహారం కావాలి. ఆహారం ద్వారా మాత్రమే శరీరం శక్తివంతమౌతుంది. తేజోవంతమౌతుంది. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే సరిపోయే తగు ఆహారము లభించాలి. దేహం బలిష్టంగా ఉంటేనే ధర్మకార్యాలు చేయగలుగుతాము. చతుర్విధ పురుషార్ధాలు సాధించగలుగుతాము. ఆ ధర్మకార్యాలతోనే స్వయం సమృధ్ధినీ, అభివృధ్ధిని, సమాజ పురోభివృధ్ధినీ ప్రోత్సహించగలుగుతాము. అందుకే అన్నం అత్యంత ప్రధానమైనది. అన్నముంటేనే దేహముంటుంది. దేహముంటేనే ధర్మసాధన సాధ్యమౌతుంది.
కోరిక దుర్వినియోగానికైతే అది రాక్షసమౌతుంది. సద్వినియౌగ నిమిత్తమైనది దైవికమైన కోరిక అవుతుంది. దేహాన్నినిలబెట్టుకునేందుకు ఆహార పానీయాలు స్వీకరించాలన్న కోరిక ఉండాలి. అది దైవసంభవమైనది. కేవలం జిహ్వచాపల్యం కోసం ఆహారపానేఅయల మీదకు మనస్సు పోనీయరాదు.
అధికముగా భుజించు వానికి, బొత్తిగా బుజింపని వానికి, అట్లే అధికముగ నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికి మేలు కలుగదు. అధికముగా భోజనం చేస్తే శరీరం మత్తుగా ఉంటుంది. నిద్ర ఆవహిస్తుంది. కడుపు బరువుగా ఉంటుంది. దేహ భావనను వదిలిపెట్టడం అసాధ్యమవుతుంది. అదే విధంగా పూర్తిగా ఆహారం మానేసిన పక్షంలో శరీరం బలహీనమై, క్షీణీంచిపోతుంది. అప్పుడు దేనిమీదా ఏకాగ్రత కుదరదు.
(ఇంకా ఉంది )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి