5, నవంబర్ 2020, గురువారం

పిలుపు

 *పిలుపు*


ఒక ఊరిలో ఒక వర్తకుడు వుండేవాడు. 

ఒక రోజున సత్సంగంలో--

"ప్రాణము పోయే సమయంలో భగవత్ చింతన చేస్తే మోక్షం కలుగుతుంది" అని చెప్పడం విని ఇలా ఆలోచించాడు.


"నా నలుగురి కుమారులకు దేవుని పేర్లు పెట్టుకుని వారిని పిలిచే అలవాటు చేసుకుంటాను. నాకు అంతిమ ఘడియలు వచ్చినపుడు నా కుమారులను ఎలాగూ పిలుస్తాను కదా! ఆ విధంగా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది."అని 


కాలం గడుస్తూ ఉన్నది. కుమారులందరూ పెద్దవారై తండ్రి చేస్తూన్న వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసారు. వర్తకునికి అంత్యకాలము ఆసన్నమైనది. ఇంక కొన్ని క్షణాల్లో ప్రాణము పోతుందని వర్తకుడు గ్రహించి వెంటనే ' ఒరేయ్ రామా!, ఒరేయ్ కృష్ణా!, నాయనా గోవిందా!, మాధవా! ' అని అందరిని పేరుపేరునా పిలవసాగాడు.


విషయం తెలిసి కుమారులందరూ

తండ్రి వద్దకు వడి వడిగా చేరుకు న్నారు. నలుగురూ ఒక్కసారిగా "నాన్నగారూ! ఎందుకు పిలిచారు? మీకెలా వున్నది?" అనడిగారు.నలుగురినీ తేరిపారచూసుకున్నాడు

అ వర్తకుడు. అతడికి అకస్మాత్తుగా తన దుకాణం గుర్తుకు వచ్చినది.


కుమారులను చూసి చిరాకు పడుతూ " పిలిస్తే మాత్రం మీరంతా కట్టకట్టుకుని వచ్చేయడమేనా? అక్కడ మన అంగడి ఏమైపోతుంది? " అని వ్యధ పడుతూ మరణించాడు. ఆఖరి క్షణంలో అతడి ధ్యాసంతా దుకాణం మీదకు పోయింది.


జీవితకాలమంతా దైవనామ స్మరణ చేయుట వలన, అభ్యాసము వలన అంత్యక్షణాల్లో భగవన్నామము పలుకగలమే గాని బలవంతముగా యుక్తులతో భగవన్నామము పలుకగలమని అనుకోవడం అవివేకము. మన శరీరము,మనస్సు, ఇంద్రియములు, బుద్ధి బాగా వున్నప్పుడే దైవచింతన చేయుట అలవాటు చేసుకోవాలి.


అందుకే ఆది శంకరాచార్యుల వారు తమ భజగోవిందం లో ఇలా అంటారు...


 భజగోవిందం భజగోవిందం

 గోవిందం భజమూఢమతే | 

 సంప్రాప్తే సన్నిహితే కాలే

 నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||


తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు. ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ వ్యాకరణమూ రక్షించదు.

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

కామెంట్‌లు లేవు: