ముముక్షువులు , సాధకులు భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి నిత్యమైన భగవత్ప్రాప్తికై పరితపించాలి . గురువుల అనుగ్రహం లేకుంటే ఎవ్వరుకూడా తత్వజ్ఞానప్రకాశాన్ని పొందలేరు . భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి వాసనాబద్ద జీవులను సంసారం నుండి విముక్తి పొందటానికి అనేక విధాలుగా సంరక్షిస్తున్నాడు . అయినా ఈ ప్రపంచంలో అనేకులు బద్ధులవుతున్నారు . వీరిని బంధాల నుండి తప్పించడానికై దయామయులైన మహర్షులు , గురువులు భగవదాజ్ఞను అనుసరించి ప్రపంచాన్ని ఉద్ధరించుటకై ప్రయత్నిస్తూనే ఉన్నారు .
ధర్మం నశించిపోతున్న సమయంలో భగవంతుడే స్వయంగా అవతరించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠచేస్తుంటాడు , రామకృష్ణాది అవతారాలు ఇందుకు నిదర్శనం .
వేదములకు ఆస్థానమైనటువంటి భరతభూమిలో విభిన్న మతములు తలెత్తి సన్తానధర్మాన్నే మట్టుమాపు పరిస్థితులు ఏర్పడినవి . మతమన్న నేమియో నెఱుఁగనివారు మతము పేరిట మారణహోమాలు జరుపిచుండిరి . వేద ధర్మాన్ని అవలంబిస్తూ విభిన్న పోకడలకు పోయి తమమతమే గొప్ప అని వాదోపవాదాలు దిగి సన్తానధర్మ నిజతత్వమునకు మచ్చలు ఏర్పడినది . ఆతరుణంలో నాస్తికులకు , పాషండులకు నాయకత్వమైనది .
అట్టి తరుణమున భారత దేశమున సంభవామి యుగేయుగే అన్నట్లు కైలాసవాసి అయిన పరమేశ్వరుడే సాక్షాత్తు ఆదిశంకరుచార్యుల రూపంలో కేరళ దేశంలో కాలడి అగ్రహారమందు శివగురు ఆర్యామ్బ పుణ్యదంపతులకు అవతరించారు .
బాల్యమునందే శంకరుల సర్వజ్ఞుడై ఉన్నాడు . అటుపిమ్మట గురువుల వద్ద విద్యను అభ్యసించి వేదవేదాంతశాస్త్రసారగ్రహీతయైనాడు . స్వార్ధరహితుడైన శ్రీ శంకరులు తానుపొందిన బ్రహ్మజ్ఞానమును ప్రజలకందించటానికి దేశం నలుమూలల ముమ్మార్లు పర్యటన చేసి సనాతనధర్మం యొక్క అసలు హృదయమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠిత చేసిన అగ్రగణ్యులు .
తన దిగ్విజయము చిరస్థాయిగా ఉండాలనిదలచి సనాతనధర్మ పరిరక్షణ కొరకు దేశం నందు నాలుగు దిక్కులలో నాలుగు వేదలకు ప్రతీకగా నాలుగు పీఠములను స్థాపన చేసి వీరి నలుగురు ప్రధాన శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు . వీటినే చతురామ్నాయ పీఠాలు అని వ్యవహరిస్తారు .
ఇవేకాకుండా బ్రహ్మసూత్రాలకు భాష్యం , వేదాంత భాష్యం , భగవద్గీత భాష్యం రచన చేశారు వీటినే ప్రస్తానత్రయం అంటారు . ఇవి బ్రహ్మజ్ఞానాన్ని సూచించే గ్రంధాలు . ఇవేకాకుండా వేదాంత తత్వాన్ని బోధించే అనేక ప్రకరణ గ్రంధాలు , స్తోత్ర రచన చేశారు .
అనేకచోట్ల శ్రీచక్ర స్థాపనలు , దేవాలయాల పునరుద్ధరణ , వేద సంరక్షణను చేసి చివరగా శిష్యులకు దర్శనమిచ్చి వేదాంతం బోధించి కేదారం నందు ఈశ్వరుని దర్శనం చేసుకుని తన అవతార పరిసమాప్తి చేశారు శంకరులు . వీరి జీవితం మనకు ఎంతో ఆదర్శప్రాయం , అందుకే వీరిని శంకరః శంకర సాక్షాత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .
ఆస్తికులందరు రోజుకు కనీసం ఒకటైన శంకరులు వారందించిన ఏదోఒక భాష్యగ్రంధం , ప్రకరణ గ్రంథం , దేవతాస్తోత్రాలు చదువుటకై ప్రతిజ్ఞచేసి బ్రహ్మజ్ఞానం తెలుసుకొనటకై ప్రయత్నంచేసి చేయాలని దీక్షపూనండి , అదే వారికి మనమందించే అచంచలమైన గురుసేవ , గురుభక్తి .
సర్వం
శ్రీ శారదాచంద్రమౌళీశ్వరార్పణ
మస్తు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి