17-09-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగ యోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - రాజసాహార మేదియో వివరించి చెప్పచున్నారు–
కట్వామ్ల* లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||
తాత్పర్యము:- చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు; (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును.
వ్యాఖ్య:- ఈ శ్లోకమున తెలుపబడిన ఆహాపదార్థములు రాజసములని పేర్కొనుట వలన అవి సర్వథా త్యాజ్యములే అయియున్నవి.
“దుఃఖశోకామయప్రదాః” - ఇచట దుఃఖమనగా భుజించినవెంటనే శరీరాదులకు గలుగు బాధయనియు, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు గలుగు క్లేశమనియు గ్రహించవలెను.
కొందఱు "ఉష్ణ” అను పదమునకు ముందున్న "అతి” యను విశేషణమును కట్వాది పదములకన్నిటికిని అన్వయించి అర్థము చెప్పిరి. కాని అట్లుచేయుట సమీచీనముగ కనబడుటలేదు. ఏలయనిన, అత్తఱి "అతికటుత్వము నిషిద్ధమని అల్పకటుత్వము గ్రాహ్యమని” అర్థమువచ్చును. అది అసమంజసమే యగును. (కొద్ది చేదుకూడ ఎవరును కోరరుగదా).
మఱియు "విదాహినః” అను పదమునకు ‘అతి’ చేర్చినచో, "అతివిదాహినః” అగును. అపుడు "వి" అను ఉపసర్గమీద మఱల ‘అతి' అను విశేషణమును జోడించుట అప్రస్తుతముగ నుండగలదు. (రెండును ఒకే అర్థమును సూచించును గావున).
రాజససుఖముయొక్క లక్షణము - ప్రారంభమున అమృతతుల్యముగనుండి తుదకు విషప్రాయముగ పరిణమించుటయే యని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోవుదురు - "విషయేన్ద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్, పరిణామే మిషమివ తత్సుఖం రాజసం స్మృతమ్" అని అట్లే ఈ రాజసాహారమున్ను ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును, కాని భుజించిన కొంతసేపటికి గొప్పదుఃఖమును, వ్యాకులత్వమును గలుగజేయును. నిత్యజీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుచునే యున్నారు. మఱియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించువారికి ధ్యానమున్ను సరిగా జరుగదు. చిత్తము వికారవంతమై, చంచలమైయుండును. అత్తఱి కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగానుండదు. జంతువులలోగూడ రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగుగొడ్డు, అతిచంచలములై క్రూరములై యుండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్త్వికచిత్తవృత్తి గలిగియుండును.
“ఆమయప్రదాః” - అని చెప్పుటవలన రాజసాహారము ఆరోగ్యమునుగూడ చెడగొట్టి వ్యాధులను గలుగజేయునని తెలియుచున్నది. కాబట్టి ఆరోగ్యభంగకరములును, దుఃఖ, శోకప్రదములును, ధ్యానప్రతిబంధకములునునగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువు లెన్నడును గ్రహించరాదు. అట్టియాహారముపై ఎపుడైన ఇష్టము గలిగినచో తనయందింకను రజోగుణము ఏ కోశమందునో గలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటకై యత్నించవలెను.
“దాః" అని చెప్పక “ప్రదాః” అని చెప్పుటవలన రోగాదుల నవి లెస్సగ గలుగజేయునని అర్థము.
ప్రశ్న:- రాజసాహార మెట్టిది?
ఉత్తరము:- (1) చేదు, పులుపు, ఉప్పు, కారము వీనితో గూడినది (2) మిక్కిలి వేడిగా నున్నది (3) చమురులేనిది (4) మిగుల దాహమును గలుగుజేయునది.
ప్రశ్న:- కావున ముముక్షు వేమి చేయవలెను?
ఉత్తరము:- ఆ యాహారమువలన కలుగు దుష్పరిణామమును మఱల మఱల భావించుచు దానిని త్యజించివేయవలెను.
~~~~~~~~~~~~~
* కట్వమ్లలవణాత్యుష్ణ - పాఠాన్తరము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి