**దశిక రాము**
||శ్రీమన్నారాయణీయము||
ప్రథమ స్కంధము
2వ దశకం - భగవద్రూపవర్ణన
2-1-శ్లో.
సూర్యస్పర్ధి కిరీట మూర్థ్వతిలక ప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్థ్రహసితోల్లాసం సునాసాపుటం।
గండోద్యన్మకరాభకుండల
యుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే||
భావము: శిరసున సూర్య కాంతి మించి కాంతివంతమైన కిరీటము కలవాడు, ఫాలభాగమున ప్రకాశించు తిలకము కలవాడు, కన్నులలో దయ, ఆర్ద్రత కలవాడు, చక్కని నాసికాపుటములు కలవాడు, మకరకుండలముల కాంతితో ప్రకాశించు కపోలములు కలవాడు, ధరహాసభాసుర వదనము కలవాడు, కంఠమున ఉజ్వలమైన కౌస్తుభమణి కలవాడు, వక్షస్థలమున ప్రకాశించు వనమాల, హారములు, శ్రీవత్సము కలవాడు అయిన ఆ శ్రీకృష్ణుని అర్చించెదను.
(telugubhagavatam.org)
వ్యాఖ్య - పోతనభాగవతం అష్టమ స్కంధం లో బ్రహ్మమొదలుగా దేవతలు శ్రీమహావిష్ణువును దర్శింప గోరినప్పుడు అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు.
అలా ప్రత్యక్షం అయిన మహావిష్ణువు రూపు వెయ్యి సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరి పోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్య చకితులు అయ్యారు. వారికి ప్రభువును చూడటం సాధ్యం కాదు కదా!
ఆ సమయంలో భగవంతుడు శ్రీహరి హారాలూ, కిరీటాలూ, భుజకూర్తులూ, కుండలాలూ, కాలి అందెలూ, మొలనూలూ, కంకణాలూ, కౌస్తుభరత్నమూ, కొమోదకీ గదా, శంఖమూ, చక్రమూ, విల్లూ ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేనూ, కాంతులీనే పద్మాల వంటి కళ్ళూ, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది.
ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడూ, శివుడూ, దేవతలూ సంతోషంతో పొంగిపోతూ దర్శించు కున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు.
జనన మరణాది లేనివాడవు, మహర్షులచే కీర్తింపబడు వాడవు, మోక్ష సౌఖ్యాన్ని సమృద్ధిగా అందించేవాడవు, సుగుణ మయుడవు, సూక్ష్మమైనవాని అన్నిటి కంటే బహు సూక్ష్మమవు, మిన్నలను అన్నింటిని మించిన మిన్నవు, పుణ్యాత్మవు అయిన నిన్ను స్తుతిస్తున్నాము.
ఓ పరమపురుషా! శ్రీమహావిష్ణూ! నీ రూపం సమస్తమైన భువనాలకూ శ్రేయోదాయకం అయినది. ఆ రూపం శాశ్వతమైన వేద మంత్రంతో కూడి మీ యందే మాకు కనబడుచున్నది.
అలాగే, ఈ సృష్టికి మొదలూ, మధ్యభాగమూ, అంతమూ నీలోనే ప్రకాశితమవు తున్నాయి. ఈ సృష్టి ఆది, మధ్య, అంతములు అను మూడు దశలకు కారణభూతం నీవే.
ప్రపంచాన్ని నీ మాయచేత అనేక మార్లు సృష్టించి, త్రిగుణాలతో కూడినవాడవై ప్రపంచమంతా నిండి వుంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ, గుణవంతుడవైన నిన్ను దర్శిస్తారు.
భూమిలో ఆహారాన్నీ, ఆవులలో పాలనూ, కర్రలలో అగ్నిని కనుగొనే విధంగానే ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధిద్వారా గుణరహితుడవైన నిన్ను ఈ విశ్వంలో దర్శిస్తారు.
మేము దిక్కులేని వారము అయ్యాము. అనేకరకాల కష్టాలతో కలత చెందిన మనసులు కలవారము అయి బాధపడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి అయిన వేడిమి ధాటికి తపించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్ళు కనుగొన్న విధంగా, చిట్టచివరికి నిన్ను దర్శించ గలిగాము. ఇక మా కోరికలు నెరవేరి తీరుతాయి.
శ్రీమన్నారాయణా! లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు. లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ పాదదర్శనం మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని స్పులింగాలవలె నేనూ, ఈ లోకపాలకులూ, దేవతలూ నీలోని అంశలమే” అంటూ విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగు దేవతా ప్రముఖులు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు” .
ఒకింత అదే భావం భట్టతిరి వారు ఈ శ్లోకంలో దర్శింపచేశారు. స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి