5, నవంబర్ 2020, గురువారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదమూడు, పధ్నాలుగు శ్లోకాల భాష్యం


13వ శ్లోకం: 


నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం

తవాపాఙ్గాలోకే పతిత మనుధావంతి శతశః

గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః

హఠాత్తృత్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః


(తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు కురూపియైనా, ముదుసలి అయినా, సరసమెరుగని వాడయినా, యువతులు మహా మోహముతో కొప్పులు వీడిపోవగా, పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు తెగిపోవగా, వలువలూడిపోవగా అతని వెంటపడతారు.)


(మహాస్వామి వారీ శ్లోకమునకు వ్యాఖ్యానము చేయలేదు.)


14వ శ్లోకం: 


క్షితౌ షత్పఞ్చాశ ద్ద్విసమధిక పఞ్చాశదుదకే

హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశదనిలే

దివి ద్విష్షట్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే

మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం.


(మూలాధారము పృథ్వీతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు యాభైయ్యారు. మణిపూరకము జలతాత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు డెబ్భైరెండు. స్వాధిష్టానము అగ్నితత్త్వాత్మకము. అందు కిరణములు అరవై రెండు. అనాహతము వాయుతత్త్వాత్మకము, అందు కిరణములు యాభైనాలుగు. విశుద్ధిచక్రము ఆకాశతత్త్వాత్మకము. అందలి మయూఖములు దెబ్భైరెండు. మనస్తత్త్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు అరవై నాలుగు. అమ్మా! నీ పదపద్మ యుగళము ఈ కాంతులన్నిటి పైన ఉన్నది.)


(యోగశాస్త్రములోనికి లోతుగా వెళ్ళనని ముందే చెప్పిన మహాస్వామివారు ఈ శ్లోకము పైన పూర్తి వ్యాఖ్యానము చేయలేదు. అయితే అంబికను కాలస్వరూపిణిగా ఒక విలక్షణమైన వ్యాఖ్యానము చేస్తున్నారు.)


ఈ శ్లోకంలో అంబిక కాలస్వరూపిణిగా అభివర్ణించబడింది. “క్షితౌ షత్పఞ్చాశద్ – ద్విసమధిక – పఞ్చాశదుదకే” సంవత్సరముకున్న 360 రోజులు ఆరు ఋతువులుగా ఉన్నాయి. కుండలిని నుండి బహిర్గతమవుతున్న 360 కిరణములుగా ఈ 360 రోజులు చెప్పబడినాయి. ఒక్కొక్క చక్రము ఒక ఋతువును చెప్పుతున్నది. ఆ ఋతువులో ఎన్ని దినాలుంటాయో ఆ చక్రమున ఉన్న కిరణములు సూచిస్తున్నాయి.


క్షితౌ షత్పఞ్చాశత్ – భూమికి ప్రాతినిధ్యం వహించే మూలాధార చక్రములో యాభై ఆరు దినములు వసంత ఋతువుగా ఉంతున్నది. ఆ రకంగా ప్రతిచక్రము దినములు దానికి సంబంధించిన ఋతువు ఈ శ్లోకమున చెప్పబడింది.


అంబిక తాను వివిధ ఋతువులలో కాలంగా కుంచించుకొని కాలంగా అభివ్యక్తీకరించుకొంటోంది. నిజానికి ఆమె కాలాతీతురాలు. కాలాతీత స్థితిలో ఆరు చక్రములకు ఉన్నతమైన సహస్రార చక్రంలో వసిస్తుంది. ఆమె పాదపద్మములు గురుపద పదమము వలె ప్రకాశిస్తాయి. “మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం” – మయూఖమంటే కాంతికిరణము. కాంతి కిరణరూపంలోని ఒక దినము. అంబిక 360 రోజులకు అతీతమైనది. “తేషామప్యుపరి” అంటే సహస్రార పద్మంలో “తవ పాదాంబుజయుగం” నీ పదపద్మము యుగము.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam


🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: