5, నవంబర్ 2020, గురువారం

మహాభారతము

**దశిక రాము**


**మహాభారతము** 


122 .... 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


విరాటపర్వం.


సుశర్మను యుద్ధంలో ఓడించి దక్షిణ దిక్కున వున్న గోవులను రక్షించి, విరాటరాజు, తనపరివారంతో, నగరం చేరుకున్నాడు. 


విరాటమహారాజును అందరూ పొగడ్తలతో ముంచెత్తి, ఆయనకు విజయఘోషలు చెప్పారు. కంకుభట్టు, మారువేషంలో వున్న మిగిలిన ముగ్గురు పాండవులు చేసిన సహాయం ఆయన మస్తిష్కంలో మరుగున పడింది. ఆనందంగా సంబరాలు జరుపుకుంటుండగా, విరాటునికి తనకుమారుడు, యువరాజు అయిన, ఉత్తరకుమారుడు యెంతకూ కనిపించకపోయేటప్పటికీ, అతని గురించి పక్కనవున్న పరివారాన్ని అడిగాడు. 


ఉత్తరదిక్కున దుర్యోధనాదులు గోగ్రహణానికి రావడమూ, బృహన్నల రథసారధిగా ఉత్తరకుమారుడు వారిపై యుద్ధానికి వెళ్ళడమూ తెలుసుకున్నాడు. అప్పటిదాకా వున్న విజయోత్సాహం ఆవిరి అయిపొయింది మహారాజుకు. నపుంసకుని సారధ్యంలో, సేన లేకుండా ఒంటరిగా యుద్ధానికి వెళ్లిన ఉత్తరుని తలుచుకుని కుమిలికుమిలి పుత్ర శోకంతో రోదించసాగాడు.  


కంకుభట్టు ఆయనకు ధైర్యంచెప్పి ఓదార్చే ప్రయత్నంచేసాడు. నిర్భయంగా వుండ మన్నాడు. బృహన్నల శక్తిసామర్ధ్యాలు, అర్జునుని చెలికానిగా అతడు నేర్చుకున్న విద్య, తనకు తెలుసు అని పదేపదే చెప్పాడు. అయినా విరాటుడు తృప్తిచెందక, మంత్రులను పిలిపించి, చతురంగబలాలతో ఉత్తరదిక్కుగా, యువరాజుకు బాసటగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. సైనికులు అలా ఉత్తరదిక్కుకు కదిలి వెళ్ళగానే, ఉత్తరుని విజయవార్తను మోసుకుని వచ్చి, దూతలు విరాటుని కలిసి, శుభవార్తను చెప్పి, ఆయన వద్ద దండిగా బహుమానాలు అందుకున్నారు. కుమారునివిజయవార్త విన్న విరాటుడు ఆనందంతో పొంగిపోయాడు.


విరాటుడు కంకుభట్టుతో, ' చూశావా కంకుభట్టూ ! పిల్లల పరాక్రమాలు, పెద్దలం మనం కనిబెట్టలేము. మనమందరమూ దక్షిణదిక్కుగా వెళ్లినా కూడా ధైర్యంగా యువరాజు, ఒక నపుంసకుని సారధిగా తీసుకునివెళ్లి, కురువీరులను యెదిరించి, మన గోవులను సురక్షితంగా వెనుకకు తీసుకువచ్చాడు. ' అని అమిత ఆనందంగా అన్నాడు.


దానికి సమాధానంగా కంకుభట్టు ' మహారాజా ! నేను ముందరే చెప్పాను కదా ! సారధిగా బృహన్నల వుండగా, మన ఉత్తరునికి అసాధ్యము యేదీలేదని. ' అన్నాడు. ఆమాటలకు ఒకింత అసంతృప్తితో విరాటరాజు తన ముఖంలో చిరాకు ప్రదర్శించి, అంత:పురం లోనికి వెళ్లి శుచీభూతుడయ్యాడు. ఉత్తరునికి స్వాగత సత్కారాలకై ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.


తిరిగి సభామండపంలో విరాటరాజు కొలువై, కంకుభట్టుతో ' భట్టూ ! నాకు మనసు చాలా ఆనందంగా వున్నది. మనం కొద్దిసేపు పాచికలు ఆడుకుందాము. సైరంధ్రీ ! నీవు వెళ్లి పాచికలు పట్టుకురా ! ' అని ఆదేశించాడు. కంకుభట్టు మనసు యెందుకో కీడు శంకించి, మహారాజా యెవరైనా ఆనందంలో వున్నప్పుడు, దుఃఖంలో వున్నప్పుడు జూద మాడరాదు. మేనుమరచి పందెములు కడుతూ సంపద కోల్పోతారు. ధర్మరాజు ఆ విధంగానే కదా రాజ్యం కోల్పోయి అడవుల పాలు అయింది.' అని పాచికలు ఆడకుండా వారించ ప్రయత్నించాడు.  


అయితే, విరాటరాజు పట్టుబట్టి, పాచికలు ఆడదానికి ఏర్పాట్లు చేయించాడు. ధర్మజుడు అయిష్టంగానే, విరాటునితో పాచికలు ఆడుతున్నాడు. ఆటలో కాలక్షేపకబుర్లలో భాగంగా, ఉత్సాహం పట్టలేక విరాటరాజు, మరియొకసారి, ' భట్టూ ! చూశావా మన ఉత్తరకుమారుని పరాక్రమం... ' అంటూ పొగడసాగాడు. ధర్మరాజు కూడా అదివరకు వలెనే, ' మహారాజా ! బృహన్నల వుండగా, ఉత్తరునికేమి లోటు ? ' అన్నాడు. ఈ సారి విరాటరాజు తట్టుకోలేక, అమిత కోపంతో , ' ఓయీ బుద్ధితక్కువ బ్రాహ్మణాధమా ! నేను రాకుమారుని పరాక్రమం ప్రస్తావించినప్పుడల్లా, నీవు ఆ పేడివానిని పొగుడుతూ యువరాజును కించపరుస్తున్నావు. ఎంతో ఓర్పుతో యిప్పటిదాకా నీ ప్రేలాపన సహించను. ఇక నాఓపిక నశించింది. ' అంటూ తనచేతిలోని పాచికలు, కంకుభట్టు ముఖంపై బలంగా విసిరాడు.  


ధర్మరాజుకు ముఖంపై బలమైన దెబ్బతగిలి, ముక్కునుండి రక్తం స్రవించింది. ఆ రక్తపు బొట్లు, నేలపై బడకుండా, ధర్మరాజు తన చేతిలోకి పట్టుకుని, ప్రక్కనే వున్న సైరంధ్రిని వైపు చూసాడు. ఆమె యే మాత్రం ఆలశ్యం చెయ్యకుండా, ఒక పాత్రను తెచ్చి, ఒక్క రక్తపు బొట్టుకూడా నేలపై బడకుండా, అందులో ధర్మజుని చేతిలోని రక్తాన్ని పోసి, ఆయన నాసికను శుభ్రంచేసింది.  


ఈలోగా ఉత్తరకుమారుడు, తాను బృహన్నలతో కలిసి వస్తున్నట్లుగా కబురుపంపాడు. ' ఆలశ్యమెందుకు ? ఇద్దరినీ రమ్మనండి. నాకు యువరాజును చూడాలని వున్నది. మధ్యలో యీబృహన్నల మాట యెందుకు ? ' అని అన్నాడు. ధర్మరాజు ఆ వచ్చిన సేవకుని ప్రక్కకు పిలిచి, ' ఒక్క యువరాజునే ప్రవేశపెట్టండి. బృహన్నలను బయట వేచి వుండమని చెప్పండి. ' అని చెప్పాడు.  


అలాగే, ఉత్తరకుమారుడు ఒక్కడే విరాటుని కలిశాడు. వస్తూనే, తండ్రికీ, కంకుభట్టుకు శిరస్సువంచి నమస్కరించాడు. కంకుభట్టు ముక్కుకు అయిన గాయము చూసి, యెవరు యీమహాత్ముని గాయపరిచిన దుర్మార్గుడు ? ' అని అడిగాడు. జరిగినది చెప్పి, విరాటరాజు, ఈతని వాచాలత్వమునకు సరి ఐన శిక్ష విధించాను. ఆవిషయం మర్చిపో. నీ యుద్ధవార్తలు చెప్పు. ' అని కుమారుని అడిగాడు. 


' అయ్యో ! జనకా ! యెంత పనిచేసారు. బ్రాహ్మణుని క్రోధం మన వంశాన్నే నాశనం చేస్తుంది. వారిని క్షమాపణ కోరండి. వారిని శాంతింప జేయండి. ' అని చెప్పి తానుకూడా తనతండ్రితో కలిసి తమపై అలుగవద్దని ప్రార్ధించాడు. దానికి ' ధర్మరాజు, ' నాకు మీ పై కోపంలేదు. నేనుక్షమాగుణాన్ని వ్రతంగా స్వీకరించినవాడిని. తమ కొలువులో చేరేటప్పుడే నాకుతెలుసు. నేను ప్రభువుల కోపానికి గురి ఐతే యెలా మసలుకోవాలో. అయితే, మీకు తెలియనిది ఒకటి వున్నది. నా నెత్తుటి బొట్టు భూమిపై బడితే, ఒక్కొక్క బొట్టుకూ ఒక్కొక్క సంవత్సరం నీ రాజ్యం అనావృష్టి పాలవుతుంది. అందుకే రక్తం క్రింద పడకుండా నేనూ, సైరంధ్రీ ప్రయత్నించాము. ' అని వినయంగా, శాంతంగా అన్నాడు ధర్మరాజు.


'సరే ఆ విషయం అక్కడితో పోనీ ! నీ విజయవార్తలు చెప్పు నాయనా ! ' అని మళ్ళీ ఉత్తరుడిని అడిగాడు. ఎంతో పొగిడాడు కుమారుని, పరాక్రమాన్ని. అప్పుడు ఆ పొగడ్తలు వినలేక, ఉత్తరకుమారుడు, ' తండ్రీ ! మీకు నేనొక విషయం చెప్పాలి. శత్రువులను జయించింది, గోవులను మళ్లించింది నేనుకాదు. అంతటి శక్తి నాకెక్కడిది ? నేను వెన్నుచూపి యుద్ధరంగం నుండి పరుగెడుతుంటే, ఒక తేజోపురుషుడు నాకు అండగా నిలచి నన్ను సారధిగా చేసుకుని, కౌరవవీరులను యెదిరించాడు. ' అని నిష్కల్మషంగా చెప్పాడు. ' ఆదివ్యపురుషుడు, తనంతట తానే మళ్ళీ వచ్చి దర్శన మిస్తానన్నాడు, ' అనికూడా చెప్పాడు.


అక్కడ, అంత:పురంలో, బృహన్నల, రాకుమారి ఉత్తరకు, తాము తెచ్చిన రంగురంగుల తలపాగా కుచ్చులను యిచ్చి ఆమెను సంతోషపెట్టాడు. బృహన్నలా, ధర్మరాజు, ఉత్తరుడి సమక్షంలో, తాము యెప్పుడు తమ నిజరూపాలు బయటపెట్టాలో నిర్ణయించుకున్నారు.


అనుకున్న విధంగా, మూడురోజుల తరువాత, ఒక శుభముహూర్తంలో, పంచపాండవులు, అభ్యంగన స్నానాలు ఆచరించి, సర్వాభరణ భూషితులై, ధర్మరాజు ముందు నడువగా, విరాటుడు జరుపబోయే యాగస్థలిలో ప్రవేశించి, అక్కడ రాజులకు యేర్పరచిన ఆసనాలపై కూర్చున్నారు.


ఇంతలో విరాటుడు యాగమంటపంలో ప్రవేశించి, వీరిని చూసి, ఆశ్చర్యపోయి, నాతో పాచికలాడుతూ కాలం గడిపేవాడివి, రాచమర్యాదలతో, రాజ ఆసనాలలో, వీరితో కూడి కూర్చున్నావు. కంకుభట్టూ ! ఏమి యీ విపరీత ధోరణి ? ' అని గట్టిగా అడిగాడు. చిరునవ్వుతో, అర్జునుడు లేచి విదురునికి సమాధానం చెబుతున్నాడు. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: