5, నవంబర్ 2020, గురువారం

తెల్ల నెమలి - వీణా వాద్యము

 తెల్ల నెమలి - వీణా వాద్యము 


జి.వి. సుబ్బరామయ్య 


బరోడా మహారాణి ఒక తెల్లని నెమలిని మహర్షి కి సమర్పించినది.  ఆ నెమలి రైలులో ఒక ప్రత్యేకమైన సెలూన్ లో ఒక రాణీ గారి బంటుతో ప్రయాణము చేసి రమణ ఆశ్రమము చేరుకున్నది.  ఆ నెమలి చాలా చిన్నది కానీ చాలా తెలివైనది మరియు చురుకైనది.  దానికి ఒక పంజరం మహర్షి సొఫా పక్కన ఏర్పరిచిరి.   భగవాన్ రాత్రి, పగలు దానిని గమనిస్తూ ఉండేవారు.    ఆ నెమలి భగవాన్ కి చాలా ఆప్తురాలు అయినది.


ఆ నెమలి భగవాన్ యెక్క పుస్తక అలమారా  తెరచి ముక్కుతో కొన్ని పుస్తకాలు పొడిచేది,  ఎదో చదువుతునట్టుగా.    అలాగే గుడి నిర్మాణ పనులు జరిగే చోటుకి వెళ్ళి కాసేపు అటు ఇటు ఆ పనులు జరిగే ప్రదేశము చుట్టూ తిరిగి వచ్చేది.    ఇది గమనించి భగవాన్ ఆ నెమలికి Building Supervisor అని  పేరు పెట్టారు.   అలాగే భోజనశాలలో ప్రవేశించి బోజనానికి కూర్చున్న భక్తుల వరుసల మధ్య తిరిగుతుండేది.   అప్పుడు భగవాన్ దానికి మరొక పేరు  ఇచ్చారు Assistant Sarvadhikari అని.


ఒక రొజు సుబ్బలక్ష్మమ్మ గారు భగవాన్ ఆ నెమలి పై చూపుతున్న ప్రేమ చూసి బహుశా ఇంతకు ముందు మహర్షికి ఆంతరంగిక  సేవకుడు అయిన మాధవ స్వామి ఇలా ఇప్పుడు నెమలి రూపముఁగా మళ్లీ పుట్టి ఉండవచ్చు అన్నది.     కొంతసేపటికి భగవాన్ హాలు లోకి   ప్రవేశించి కొంతమంది ఇక్కడ అనుకుంటున్నారు మాధవ స్వామినే  ఈ నెమలిగా మళ్ళీ పుట్టాడు అని అన్నారు.   అప్పటి నుంచి మహర్షి ఆ నెమలిని  'మాధవా' అని పిలవడము మొదలుపెట్టారు .


జూన్ 20, 1947   నేను (జి.వి. సుబ్బరామయ్య)  8 పద్యాలూ ఆ తెల్ల నెమలి పై రాశి మహర్షికి అందించాను. మహర్షి చాల సంతోషించి ఆ పద్యాలు శ్రీమతి లలిత వెంకట్రామన్  గారికి ఇచ్చి వీణ మీద వాయిస్తూ పాడమన్నారు.  ఆవిడ ఒక అర గంటలో వీణను తెప్పించుకొని పాడడమునకు సిద్ధ పడినది.   కానీ అప్పుడు అక్కడ ఆ నెమలి లేదు.   మహర్షి అన్నారు అయ్యో తన కీర్తిని గానము చేస్తుంటే వినడానికి ఆ హీరో లేడే ?  మాధవా ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అనేసరికి ఆ నెమలి వచ్చి వాలింది.   లలిత గారు పాడుతున్నంత సేపు ఆ నెమలి నాట్యము చేసింది.   ఆవిడ పాడడము అయిపోగానే ఆ నెమలి తన ముక్కుతో వీణ తీగలు మీట సాగింది.   మహర్షి అప్పుడు అన్నారు మళ్ళీ పాడమని మాధవ అడుగుతున్నాడు అని.   ఆవిడ మళ్ళీ పాడింది, ఆ నెమలి మళ్ళీ నాట్యము చేసింది. 


ఈ దృశ్యము సకల దేవతల కూడా చూడ వలసినది అని అందరు భక్తులు అనుకున్నారు.

కామెంట్‌లు లేవు: