దాశరథి - కవి'తాగ్నిధారా'
శరధి
తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి ఉద్యమించినకృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది.
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.
డా|| దాశరధి పేరు వినగానే ''నా తెలంగాణ కోటిరత్నాల వీణ'' అని గర్జించిన కలం - కాదు గళం గుర్తుకు వస్తుంది - ఎవరికైనా. ఆనాటి నిజాం రాజును ''జన్మజన్మాల బూజు'' అంటూ కురిపించిన కవి''తాగ్నిధార'' స్ఫురిస్తుంది. ఏ చదువరికైనా. ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న కాలంలో కలిగిన కష్టాల ''తిమిరం''తో చేసిన ''సమర'' యోధునిగా కనిపిస్తారాయన - సాహితీవేత్తలకు. ఆయన మ్రోగించిన ''రుద్రవీణా'' స్వరాలు తిరోగమన వాదులకు విడువని జ్వరాలు. ఉర్దూ సాహిత్యంలోని రుబాయీలను, గజల్స్‌ను తెలుగులోనికి తెచ్చిన ఆదికవి దాశరథియే. ''ఏను స్వయముగా కవితన్ వరించలేదు! తానె వరియించె కైతలరాణినన్ను'' అని విలక్షణంగా చెప్పుకున్న దాశరథి - ''ఎంత తియ్యని పెదవులే ఇంతి! నీవి; తిట్టుచున్నప్పుడుంగూడ తీపికురియు''ని విశిష్టంగా భావ వ్యక్తీకరణ చేశారు. ఆయన తెలుగుగాలిబు. తాత్త్విక చింతన కు ఆయన ''గాలిబ్ గీతాలు'' నిజంగా ఒక ''కవితా పుష్పకమే'' అన్నట్లు ''కవితా పుష్పకం'' అన్న పేరుతో ఆయన ఒక కవితా సంపుటిని కూడా సమకూర్చారు. ఇంతకూ-రాజకీయాలకు అతీత మైన సర్వమానవ సౌభ్రాత్రం ఆయన కవిత్వ సిద్ధాంతం. దమననీతిని-అది ఏరూపంలో ఉన్నా - ఎదిరించడం, కవిత్వానికి ప్రయోజనం ఉందని నిరూపించడం, కళామూల్యాలను వదులు కోకపోవడం - అన్నది తన కమిట్‌మెంట్ అని - ఆచార్య తిరుమల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ''ఆధునిక కవిత- అభిప్రాయ వేదిక'' అన్న గ్రంథంలో పేర్కొన్నారు - దాశరథి.
''ఎవ్వడు గట్టిగా అరచు, నెవ్వడు మోసము చేయజాలు - నింకెవ్వడు కాళ్ళు పట్టుకొనియే క్షణమాత్ర గ్రహించు జుట్టు - వాడివ్వ సుధాస్థలిన్ గణుతికెక్కు ధురంధరుడంచు - వానికిన్ తవ్వల కొద్ది రవ్వలట - దాశరథీ! కరుణాపయోనిధీ!''. ఇత్యాదిగా అనేక పద్యాల్లో నేటి సంఘ స్వరూప స్వభావాలను కళాత్మకంగా బద్దలుకొట్టి మరీ చెప్పడంతో పాటు ఈ దాశరథి ఆ దాశరథికి కర్తవ్యాన్ని ప్రబోధించిన ''అభినవ దాశరథీ శతకం'' తెలుగు శతక ప్రపంచంలో నిజంగా మాసిపోని (నిప్పు) రవ్వల శతకం.
''తలనిండ పూదండ దాల్చిన రాణి...'', ''నడిరేయి ఏ జాములో స్వామి నిను చేరదిగి వచ్చెనో.... ''ఇత్యాదిగా వాణి వీణ వాయించి నట్లుగా ఎన్నెన్నో సినిమా పాటలను పలికినా, పెట్రోలుబాంబులా పద్యాన్ని మ్రోగించినా - దాశరధి నిజంగా నాటికీ, నేటికీ, ఏనాటికైనా సర్వాంధ్ర హృదయాస్థాన కవియే. ''ఉద్యమ స్ఫూర్తితో కవిత రాసిన ఆవేశకవి దాశరథి'' అని కుందుర్తి, ''మనోహర పద్యకవితా శిల్పి, పద్యశిల్ప మయ బ్రహ్మ'' అని గుంటూరు శేషేంద్రశర్మ దాశరధిని గూర్చి తమ అభిప్రాయాలను వ్యక్తీకరిం చారు. అసలు - ఆయన ప్రతిపదమూ పఠితల మనస్సులకు ఒక ''ఆలోచనాలోచనమే''.
ఒకప్పుడు తెలంగాణా జంటకవులుగా పేరు పొందిన వారు-దాశరధి -డా|| సి.నారా యణరెడ్డి.
''దాశరథీ! మనోజ్ఞ కవితాశరధీ! శరదిందు చంద్రికా పేశల కావ్యఖండముల పిండిన నీ కలమందునన్ మహోగ్రాశని పాతముల్ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధా రాశితరంగముల్ కటు హలాహలకీలలు పొంగినట్లుగన్'' అని సి.నా.రె. దాశరథి కవిత్వానికి గొప్ప పోలిక చెప్పారు. ఇది ఎవ్వరూ కాదనరాని పోలిక. ''మహాంధ్రోదయా''న్ని దర్శించిన దాశరధిని ''కమనీయ కోమల మహోదయు''నిగా ఉత్పల సత్యనారాయణాచార్యులు సంభావిం చారు. ఆయనవి ''మాధ్వీకఝరీధురీణ పదవీథుల'' న్నారు. ''దాశరథి బోలుకవియొక దాశరథే...'' అనీ, ''దాశరథి కవిత విప్లవ కోశమె...'' అని డా|| తిరుమల శ్రీనివాసాచార్య పేర్కొన్నారు.
దాశరథి మరణించినపుడు మల్లెమాల అక్షర పద్య నివాళిని సమర్పిస్తూ ''తాను రూపాన వామనుడైననేమి? విశ్వమానవ కవిగ త్రివిక్ర ముండు'' అన్నాడు. ఇది - కవితకు ''అమృతాభి షేకం'' చేసిన దాశరథి వ్యక్తిత్వానికి పట్టిన అక్షర దర్పణం. దాశరథి మరణానంతరం డా|| అక్కిరాజు సుందర రామకృష్ణ 165 పద్యాలతో ''కవితాశరథి దాశరథి'' అన్న పేరుతో సూటిగా, తుపాకీ ధాటిగా ఒక పద్య కావ్యాన్నే రచించి, ఉత్పల సత్యనారాయణాచార్యులు, డా|| తిరుమల శ్రీనివాసా చార్యలకు అంకితం చేశారు. ఇది 2003 జనవరిలో రచింపబడింది. సంఘంలోని కుల మతాచారాల్ని తూర్పారపట్టిన జాషువా వంటి వాడు దాశరథి అనీ, కవిత్వంలో పేద ధనికుల భేదాలను చెప్పడంలో రెడ్డి వేమన కూడా దాశరథి ముందు చాలడనీ అంటూ దాశరథిపై తమకున్న అత్యంతాభిమానాన్ని అక్షరాక్షరంలోనూ వ్యక్తీ కరిస్తూ, ''ధరణి నీ సాహసపుగాథలను విన్న పేడివానికి సైతంబువేడిపుట్టునని''అన్నారు- అక్కి రాజు వారు. ఇది మాత్రం అక్షరాలా నిజం.
వీరి రచన "తిమిరంతో సమరం" కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
1987 నవంబర్ 5 న దాశరథి తుది శ్వాస విడిచారు.
సేకరణ:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి