1, ఆగస్టు 2020, శనివారం

నేడు ఉద్ధాం సింగ్ బలిదాన దినం

13-4-1919 నాటి సాయంత్రం జలియన్వాలా బాగ్ లో ఒక 14 సం. పిల్లవాడు, బ్రిటీష్ తూటాలకు బలై మరణించిన శవాలగుట్టలనుంచి ఒక్కొక్క శవాన్నీ బలం ఉపయోగించి లాగి పక్కకు పెట్టి బయటకు పంపడానికి సహకరిస్తున్నాడు.
వైశాఖీ పర్వదినాన బ్రిటీష్ దుర్మార్గపాలనకు నిరసనగా, అక్కడ సమావేశమైన షుమారు 20,000 మందిపైన 18-20 నిమిషాలపాటు నిరాటంకంగా తుపాకీగుండ్లవర్షం కురిపించాడు దుర్మార్గుడు జనరల్ డయ్యర్.

తూటాలకు బలైనవారు 2000 మందికి పైగా ఉంటారు. తప్పించుకోనిపోవటానికి వీలులేక గోడ నుంచి కిందపడి కొందరు, అక్కడ ఉన్న బావిలోకి దూకి కొందరు, తొక్కిసలాటలో కొందరు వెరసి మరో వేయిమందికి పైగా అసువులుబాశారు. చావగా మిగిలిన క్షతగాతృలను రోడ్లవెంట మోచేతులపైన నడిపించి, రహదారులను రక్తరంజితం చేసిన రాక్షసుడు డయ్యర్.

దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలచిన ఆ 14 స. సిమ్హకిషోరమే ఉద్ధాం సింగ్. ఆ యువకుని హృదయంలో ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లింది. డయ్యర్ ను మట్టి కరిపించటమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు.

మెట్రిక్యులేషన్ చేశాడు. వడ్రంగిగా పనిచేశాడు. అప్పటికి డయ్యర్ లండన్ కి వెనితిరిగివెళ్ళాడు. ఉద్ధాం సింగ్ తాను సంపాదించిన డబ్బుతో లండన్ చేరాడు. డయ్యర్ ను కాల్చి చంపటం కోసం పిస్తోలు కొనటానికి అక్కడి హోటల్ లో పనిచేశాడు. డయ్యర్ ఇంటి చిరునామాను సంపాదించాడు. పిస్తోలుతో అతనిని ఇంటిలో చంపటానికి ఇష్టపడలేదు ఉద్ధాం సింగ్. అతనిని బహిరంగంగానే చంపటానికి పధకం రచించాడు.

1940 మార్చి 30 న లండన్ లో వాక్స్ టౌన్ హాల్ లో ఆప్ఘనిస్తాన్ కు సంబంధించిన ఒక ఉత్సవం జరిగింది. దానికి భారత్ ఉండి వచ్చిన ఆంగ్లపాలకులు లార్డ్ లామింగ్టన్, లార్డ్ జెక్లండర్, సర్టాయ్ గవర్నర్ లతో పాటు మైఖేల్ డయ్యర్ లు వక్తలుగా ఆహ్వానించబడ్డారు. దానికి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఆహ్వానించబడ్డారు.

ఉద్ధాం సింగ్ దానికి లాయర్ వేషంలో బయలుదేరివెళ్ళాడు. న్యాయశాస్త్రగ్రంధంలోని పేజీలను తొలగించి అందులో పిస్తోలు ఉంచుకోని మీటింగ్ లోకి ప్రవేసించాడు.  వేదికపైనున్న వక్తలు తామెలా భారతీయులను అణగద్రొక్కినదీ వివరించారు. బిరుదులతో సత్కారాలు అందుకున్నారు. డయ్యర్ వంతువచ్చింది.

క్రింద కూర్చున్న ఉద్ధాం సింగ్ ఒక్కసారిగా లేళ్ళ గుంపు మీదకురికిన సింహం లాగా డయ్యర్ ముందుకురికి పిస్తోలుతో సూటిగా గుండెల్లోకి కాల్చి అంతమొందించాడు. నిశ్చేష్టులై, వణుకుతున్న వారిమధ్య ధీరుడుగా నిలచాడు. జలియన్ వాలాబాగ్ అమరుల ఆత్మలకు రక్త తర్పణ లర్పించిన ఉద్ధాం సింగ్ ప్రసన్నవదనంతో అక్కడి బ్రిటీష్ పోలీస్ కి స్వయంగా లొంగిపోయాడు.

తనను న్యాయస్థానానికి తీసుకెళ్ళినప్పుడు న్యాయమూర్తి, ఉద్ధాం సింగ్ ను ప్రశ్నించాడు. డైయ్యరు చంపిన తరువాత నువ్వు కావాలంటే తప్పించుకుపోవచ్చు. అయినా నువ్వు అందుకు ప్రయత్నించకపోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు  ఉద్ధాం సింగ్ ఇలా అన్నాడు. “నేను పారిపోవడమంటే తెలియని వీరుడుని, భారతదేశంలో మేము తూటాలకు ఛాతీ చూపించి ఎదుర్కుంటామేగానీ వెనుతిరిగి పారిపోతూ తూటాలకు బలికావడం మా చరిత్రలో లేదు, నేను పుట్టిన పుణ్యభూమిలో వెన్ను చూపి పారిపోవడం అన్నది తెలియదు. పిరికిపందలే అలా చేస్తారు" అన్నాడు.

న్యాయమూర్తి మరొక మాట అన్నాడు.  "ఉద్ధాం సింగ్ నీవు పారిపోయి భారతదేశానికి చేరుకుంటే నీవంటి వారిని ఎంతో మందిని తయారుచేయగలిగే వాడివికదా"అని.
ఈ మాటలకు  ఉద్ధాం సింగ్ మీరు అందుకు చింతించనవసరం లేదు. మీరు ఏ రోజైతే నన్ను ఉరికంభం ఎక్కిస్తారో అదే రోజు భారతదేశంలో కొన్ని వేల మంది  ఉద్ధాం సింగ్లు పుట్టుకొస్తారు. అందుకే నేను పారిపోను. నేను పిరికివాడిని కాను నేను మీదేశంలో ఉరికంబం ఎక్కుతాను. ఆనందంగా ఉరికంబం ఎక్కుతాను. ఎందుకంటే నా జీవితంలో వెనుక వున్న ఏకైక లక్ష్యం నెరవేరింది.

జూలై 31, 1940 న చిరునవ్వుతో ఉరికంబమెక్కాడు ఉద్ధాం సింగ్.
అటువంటి పిరికి కండలేని ఉద్ధాంసింగ్ వంటి ఉద్యమవీరునికి జన్మభూమి అయిన భరతభూమ కృతజ్ఞతతో పులకరించిపోయింది.
************************

కామెంట్‌లు లేవు: