విశ్వకల్యాణానికి, ఇష్టకామ్యాలు నెరవేర్చుకునేందుకు ఎందరో హోమాలు చేస్తారు. ఇవి ఆధ్యాత్మికంగా తృప్తిని ఇస్తాయి. వైజ్ఞానికంగా ఆరోగ్యాన్ని ప్రసాదించి వాతావరణంలోని కాలుష్యాలను నిర్మూలిస్తాయి.
ప్రశస్తమైన ఇటుకలు, శ్రేష్టమైన మట్టితో వృత్తాకారం, చతురం, త్రిభుజాకారాల్లో హోమగుండం నిర్మిస్తారు. హోమగుండాల నిర్మాణ ప్రక్రియ శాస్త్రబద్ధంగా ప్రత్యేక కొలతలతో ఉంటుంది. హోమ వేదికను శ్రద్ధగా అలంకరిస్తారు. ఆయా క్రతు నిర్వహణలదృష్ట్యా హోమగుండాలు తొమ్మిది, పద్దెనిమిది, ఇరవైఏడు, యాభై నాలుగు, నూటా ఎనిమిది... ఇంకా అధికంగానూ ఉంటాయి. ఈ నిర్మాణ ప్రక్రియలను మహాభారత యుద్ధంలోని వ్యూహనిర్మాణాలతో పోలుస్తారు. గణపతి, రుద్ర, చండీ, నవగ్రహహోమాలు ఇలా ఎన్నో దేవీదేవతల ప్రీత్యర్థం... వారి పేర్లతో జరుగుతుంటాయి.
అగ్నిని దైవంగా భావిస్తారు. దేవతలు అగ్నిముఖులని వేదం చెబుతుంది.
హోమగుండంలో సమిధలుగా రావి, మర్రి, చండ్ర, మేడి, జువ్వి వంటి వృక్షజాతుల కలపను, పుల్లలను వాడతారు. ఈ వృక్ష జాతుల్లో ఔషధీయ గుణాలు ఉన్నాయి. ఈ సమిధలను జ్వలింపజేసేందుకు అగ్ని మధనం జరుగుతుంది. శ్రేష్టమైన చేవ కలిగిన చండ్రకర్రముక్కల రాపిడితో అగ్ని సూక్తాన్ని పఠిస్తూ నిప్పును పుట్టించి, హోమాగ్నిని జ్వలింపజేస్తారు. దీన్ని ‘అరణి’ అంటారు. హోమగుండంలో ద్రవ్యాలను స్వాహా, స్వధా అన్న మంత్రస్వరాలతో అగ్ని సమర్పణగా వేస్తారు. ఈ ఆహుతులను మృగ ముద్రతో వేస్తారు. అంటే బొటనవేలు మధ్యవేలు, ఉంగరపు వేళ్లను ఒకటిగా చేసి హోమద్రవ్యాలను గుండంలో వేస్తారు.
పాయసం, పాలు, పెరుగు, చెరకు, అటుకులు, మారేడుకాయలు, ఆకులు, పూలు, నవధాన్యాలు, జిల్లేడు, తేనె, బియ్యం వంటి వాటిని హోమద్రవ్యాలుగా ఉపయోగిస్తారు.
ఆవు నెయ్యిని ప్రధానంగా స్రుక్, స్రువాలతో హోమగుండంలో వేస్తారు. స్రుక్ స్రువాలంటే చండ్రచెక్కతో చేసిన మూరెడు పొడవున్న గరిటెలు. ఆవు నెయ్యికి విషతుల్యమైన పదార్థాలను తొలగించే స్వభావం ఉంది. హోమధూమం మొక్కల్లో పత్రహరితాన్ని అధికం చేస్తుందని, పోషకవిలువలు అందిస్తుందని వేదవాఙ్మయ పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. ఆ ధూమంతో విషకీటకాలు, పురుగులు నశించి వాతావరణ శుద్ధి జరుగుతుంది.
హోమద్రవ్యాల్లోని మూలికల శక్తివల్ల వ్యాధుల ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. హోమంలో చివరి ఘట్టం పూర్ణాహుతి.
మన శక్తిసామర్థ్యాలు పరిమితమై ఉంటాయి. కానీ మనలో అంతర్గతంగా ఉండే ‘ఆత్మశక్తి’ అపరిమితంగా ఉంటుంది. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా, మనకు ఆధారంగా, సమీపంలోనే సహాయకారిగా ఒక అనంతశక్తి ఉందన్న విశ్వాసాన్ని అంతరంగం మనకు ఎరుక చేస్తూనే ఉంటుంది. దీన్ని సాధనా మార్గంలోకి తెచ్చుకునేందుకు హోమం ఒక దివ్యమైన ఉపకరణం.
మానవ జన్మకు మూలాధారం అగ్ని. అదే ప్రాణాధారం. ‘అగ్నిదేవా! హోమ సమయాల్లో మాచే ఆహ్వానం పొంది, హవిస్సులు స్వీకరించి మమ్ములను ఆనందింపజేస్తున్నావు. ఎంతో పవిత్రతను కల్పిస్తున్నావు. మాకు జ్ఞానాన్ని ప్రసాదించు చెడు నుంచి రక్షించు’ అంటుంది దుర్గాసూక్తమ్.
‘సమిధలు, హోమద్రవ్యాలు సమర్పిస్తున్నాను. ఇవి నా ఆత్మ సమర్పణగా స్వీకరించు. నాలో కాలుష్యాలను తొలగించు. సత్యప్రకాశాన్ని ప్రతిష్ఠాపన చేయి!’ అంటుంది మహానారాయణోపనిషత్తు.
మనిషి నిత్యాగ్నిహోత్రుడై భాసించాలి. అంతరంగ శుద్ధితో దైవస్వరూపుడిగా వెలుగొందాలి.
**********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి