1, ఆగస్టు 2020, శనివారం

దైవభక్తి భక్తి

ఓం నమో నారాయణాయ

ఎక్కడో పుట్టిన ఒక విషక్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చూస్తుంటే మానవాళిని మహామృత్యువు తరుముకొస్తోందా అన్నట్లు ఉందీ సమస్య. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇప్పుడు అందరూ జపించవలసిన మంత్రం
"ఓం నమో నారాయణాయ"

అధికసంఖ్యలో జనులు భక్తితో దైవాన్ని వేడుకుంటే మేలు కలుగుతుంది. ఇంట్లో ఉంటూనే మనమంతా ఎంత ఎక్కువగా జపిస్తే, నష్టాన్ని అంతగా నివారించవచ్చు. శేషశయనుడు, గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణుడు ఈ సమయంలో ఈ విషక్రిమి బాధను నివారించగలడు, కష్టం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించగలడు.

చాలామంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అందులో సాక్షాత్తు భగవానుడే ఒక మాట చెప్పాడు.
ఆర్థావిషణ్ణా శ్శిధిలాశ్చ భీతా: ఘోరేషుచ వ్యాధిషు వర్త మానా:
సంకీర్త్య నారాయణ శబ్ధమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు
ఆందోళనతో ఉన్నా, దుఃఖితుడైనా, పూర్తిగా పతనమైనా, భయపడుతున్నా, ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నా, చెడు సమయం నడుస్తున్నా"నారాయణ నారాయణ " అనే సంకీర్తన చేతనే అతడు దుఃఖం నుంచి విముక్తుడై సుఖం పొందుతాడు. ఇది సాక్షాత్తు పరమాత్మ చెప్పిన మాట. నారాయణుడు స్థితి కర్త. లోకరక్షణ ఆయన బాధ్యత. ఇప్పుడు పరిస్థితులను అనుసరించి 'నారాయణ' మంత్ర జపం నష్టాన్ని నివారిస్తుంది. ఈ సమయంలో ఏ మంత్రాలు ఉపదేశం లేనివాళ్ళంతా 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రం ఎంత వీలైతే ఎంత జపించవచ్చు.

భగవానుడే స్వయంగా చెప్పిన "ఓం నమో నారాయణాయ" అనే మంత్ర జపం సర్వోత్తమం. ప్రత్యేక కాలం లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో జపిస్తూనే చేస్తూనే ఉండండి. పరిస్థితులు చక్కబడాలి, అందరూ రక్షించబడాలి, అకాలమృత్యువు తొలగాలని సంకల్పించండి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దీనికి ఉపదేశం కూడా అవసరంలేదు. అందరూ 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రం చేయవచ్చు. కావల్సింది భక్తి, దాంతో పాటు లోకానికి మేలు జరగాలనే తలంపు. లోకంలో మనం కూడా ఒక భాగం. కేవలం మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి, అప్పుడే మనమూ బాగుంటాము.

ప్రహ్లాదుడు చెబుతాడు -
పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!!

- త్రాగుతూ, తింటూ, మాట్లాడుతూ, పరిహస్తూ, నిద్రిస్తున్నా లేదా నిద్రకు ఉపక్రమిస్తూ, తిరుగుతూ, ఎల్లప్పుడూ ఆ శ్రీ మన్నారాయణుని పాదాల మీదనే మనస్సు నిలిపి, ఆయన స్మరణ చేయవచ్చని చెప్పారు. కనుక సమయం సరిపోదని చెప్పకండి, మౌనంగా ఈ మంత్రజపం చేయండి.

ఓం నమో నారాయణాయ

కామెంట్‌లు లేవు: