1, ఆగస్టు 2020, శనివారం

సంతోషం ఏ సంతలో దొరుకుతుంది?

నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో   చాలా  రోజులపాటు తెగ తిరిగాడు. 

చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు.

 ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు.

 నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది.

తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. 

ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు.

కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన.

‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.

పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ... వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.

‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన.

ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.

 ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. 

అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. 

ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.

‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు.

‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.

ఏమి జరిగినా మన మంచి కే అని అనుకోవడము అలవాటు చేసుకోవాలి.అప్పుడే హాయిగా, సుఖంగా వుండగలవు, లేదంటే బాధ, వ్యధల తో జీవితం ముగిసిపోతుంది.

ఇందుకు చిన్న ఉదాహరణ చెపుతాను విను.

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.

అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.

ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. 

తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.......
తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  

తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. 

అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. 

ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.

రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తేలుసు.
సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.

ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.

తెల్లవారే వరకు నిద్ర పోవాలి అలాగే కష్టాలు తీరే వరకు భగవాన్ నామస్మరణ చేయాలి
***********************

కామెంట్‌లు లేవు: