అశ్వినీ దేవతలు..!!ఎవరు?విశిష్ఠతలు ఏమిటి?
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు..
వీరు కవలలు.
వీరిసోదరి ఉష.
ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.
ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి
తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.
వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం.
అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.
ఆ రథం చాలా బృహత్తరమైనది.
అది హిరణ్యంతో నిర్మించబడింది.
ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి.
చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే.
సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.
ఆరథంలో ఓకవైపు ధనం
మరొకవైపు తేనె, సోమరసం
మరొకవైపు ఆయుధాలు ఉంటాయి.
రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.
అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది.
ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు.
ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు.
వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.
వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది.
వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది.
వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి.
ఈ దేవతలు దయార్ధ హృదయులు,
ధర్మపరులు మరియు సత్యసంధులు.
వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.
వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన.
వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు
కుడిచేతిలో అభయముద్ర
ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం
కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు
ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ
కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది.
ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు....
హవిర్భాగం పొందుట.
అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు.
వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది.
సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది.
అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు. బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు..
ఋగ్వేదం.
అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి.
కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను.
మిథున రాశి లోని కేస్టర్, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి.
అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు,
అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా,
ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి
ప్రజాసేవ చేయుచుండునట్లు ఋగ్వేదమున ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది.
వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.
శయుడను ఋషియొక్క గోవుఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినట్లు సాయపడిరి.
రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి.
ఇట్లే తుభ్యుడు, అంతకుడు అను వారలను గూడ రక్షించిరి.
పరావృజుడను ఋషికి కాళ్ళు పోగా నూతనముగ నిర్మించిరి.
ౠజాశ్వుడను వానికి అంధత్వమురాగా,
నాతని కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసిరి.
ఖేలుని భార్యయగు విశ్వలాయువతికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా,
లోహపు కాళ్ళు ఏర్పరిచిరి.
కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చి పేరొందిరి.
అత్రి ఋషిని రక్కసులు గొంపోయి యొక యంత్రగృహమున బడవేసి వేధించుచుండగా,
ఆతనిని చెరనుండి విడిపించిరి.
శయుడు, శర్యుడు, శర్యాతుడను వారలకు కావలసిన సాయములిచ్చిరి.
విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని రక్షించిరి.
అనగా వీరందరికిని వైద్యము చేసిరి అనుటయే.
ఇందులో భుజ్యుడు సముద్రమున ఓడలో నుండి మునిగిపోవుచున్న పుడు వీరు కాపాడిరట.
చ్యరనుకి నూత్న యవ్వనము వచ్చునట్లు చేసిరట.
కక్షివంతు డనువాని కూతురు ఘోషకు కుష్టురోగమును కుదుర్చిరి.
వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసిరి.
కణ్వఋషి కన్నులు కానరాక ఉండగా బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసిరి.
వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.
ఈ దృష్టాంతములను బట్టి అశ్వినిలు శరీరధారులైన పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము.
కాని ఈ కార్యములు మొదట అశ్వినిలిరువురే చేసిరని అనజాలము.
వారి సంతతి వారందరును కొన్నాళ్ళవరకు అశ్వినులనియే పిలువబడినట్లు గ్రహించినచో కాల వ్యత్యాసము లేకుండపోవును.
ఎందువలన అనగా, పైన పేర్కొనిన వారందరును ఒకేకాలపు మానవులనుటకు వీలులేదు.
ఈ అశ్వనిలు మొదట కంచర గాడిదలపై ఎక్కి తిరుగుచుండిరట.
తరువాత ఋభువు లను వడ్రంగులు వీరికొక రథమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రథమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, మొసళ్ళు, కట్టినట్లు కొన్ని ఋక్కులలో ఉంది.
సముద్రముపై ప్రయాణముచేసి తర్వాత రథమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో ఉంది.
అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి..!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి