**శ్రీఅనంతపద్మనాభస్వామి** దేవాలయం ,కేరళ.🙏
అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.
చరిత్ర:
ట్రావంకోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం).
క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం).
ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
అనంత సంపద:
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు.
స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదవెలుగుచూసింది.
ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.
వైష్ణవ దివ్యదేశం:
శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||
విశేషం: ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.
శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు కీర్తించిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వెళ్ళాడు.
"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో ఉండేవాడు. ఆకారణమున యోగరహస్యము వారికి లభించ లేదు. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని ఆళవందార్లు భావించారట.
ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషములు పెక్కులు గలవు.ఇచటికి సమీపమునగల "యానైమలై", అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి