4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఆవిడలు


భార్యను ఉదహరించినప్పుడు, 'మా' ఆవిడ అని ఎందుకంటారో ఇంతవరకు నాకు అంతుపట్టడంలేదు. 'మా పెళ్ళాం ' 'మా భార్య' లేక 'మా ధర్మపత్ని' అనే పదాల కూర్పు ఏ కవీ చేయలేదు . (ఫాండవులు మాత్రం ద్రౌపది విషయంలో అలా అనే వారేమో తెలియదు). ఈ 'మా ఆవిడ ' అన్న ప్రయోగానికి నాంది ఎక్కడనించి వచ్చిందో అనూహ్యం. 'ఆవిడ ' అనగానే ముందు 'మా' చేరడం అనివార్యం. 'ఒరే, ఏరా' అనే స్నేహితులు కూడా, భార్య విషయానికి వచ్చేసరికి, ఆ మిత్రుడికి ఎప్పుడూలేని గౌరవం ఇచ్చి, 'మీ ఆవిడ ఎలా ఉంది?' అంటారు. ఒకటే సంతోషింపదగ్గ విషయం- 'మా ఆవిడ' బదులు, 'మన ఆవిడ ' అనే ప్రయోగం చేయలేదు! అలాగే, ఇంట్లో ఏక భార్య తప్ప వేరే ఆడవారెవరూ లేకపోయినా, మా ఆడాళ్ళు, అనే బహువచన ప్రయోగం కూడా కద్దు. అటువంటి గౌరవ సంబోధనకి భార్య అర్హురాలే అనిపిస్తుంది. ఎందుకంటే, పెళ్ళి అవగానే ఆవిడకి ఎక్కడలేని కొమ్ములూ మొలుచుకొస్తాయి. ఇంటిలో సర్వాధికారాలూ సంక్రమిస్తాయి. ఆమె అడుగుజాడలలోనే భర్త నడుచుకోవాల్సి వస్తుంది. అదే ఆవిడ, ఇంటి బయట కొచ్చినప్పుడు మాత్రం అతి విధేయతతో, భర్త వెనకాలే నడుస్తుంది. అదో విచిత్రం! అయినా దానికీ ఒక కారణం ఉంది. రాజుగారు ఏదయినా తినే ముందు, ఆ పదార్థాన్నే విషం ఏదయినా ఉంటుందేమోనని, ఒక సేవకుడు తింటాడు. అలాగే ఆవిడ నడిచే మార్గంలో ముళ్ళూ గట్రా ఉంటాయేమోనని, భర్త ముందుగా నడుస్తాడేమో!
పెళ్ళయిన కొత్తల్లో మా ఆవిడకి ఏది ఇష్టమో గ్రహించడానికి నేను పెద్దగా ప్రయత్నం చేయలేదనుకోండి. అయినా, ఆఫీసునించి వచ్చేటప్పుడు, మల్లెపూలో, గులాబీలో, కనీసం కనకాంబరాలో తెస్తే ఆవిడ సంతోషిస్తుందని మాత్రం తెలిసింది. వీలయినప్పుడల్లా పూలు తేవడం అలవాటు చేసుకున్నాను. వీధిలోకి పూలు వచ్చినా, నేను తేవడంవల్ల ఆవిడకొచ్చే ఆనందం ఎక్కువని గ్రహించి అది ఒక అలవాటుగా చేసుకున్నాను. తెచ్చినప్పుడల్లా, 'నిన్నటి పూలు మీకు అంటగట్టాడండీ, ఎలాగ వాడిపోయి ఉన్నాయో చూడండి?' అనే విమర్శే కాని, తెచ్చాడే అనే సంతృప్తి కనపడదు. తేకపోతే మాత్రం, 'మీరు తెస్తారని, ఇవాళ వీధిలోకి తాజా పూలు తెచ్చినా కొనలేదు ' అని ఎదురు దాడి తప్పదు. 
నాకు హిందూ చదవడం ఇష్టం. అయినా పెద్దగా ఇంగ్లీషు చదువుకోని మా ఆవిడ కోసం అది మానేసి, ‘ఈనాడు’ తెప్పించడం మొదలెట్టాను. ‘ఈనాడు’ మాత్రం పూర్తిగా చదివేది. నేనయితే, నాకు ముఖ్యమని అనిపించే వార్తలని మాత్రమే చదివేవాడిని. ఆవిడకి అటువంటి పక్షపాత ధోరణి ఉండేది కాదు. అన్ని వార్తలనూ పూర్తిగా చదివి, తరువాత ఇది చదివారా, అది చదివారా అని నన్నడగడం కూడా చేసేది. నేను తెల్లమొహం వేయడం కూడా మామూలయింది .
నేను పుస్తకాల పురుగునే అని చెప్పాలి. వేరే ఊరు వెళ్ళినప్పుడు విధిగా రెండో మూడో పుస్తకాలు తేకుండా ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇవికాక, అప్పుడు వస్తూ ఉన్న, జ్యోతీ, యువ వంటి మాస పత్రికలూ, ప్రభా, స్వాతీ వారపత్రికలూ, ఇంగ్లీషు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ కూడ కొనే వాణ్ణి. తెలుగు పత్రికలయితే, మా ఆవిడ బయట చేరినప్పుడు, చాపమీద పడుకున్నప్పుడు తలకింద పెట్టుకోడానికి మాత్రం పనికొచ్చేవి. ఆవిడ పేజీలు తిరగెయ్యడం చూసాను కాని, పట్టుమని పది పేజీలు చదివిన దాఖలా, నాకయితే కనబడలేదు. ఈ వార పత్రికలూ, మాసపత్రికల జీవితం మహా అవుతే నెలో రెండు నెలలో ఉండేది . పేపర్లతో పాటు వాటినీ తూకానికి అమ్మేసేది. ‘కిందటి వారం పత్రిక ఎక్కడుంది’ అని అడుగుతే, ‘అది నిన్ననే కదా అమ్మేశాను’ అని సమాధానం వచ్చేది. పోతే నేను అప్పుడప్పుడు కొనే ఇంగ్లీషు నవలలకి, తెలుగు పుస్తకాలకీ ఆ గతి పట్టేది కాదు. విమానప్రయాణాలలో వాళ్ళిచ్చే పుస్తకాలు, చక్కని ఆర్ట్ పేపరు మీద ఉండి, చదివేందుకు వాటిలో ఎక్కువ ఉండకపోయినా, మంచి మంచి బొమ్మలుండి, కష్టపడి, వాళ్ళకి తెలిసో, తెలియకుండానో తీసుకొచ్చి, ఇంట్లో కనిపిస్తూ ఉంటే, విమానయానం చేసినట్టు తెలిసి వాటి వల్ల మన పరపతి పెరుగుతుందని ఎంత చెప్పినా వినదే! అటువంటి బరువయిన పుస్తకాలు కొనను మొర్రో అని అంటున్నా వినక, వాటిని కూడా పాత పేపర్లు కొనే వాడికి అంటగట్టేది. ఆవిడ ఉద్దేశంలో, కాగితాలు పొట్లాలు కట్టడానికే నిర్దేశింపబడ్డాయి. ఒకరో ఇద్దరో తన భర్తలాంటి వెర్రోళ్ళు అవి అన్నీ చదువుతారు, ఆ వెర్రి ముదరకుండా ఉండాలంటే, వాటిని దూరం చెయ్యడంకంటే వేరే మార్గం లేదు.
ఇవికాక, ఎక్కడికయినా సెమినార్లకో, మీటింగులకో వెళ్తే, వారిచ్చే సావనీర్లు కూడా చాలా పోగయేవి. వాటిల్లో అప్పుడు ఉపయోగకరమయినవి అనిపించే వ్యాసాలకోసం దాచి ఉంచేవాడిని. అయితే నేను ఊరికి వెళ్ళినప్పుడూ, చూడకుండా ఉన్నప్పుడూ, మిగతా వాటితో పాటు, నిర్దాక్షిణ్యంగా అవీ తుక్కు కాగితాలలోకి వెళ్ళిపోయేవి. 
చిరుతిళ్ళు తినే విషయంలో మాత్రం ఆవిడని ససేమిరా మార్చలేకపోయాను. ఇంట్లోకి ఏమయినా బయటనించి తినుబండారాలు తెస్తే, అవి, అరుదుగా వచ్చే అతిథులకో లేకపోతే, కొంచెం కొంచెంగా పనిమనిషికో ఇవ్వడం చేసేది, కాని, తను మాత్రం తినేది కాదు. మహా అవుతే ఇంట్లో పండగకీ పబ్బానికీ చేసే పులిహోర మాత్రం కొంచెం తినేది. అలాగే తను చేసే బజ్జీలో, అట్లో, ఏ పూరీలో, చపాతీలొ మాత్రం తినేది . మా పిల్లలయితే ఇంట్లో చేసేవీ, బయట చేసేవీ, హోటళ్ళోకెళ్ళి తినేవీ, అప్పుడప్పుడు పిజ్జాలూ తెప్పించుకుని తినడం బాగానే అలవాటు చేసుకున్నారు. మా ఆవిడ మాత్రం, మహా అవుతే ఎప్పుడయినా హోటల్లో పూరీకూర మాత్రం తినేది. అదయినా కూర సాదా సీదాగానే ఉండాలి.
పిల్లలు పెద్దవారయాక, వాళ్ళ పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళూ అయి, ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయాక, నేనూ, మా ఆవిడే ఇంట్లో మిగిలాం. మేము వాళ్ళదగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వాళ్ళ పిల్లలతో మా వద్దకి వచ్చినా, తినే విషయంలో మాత్రం మా ఆవిడ ఇంతకు మునుపుకన్నా చాదస్తం ఎక్కువయింది . వాళ్ళని తీసుకుని ఎదయినా హోటలుకి వెళ్తే, అందరూ, ఇవో అవో తింటూ ఉంటే, ఆవిడమాత్రం ఉత్త మినపట్టో, మసాలా లేకుండా ఉంటే, పూరీ కూరో తెప్పించుకునేది . ఇంటికి తిరిగి వచ్చాక మామూలుగా అన్నమే తినేది.
సరే, తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వారివే అని ఊరుకోడం తప్ప చేసేది ఏమిటి? స్టెయిన్ లెస్ స్టీలు మీద ఉండే మోజు పుస్తకాలూ, కాగితాలమీద ఆడవారికి ఉండదనే సత్యాన్ని గ్రహించడానికి, నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఏ పెళ్ళికో, ఫంక్షనుకో వెళ్తే, ఆవిడకి బొట్టు పెట్టించుకోవడం (బొట్టు ముఖ్యం కానేకాదు. బొచ్చే ముఖ్యం! ) 'వెళ్ళొస్తాం ' అని ఆ గృహిణికి చెప్పేముందే, ఆ బొచ్చేదో ఇచ్చేస్తే పోలా? అది జరగదు. 'వెళ్ళొస్తాం' అని చెప్తే, 'ఉండండి బొట్టు పెడతా', అని లోపలికి వెళ్ళి, ఈవిడ చిన్న బొచ్చె మొహమా, పెద్ద బొచ్చెదా అని నిర్ణయించి, అది తీసుకుని, ఈ లోగా ఆవిడని పలకరించేవారికి సమాధానం చెప్పి, బయటకొచ్చి, బొట్టుపెట్టి ఇచ్చేంతవరకూ, వెర్రిమొహం వేసుకుని, 'ఆ బొచ్చెకోసమే వచ్చినట్టున్నారు' అనిపించే మిగతావారి చూపులను భరించి నిలబడాలి. పోతే 'ఆ బొట్టు మా ఆవిడ మొహాన కళకళలాడుతూ ఉంటేనే నేనున్నట్టు' అని సమాధాన పడడం తప్ప, భర్తలం ఏం చెయ్యగలం? ఆవిడకి బొట్టుతో పాటు, వారిచ్చే స్టీలు బొచ్చె చాలా ముఖ్యం . అటువంటి భిక్షమెత్తి, భిక్షానికి మాత్రమే పనికొచ్చే బొచ్చెలతో మా ఇంట్లో ఒక ట్రంకుపెట్టె నిండిపోయింది. వాటిలో ఏ రెండు బొచ్చెలూ ఒక గోత్రానికి చెందినవి ఉండవు. ‘నానా గోత్రభ్యా’ గా ఉండే వాటిని, బంగారు నగలకంటే భద్రంగా దాస్తుంది. పొనీ ఏ ఫంక్షనుకి వెళ్ళినప్పుడో గిఫ్టుగా ఇద్దామనుకుంటే అది పనికిరాదు. సశాస్త్రీయంగా కొత్తగా కొని ఇవ్వవల్సిందే. ఇటువంటి బొచ్చెలు ఇచ్చేకన్నా, అరడజను కటోరీలో, డజను చెంచాలో, లేదా ఒకే రకంగా ఉండే నాలుగో ఆరో గ్లాసులో, ప్లేట్లో ఇస్తే బాగుంటుందనే నా మాట అరణ్య రోదనే. అది కుదరదు. ఎవరికీ ఉపయోగించని బొచ్చెలే ఇవ్వాలి. ఈ విషయంలో, మా ఆవిడ స్పెషలో, అందరు ఆవిడలూ అంతేనో, నాకు మాత్రం తెలియదు.
ఒకసారి, ఎవరిదో గృహప్రవేశం అవుతే, మా ఆవిడ రానందున, నేనొక్కడినే వెళ్ళవలసిన అగత్యం ఏర్పడింది. మా ఆవిడ, వందరూపాయలు పెట్టి ఏదయినా ఇవ్వండి అని హుకుం జారీ చేసింది. అక్కడి స్టీలు దుకాణంలో, కిరసనాయిలు డబ్బా సైజులో, మధ్యన మూత ఉన్న స్టీలు డబ్బా ఒకటి కనిపించింది. మా ఆవిడ బడ్జెటుకు దగ్గరలోనే ఉంది అని, అది కొని, పసిపిల్లాడిని పట్టుకున్నట్టు మోసుకొని, గిఫ్టుగా ఇచ్చాను. ఇప్పటికీ, ఆ ఇల్లాలు మేము వెళ్ళినప్పుడల్లా ఆ డబ్బా నాకు చూపించి, అది ఎంతో ఉపయోగంగా ఉందని చెప్తూ ఉంటే, మా ఆవిడ మాత్రం ముభావంగానే ఉంటుంది .
బహుమతులుగా సంగ్రహించిన స్టీలు వస్తువులలో ఒక్కటయినా ఉపయోగించే పాత్ర లాటిది ఉండదు. వంటింట్లో చిన్న గిన్నెలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ పాత్రలు నిర్వహించే పాత్ర చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒక పాత్రలో పెరుగు తోడు వెయ్యాలి అంటే దానికే వాడాలి. ఫాక్టరీ యూనియన్లలో నాయకులు ఎవరి విధులు వారే నిర్వర్తించాలి, ఇంకొకరి పనిని, ఎంత అవసరం వచ్చినా ముట్టుకోకూడదని ఎంత నిక్కచ్చిగా ఉంటారో, వీటి విషయంలో మా ఆవిడా అంతే. ఇంతకు మునుపయితే ‘ఆ మూడు’ రోజులూ వంటింట్లోకి వెళ్ళే పని పడేది. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా, ఎప్పుడయినా వంటింట్లో, కాఫీ పెట్టాల్సిన, లేక అన్నం పడేయాల్సిన అవసరమో, అగత్యమో ఏర్పడినప్పుడు, ఏదో చేస్తున్నాడు కదా అని ఊరుకోకుండా, పెరుగు తోడేసే గిన్నెలో పాలు కాచాననీ, సాయంత్రం కాఫీ గిన్నెని, ఇప్పుడు ఎందుకువాడాననో, కూర గరిట అది కాదనీ, ఇటువంటి సవాలక్ష అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉంటుంది. ఒకసారి నాకు కోపం వచ్చి ఒకే సైజులోవి రెండేసి చొప్పున మూడు సైజుల గిన్నెలు కొనుక్కొచ్చాను. వాటితో పాటు అన్నం గరిటలు రెండు కొనుక్కొచ్చాను. అవి కొన్న తరువాత ఒక సారి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఒక్కటే చిన్న గిన్నె కనిపించింది. అప్పుడు కొన్నవి ఏమయ్యాయని అడుగుతే సమాధానం, 'అవసరం ఉండదు కదా అని పెట్టెలో పెట్టేసాను'. తీద్దామా అంటే, ఆ పెట్టెమీద, అంతకన్నా బరువయిన మరో పెట్టె ఉంటుంది. లక్ష్మీదేవి గలగల అన్నట్టు, అన్ని బొచ్చెలనూ పక్కకి తీస్తే కాని మనకు కావలసిన చిన్న గిన్నె కనిపించదు. అన్నం గరిటెలు కొనడానికి ఇంకో కారణం ఉంది. పని మనిషి రెండు రోజులు నాగా పెడితే, మూడో పూట, అన్నం ఒక పెద్ద చెంచాలాంటి గరిటతో వడ్డించింది. సకారణం, ‘పనిమనిషి రాలేదు కాబట్టి అన్నం గరిటెలు అంట్లల్లో ఉండిపోయాయి’. అన్నం గరిట కడగడం ఎంతసేపు పడుతుంది? అన్నం తిన్న వెంటనే కడుక్కుంటే సరిపోతుందికదా అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. 
అసలు పనిమనిషి అన్న వ్యవస్థను సృష్టించిందే ఆవిడలు. ఒక విధంగా చూస్తే, రకరకాల వృత్తుల వారిని సమాజం పోషించడానికే ఇటువంటి పనులు కల్పింపబడ్డాయనుకున్నా, మధ్యతరగతివారికి మాత్రం వారి కాలం అంతా పనిమనిషి కేంద్రంగా తిరుగుతూ ఉంటుంది. పొద్దున్నే పనిమనిషి వచ్చాకనే రోజు మొదలవుతుంది. పనిమనుషులకి ఒక ప్రత్యేకత ఉంది. రేపు రావడంలేదని ముందు రోజు చెప్తే వాళ్ళ సొమ్మేంపోతుంది? చచ్చినా చెప్పరు. ఆ మర్నాడో తరవాత రోజో, మా పక్కింటివారికి ఒంట్లో బాగాలేదనో, బంధువులెవరో చనిపోయాడనో, ఏదో ఒక కారణం పోస్ట్ మార్టం లాగా చెప్తారు. మా ఆవిడకి పనిమనిషి రాని రోజంతా మూడ్ ఆఫ్. 'రేపు ఉదయమే బయలుదేరి వెళ్దాం' అంటే, 'పనిమనిషి అప్పటికి రాదుగా' అని వెంటనే సమాధానం. 'మనం సాయంత్రానికి తిరిగి వస్తాం కదా' అంటే, 'అంట్లు అలాగ ఉండిపోతాయి. పాచి ఇల్లు తుడవకుండా ఎలా వెళ్తాం?' అని ప్రశ్నే. ఒక్క రోజు తుడవకపోతేనో, లేకపోతే, తనే తుడుస్తే ఏమవుతుంది, అని అడగగలిగే భర్త ఎక్కడయినా ఉంటాడా!
పిల్లలొచ్చినప్పుడు మాపిల్లలకీ వాళ్ళు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలో, ఊళ్ళో చూపించాలని ఉంటుంది. ఇటువంటి పర్యాటనలకు, ఉదయమే బయల్దేరాలి కదా. నలుగురు వచ్చినప్పుడు అంట్లు ఎక్కువగానే తయారవుతాయి. వాటిని తోమడానికి పనిమనిషి సణుగుడు అటుంచి, అంత ఉదయాన్నే వచ్చే అవకాశం ఉండదుగా. దీనికి నా వద్ద ఉండే ఒకే ఒక పరిష్కారం, ఎవరూ లేవకముందే లేచి, గుట్టుచప్పుడు కాకుండా నేనే తోమడమే! కూతురయినా, కోడలయినా, లేస్తే, 'మీరు తోమడమేమిటి, నేను ఉన్నానుగా' అని సమాధానం చెప్పి నన్ను ఆ పనినించి తప్పిస్తారు. గుణుస్తూ, చేస్తారనుకోండి. 
టీవీ సంగతి ఉదహరించకుండా కుదరదు. టీవీని, 'ఇడియట్ బాక్సు ' అని ఎవరు పేరు పెట్టారో కాని, వారే ఇడియట్లు. అది లేని ఇల్లు ఊహించగలమా? దాని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆవిడలను ఆకర్షింపచేసుకుని, అనవసరమయిన గొడవలను సృష్టించకుండా ఆపగలిగిన మహాశక్తి కలిగి ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, 'దానిలో ఆడ విలన్లు ఉంటారు, కిడ్నాపులు నేర్పుతాయి, అత్తగార్లనూ కోడళ్ళనూ కొత్త కొత్త విధాలుగా హింసించే విధానాలు నేర్పుతాయీ' అని. అది శుధ్ధాబధ్ధం. టీవీలవల్ల ఎక్కువ నేర్చుకోనక్కరలేదు, స్వతహాగానే హింస అన్నది నేర్చుకునే పుడతారు. అదీ కాక, టీవీని నోరెళ్ళబట్టి చూడడం తప్ప, విచక్షణతో చూసే ఆవిడలు ఉండరు. అలా చూసే వారే ఉంటే, ఏ ఒక్క సీరియల్నీ చూడరు. ఈ సీరియళ్ళు అన్నీ, తర్కానికి నిలబడవు. విజ్ఞానానికి టీవీ చూడరు. అజ్ఞానాన్ని ప్రాచుర్యం చేయడానికే సీరియళ్ళు పుట్టాయి. 
ఇలా రాస్తున్నానని తెలుస్తే, రేపు నాకేమవుతుందోనని అనుమానంగానే ఉంది. అయినా చాలా ఆవిడలు చదువుతారనే ఆశతో రాస్తున్నాను.
రచన:-
*గాడేపల్లి సుబ్రహ్మణ్యం*
208, శ్రీ సిధ్ధివినాయకనగర్,
ఫూల్ బాగ్ రోడ్డు, విజయనగరం 535002.

కామెంట్‌లు లేవు: