4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

భోజరాజు


ఒకరోజు భోజరాజు తన రాజధాని నగరం లో మారువేషం లో తిరుగు చుండగా ఒక అందగత్తెను చూశాడు. ఆమె బంతి తో ఆడుకుంటున్నది. బంతిని చేతితో నేలకేసి కొడుతూ ఆమె ఆడుకుంటూ వుంటే, ఆమె చెవికి అలంకరించుకున్న కలువపూవు జారి ఆమె కాళ్ళ మీద పడింది. ఈ దృశ్యం రాజుకు ఎంతో మనోహరంగా కనిపించింది. కాసేపు దూరం నుండే ఆనందంగా ఆ ఆటను తిలకించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. మరునాడు సభలో తన ఆస్థాన కవులకు ఆ బంతి ఆట దృశ్యం గురించి చెప్పి ఆ ఆటను వర్ణిస్తూ తలా ఒక శ్లోకం చెప్పమని కోరాడు.
మొదట భవభూతి లేచాడు. ధాటీగా తోటక వృత్తం లో యిలా శ్లోకం చెప్పాడు
తోటక వృత్త మంటే "కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో" అన్నట్టు 'టటటా, టటటా. టటటా' అని వరుస 'స' గణాలతో సాగుతుంది)
విదితం, నను కందుక!, తే హృదయం
ప్రమదాధర సంగమ లుబ్ధ ఇతి
వనితాకర తామర సాభి హతః
పతితః పతితః పునరుత్పతసి
తా:--ఓ బంతీ! నీ ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తూ వుంది ఈ అందగత్తె ఆధారాలు
ముద్దుపెట్టుకోవాలని చాలా ఉత్సాహ పడుతున్నావు. అందుకే తామరపువ్వు లాంటి ఆమె చేతుల చేత దెబ్బలు తిని మాటి మాటి కీ క్రింద పడి కూడా లేస్తున్నావు.
(నను కందుక! ఓ బంతీ; తే-హృదయం-విదితం!=నీ హృదయమేమితో విదితమే!;
ప్రమదా-అధర-సంగమ -లుబ్ధ:-ఇతి =జవరాలి ఆధారాలను చేరాలని ఆశ పడుతున్నావు. అని; వనితా-కర-తామరస-అభిహతః ఈ ఉవిద కరకమలాల చేత కొట్టబడి కూడా పతితః పతితః = పదే పదే క్రింద పడి; పునః - ఉత్పతసి=మళ్ళీపైకి 
లేస్తున్నావు. ఎంత చక్కటి ఉత్ప్రేక్ష, అని మెచ్చుకున్నాడు రాజు.
తరువాత వరరుచి లేచాడు. తన వర్ణన యిలా చెప్పాడు.
ఏకోపి త్రయ ఇవభాతి కందుకోయం,
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః
తా:--ఈ బంతి ఒక్కటే అయినా మూడు బంతుల్లాగా కనిపిస్తున్నది. ఆ కాంత చేతిలో ఆమె అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి యెర్రని బంతిగానూ, అదే బంతి భూమి మీద పడినప్పుడు ఆమె కాలిగోళ్ళ తెల్లని కాంతి లో తెల్లగానూ, ఆ బంతే పైకి లేచినప్పుడు ఆమె కన్నుల నీలికాంతులలో నల్లటి బంతిగానూ కనిపిస్తున్నది..
(అయం-కందుకః -ఏక-అపి-త్రయః -ఇవ-భాతి =ఈ బంతి ఒక్కటే అయినా -మూడు బంతుల లాగ -ప్రకాశిస్తున్నది. కాన్తాయాః -కరతల-రాగ-రక్త-రక్తః = కాంత యొక్క
అరచేతి ఎర్రదనం చేత ఎర్రబడి యెర్రనిదిగా; భూమౌ-తత్ -చరణ-నఖ-అంశు- గౌర-
గౌరః యెర్రనిదిగా; భూమిపైన పడినప్పుడు ఆమె చరణాల గోళ్ళ-కాంతికిరణాల చేత తెల్లబడి తెల్లదిగా; ఖస్థ - సన్ - నయన-మరీచి-నీల-నీలః;ఆకాశం లో వున్నదై (పైకి లేచినప్పుడు)వున్నప్పుడు కన్నుల కాంతులచేత నల్లబడి నల్లనిదిగా) ఇది మరీ బాగున్నది అన్నాడు భోజరాజు.
ఇంతలో కవికుల గురువు కాళిదాసు లేచి ఆ దృశ్యాన్ని యిలా వర్ణించాడు.
పయోధరాకార ధరో హి కందుకః
కరేణ రోషాదభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
ఆ బంతి ఆట చూస్తే, ఆమె చెవిలో వున్న కలువమొగ్గకు భయం వేసిందట. ఎందుకు?
తన పయోధరాలను ఆ బంతి అనుకరిస్తున్నదని కోపంతో ఈ జవరాలు పదే పదే
చేతులతో కొట్టి దండిస్తున్నది. మరి కలువపూవునైన నేను ఆమె కన్నులను
అనుకరిస్తున్నాను కదా!తనను కూడా దండిస్తుందేమో నన్న భయంతోనే ఆ కలువ ఆమె పాదాలమీద పడిపోయింది క్షమించమని.
(పయోధర-ఆకార -ధరః - కందుకః ;ఆమె పాలిండ్ల ఆకారం ధరించిన బంతి ; రోషాత్ - కరేణ - ముహు: - అభిహన్యతే - హి = కోపం తో చేత్తో మాటి మాటికీ కొట్ట బడుతుంది కదా! ఇతి - ఇవ - అన్నట్టుగా,నేత్ర-ఆకృతి - భీతం - ఉత్పలం = కన్నుల ఆకారం లో వుండటం చేత భయపడ్డ కలువ పూవు: స్త్రియః - ప్రసాదాయ = ఆ స్త్రీ అనుగ్రహం కోసం:
 పాదయో:పపాత =కాళ్ళ మీద పడిపోయింది.
ఈ మూడు శ్లోకాలూ మరోసారి జాగ్రత్తగా చదివి ఎవరి వర్ణన ఎక్కువ మనోహరంగా వుందో
పాఠకులే తేల్చుకోవాలి.
వర్ణన చేసిన కవులిద్దరూ కలువపువ్వు ఆ యువతీ కాళ్ళ మీద పడిపోయిన విషయాన్ని స్పృశించ లేదు. ఆ పని కాళిదాసు మాత్రమే చేశాడు.
(చమత్కార శ్లోక మంజరి నుండి )

కామెంట్‌లు లేవు: